Crime News: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో విచిత్ర ఘటనలు నమోదవుతున్నాయి. భారాల అనే ప్రాంతంలో మహిళలను ఒక ‘దుస్తులు ధరించని సభ్యుల గ్యాంగ్’ (Crime News) హడలెత్తిస్తోంది. దారికాచి, ఒంటరిగా వెళుతున్న మహిళలను నిర్మానుష్య ప్రాంతాల్లోకి లాక్కెందుకు ఈ గ్యాంగ్ ప్రయత్నిస్తోంది. దుస్తులు లేకుండా వచ్చి మహిళలను పొలాల్లోకి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటివరకు 4 ఘటనలు నమోదయ్యాయి. దీంతో, ఈ వ్యవహారాన్ని పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులను గుర్తించేందుకు ముమ్మర దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, ఇప్పటివరకు ఎవ్వరినీ పట్టుకోలేకపోయారు. డ్రోన్ల సహాయంతో పరిసర ప్రాంతాలను పర్యవేక్షించినప్పటికీ దుండగులకు సంబంధించిన ఆచూకీని గుర్తించలేకపోయారు.
భారాల గ్రామంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఉద్యోగానికి ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు ఒంటిమీద దుస్తులు లేకుండా వచ్చి ఆమెను పంట పొలాల్లోకి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారని అన్నారు. బాధిత మహిళ గట్టిగా అరిచి, అదృష్టవశాత్తూ వారి నుంచి తప్పించుకుందని వివరించారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులు స్పందించారు. పొలాలను నాలుగు వైపులా చుట్టుముట్టి, జల్లెడ పట్టారు. కానీ, ఎవరూ దొరకలేదు. దుండగులకు సంబంధించి బాధిత మహిళ చెప్పిన వివరాల ప్రకారం, నిందితులు ఇద్దరూ దుస్తులు లేకుండా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ వ్యవహారం స్థానికంగా తీవ్ర ఆందోళనకరంగా మారింది.
Read Also- Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!
ఈ ఘటనపై బాధిత మహిళ భర్త స్పందిస్తూ, తన భార్య బాగా భయపడిపోయిందని, ఆ జాబ్ కూడా మానేసిందని చెప్పాడు. వేరే పని చూసుకొని మరో మార్గంలో రాకపోకలు సాగిస్తోందని తెలిపాడు. ఈ ఘటనపై గ్రామస్థులు స్పందిస్తూ, ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగోసారి అని చెప్పారు. అయితే, గతంలో జరిగిన ఘటనలు బయటకు రాలేదని, పరువు పోతుందేమోనన్న భయంతో ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పిందని, పోలీసుల జోక్యం ఏర్పడిందని వారు అన్నారు.
గ్రామ సర్పంచ్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ.. మొదటిసారి జరిగినప్పుడు గ్రామస్థులు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదని, కానీ ప్రస్తుతం పరిస్థితి భయానకంగా మారిందన్నారు. ఈ గ్యాంగ్ ఇప్పటివరకు మహిళలనే లక్ష్యంగా చేసుకుందని రాజేంద్ర కుమార్ అన్నారు. కాగా, పోలీసులు ఇప్పటికే పొలాల్లో సోదాలు నిర్వహించారు. గత శనివారం సీనియర్ అధికారుల సమక్షంలో డ్రోన్లతో కొన్ని గంటలపాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. స్థానిక మహిళల భద్రత దృష్ట్యా ఆ ప్రాంతంలోని కీలకమైన కొన్ని ఏరియాల్లో సీసీటీవీ కెమెరాలు కూడా బిగించారు.
Read Also- AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు
ఈ ఘటనపై మీరట్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) విపిన్ టాడా మీడియాతో మాట్లాడారు. స్వయంగా ఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన, డ్రోన్లు, గ్రామస్థుల సహకారంతో పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా గాలించామన్నారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అనుమానితులను గుర్తించలేకపోయామని, మహిళా పోలీసులను గ్రామంలో నియమించామని, అనుమానితుల కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన వివరించారు. ఈ గ్యాంగ్ భయంతో కొన్ని కుటుంబాలకు చెందిన మహిళలైతే కనీసం ఇంటి నుంచి బయటికి రావడానికే భయపడుతున్నారు. మరికొందరు ఇది కేవలం వదంతి అని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా భారాల గ్రామంలో కలకలం కొనసాగుతోంది.
