Sarfaraz Khan: టీమిండియా యువక్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ (sarfaraz khan news) దేశవాళీ క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్నప్పటికీ, జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రధాన జట్టులోకి తీసుకోవడం విస్మరిస్తున్నారనుకుంటే, ఇటీవల ప్రకటించిన ఇండియా-ఏ టీమ్‌లో కూడా చోటివ్వలేదు. దీంతో, క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మతపరమైన పక్షపాతం చూపిస్తున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు గుప్పించారు.
సీనియర్ జాతీయ జట్టుకు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడం వెనుక గంభీర్ ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ‘‘సర్ఫరాజ్ ఖాన్ ఇంటి పేరు కారణంగా ఎంపిక చేయడం లేదా!. ఈ విషయంలో గౌతమ్ గంభీర్ ఎలా వ్యవహరిస్తారో మాకు తెలుసు’’ అని షమా మొహమ్మద్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. గౌతమ్ గంభీర్ గతంలో బీజేపీలో పనిచేసిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సర్ఫరాజ్ ఖాన్ ఇంటిపేరు కారణంగా ఎంపిక చేయలేదని ఆమె పేర్కొన్నారు. కాగా, దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ అత్యంత నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. అయితే, అక్టోబర్-నవంబర్ నెలలో బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో తలపడే ఇండియా-ఏ జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు చోటివ్వలేదు. ఈ జట్టును మంగళవారం ప్రకటించగా, సర్ఫరాజ్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, షమా మొహమ్మద్ క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఆమె రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు చేసింది. రోహిత్ శర్మ లావుగా ఉన్నాడని, భారత చరిత్రలో అత్యంత నిరాశపరిచే కెప్టెన్‌గా ఇతడేనంటూ ఆమె అభివర్ణించారు. ఏఐఎంఐఎం పార్టీ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా సర్ఫరాజ్ ఎంపిక చేయకపోవడంపై స్పందించారు. దేశీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ కనీసం ఇండియా-ఏ జట్టుకు కూడా ఎందుకు ఎంపిక చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ ప్రతినిధి వారిస్ పఠాన్ మాట్లాడుతూ, ఒక ఆటగాడి సగటు ఇంత చక్కగా ఉన్నప్పుడు కూడా ఎంపిక చేయకపోవడమంటే, దీని వెనుక ఖచ్చితంగా ఇంకేదో ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.
ప్రధాన జట్టులో చోటివ్వకపోగా, ఇండియా-ఏ జట్టు నుంచి కూడా సెలక్షన్ కమిటీ తొలగించడంతో అతడికి అన్యాయం జరుగుతోందంటూ చర్చ మొదలైంది. ఇంత బాగా ఆడుతున్న ఈ ముంబై బ్యాటర్ కనీసం ద్వితీయ శ్రేణి జట్టుకు కూడా పరిగణనలోకి తీసుకోరా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Read Also- YS Jagan Trolled: ఏంటీ?.. వైఎస్ జగన్ లేడీస్ షూస్ వేసుకుంటున్నారా?.. నిజమెంత?, వాటి రేటు ఎంత?
చివరిసారిగా 2024లో ఆడాడు
సర్ఫరాజ్ ఖాన్ చివరిగా 2024 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా తరఫున ఆడాడు. అయితే, ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అవకాశం దక్కలేదు. ఫిట్‌నెస్ మెరుగుపరుచుకున్నప్పటికీ, ఆ తర్వాత జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌కూ ఎంపిక చేయలేదు. తాజాగా, వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు కూడా అతడిని పట్టించుకోలేదు. ఇప్పుడు కనీసం దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో ఆడబోయే సిరీస్‌కు చోటు దక్కకపోవడంతో సెలక్టర్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్, ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ టెస్టులు ఆడి దాదాపు 40 సగటుతో 371 పరుగులు చేశాడు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన తన చివరి సిరీస్‌లో ఒక సెంచరీ (150) నమోదు చేశారు.
