India VS Australia: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం సిడ్నీలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ మైదానం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాపై భారత్ (India VS Australia) గ్రాండ్ విక్టరీ సాధించింది. టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో చిరకాలం గుర్తుండిపోయే విజయం దక్కింది. 237 పరుగుల లక్ష్య చేధనలో వీరిద్దరూ కలిసి రెండవ వికెట్‌కు ఏకంగా 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 121 పరుగులతో భారీ శతకం సాధించాడు. ఓపెనర్‌గా మైదానంలోకి అడుగుపెట్టి చివరివరకు నాటౌట్‌గా నిలిచాడు. ఇక, విరాట్ కోహ్లీ 74 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. లక్ష్య చేధనలో భారత్ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వ్యక్తిగత స్కోరు 24 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. భారత్‌కు 18 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో, 38.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఏకంగా 9 పరుగుల తేడాతో సూపర్ డూపర్ విక్టరీని అందుకుంది.
రోహిత్-కోహ్లీ జోడి అరుదైన రికార్డు
ఈ మ్యాచ్‌లో అద్భుత భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సాధించారు. వన్డేల్లో అత్యధికసార్లు 150కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీల జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ సరసన చేరారు. 12 సార్లు 150కిపైగా పార్టనర్‌షిప్స్ సాధించారు. ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన దిల్షాన్-సంగక్కర మూడవ స్థానంలో నిలిచారు. 7 సార్లు 150కి పైగా భాగస్వామ్యాలు సాధించారు.
జూనియర్లకు నేర్పించడం మా బాధ్యత: రోహిత్
అద్భుతమైన సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోహిత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాలో ఊహించింది ఇదేనని, ఇక్కడ ఆడడం అంత ఈజీ కాదని చెప్పాడు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని, అందులోకి తాను చాలా కాలం క్రికెట్ ఆడలేదని ప్రస్తావించాడు. అయితే, ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి ముందు బాగా ప్రాక్టీస్ చేశానని వెల్లడించాడు. సిరీస్‌ను గెలవలేకపోయినప్పటికీ, సిరీస్‌లో చాలా పాజిటివ్ అంశాలు నేర్చుకుంటామని రోహిత్ శర్మ చెప్పాడు. యువ క్రికెటర్లు చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవని, తాను మొదటిసారి ఆసీస్‌ల ఆడినప్పుడు సీనియర్లు ఎలా సాయపడ్డారో, ఇప్పుడు తాము కూడా ఆ సందేశాన్ని వారికి అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్టు అన్నాడు. విదేశాల్లో క్రికెట్ ఆడటం ఎప్పుడూ సులభం కాదని, టీమిండియాలో చాలామంది యువ ఆటగాళ్లు ఉన్నారని, వారికి సరైన గేమ్-ప్లాన్ ఉండాలని సూచించాడు. తాను ఇప్పటికీ బేసిక్స్‌కి కట్టుబడి ఆడతానని, ఇదే విషయాన్ని వారికి కూడా చెబుతానని అన్నాడు.
విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడాన్ని ఉద్దేశిస్తూ, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం చాలా ఉండవచ్చు, కానీ ఆటగాళ్ల అనుసరించాల్సిన మార్గాలను మ్యాచ్ చూపిస్తుందని వ్యాఖ్యానించాడు. మరికొన్ని రోజుల్లో తనకు దాదాపు 37 ఏళ్లు వస్తాయని, అయితే, లక్ష్య చేధనలో తనలోని అత్యుత్తమ ఆటతీరు బయటకు వస్తుందని చెప్పాడు. మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించడం పట్ల సంతోషంగా ఉందని చెప్పాడు.
