IND vs BAN Clash: ఆసియా కప్-2025లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య (IND vs BAN Clash) బుధవారం (సెప్టెంబర్ 24) రాత్రి కీలకమైన సూపర్-4 మ్యాచ్ జరగనుంది. అయితే, మ్యాచ్‌కు ఒక రోజు ముందు బంగ్లా హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ భారత జట్టుపై అనూహ్య వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఓడించలేనంత జట్టు కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రతి జట్టుకీ భారత్‌ను ఓడించే సత్తా ఉందని వ్యాఖ్యానించాడు. ఆ రోజు ఏం జరుగుతుందనేది ముఖ్యమని, ఇంతకుముందు భారత జట్టు ఏం సాధించిందనేది అనవసరమని పేర్కొన్నాడు. బుధవారం మ్యాచ్ జరిగే ఆ మూడున్నర గంటల్లో ఏం జరుగుతుందో చూడాలన్నారు. తాము బెస్ట్ ఆట తీరుని కనబరుస్తామని ఫిల్ సిమ్మన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్ బలహీనతలను గుర్తించి, తదనుగుణంగా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. ఆసియా కప్‌లో వరుసగా నాలుగు విజయాలు సాధించి వస్తున్న టీమిండియా ఓడించగలరా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. టీ20 ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలిచిన టీమిండియాతో తలపడబోతున్నప్పటికీ బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇస్తుందని ఫిల్ సిమ్మన్స్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
Read Also- UPI Miracle: భార్య ఫోన్ పోయిందనుకున్న వ్యక్తికి ‘యూపీఐ మిరాకిల్’
భారత్ మ్యాచ్‌లకు అందుకే హైప్
భారత్ ఆడే మ్యాచులకు ఎప్పుడూ హైప్ ఉంటుందని, టీ20 ఫార్మాట్‌లో నెంబర్ 1 జట్టు కావడమే ఇందుకు కారణమని ఫిల్ సిమ్మన్స్ చెప్పాడు. హైప్ మధ్య జరిగే మ్యాచుల్లో ఆవేశం కనిపించడం సహజమేనని, తాము ఆ హైప్‌ను ఎంజాయ్ చేస్తామని అన్నాడు. మిగతా మ్యాచ్‌లతో పోల్చితే భారత్‌తో జరిగే మ్యాచ్‌ను మరింత ఆస్వాదిస్తామని సిమ్మన్స్ అన్నాడు. టీ20 ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌కు అంత సానుకూల ఫలితాలు లేకపోయినా సూపర్-4లో శ్రీలంకపై దక్కిన విజయంతో తమ జట్టు ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందని సిమ్మన్ వ్యాఖ్యానించాడు. సూర్యకుమార్ యాదవ్, అతడి సారథ్యంలోని భారత జట్టు గత నాలుగు మ్యాచుల్లో చెలరేగి ఆడినప్పటికీ, గత మ్యాచ్‌ల ఫలితం అనవసరమని పేర్కొన్నాడు. బుధవారం ఏం జరుగుతుందనేది ముఖ్యవమని సిమ్మన్స్ స్పష్టం చేశాడు.
వికెట్, టాస్ గురించి ఏమన్నాడంటే
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, టాస్ పెద్దగా ప్రభావం చూపబోదని ఫిల్ సిమ్మన్స్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో పోల్చితే, వికెట్‌లో పెద్దగా వ్యత్యాసం ఏమీ కనిపించడం లేదని, చాలా రోజుల తర్వాత తాను చూసిన బెస్ట్ వికెట్లలో ఒకటని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్‌పై బౌలర్లు జాగ్రత్తగా బౌలింగ్ చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డాడు. దుబాయ్, అబుదాబిలలో సెప్టెంబర్ నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో టీ20 మ్యాచ్‌లు ఆడటం శరీరానికి చాలా ఒత్తిడిగా అనిపిస్తుందని వ్యాఖ్యానించాడు. ఎలాంటి జట్టుకైనా ఇదే భావన ఉంటుందని, కానీ తాము కఠినంగా ప్రాక్టీస్ చేశామని, ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారని ఫిల్ సిమ్మన్స్ వివరించాడు.