Kolkata Rainfall: సోమవారం రాత్రి పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్‌కతాను తీవ్రాత తీవ్రమైన వర్షం (Kolkata Rainfall) కుదిపేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా 24 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో నగరం కకావికలం అయ్యింది. అకస్మాత్తు వరదల ధాటికి ఏకంగా 9 మంది చనిపోయారు. వేర్వేరు ఘటనల్లో వీళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. నగరంలో అత్యధిక ప్రాంతాలు వరదమయం కావడంతో నగరం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ట్రాఫిక్‌కు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. కోల్‌కతా విమానాశ్రయంలో రన్‌వేపై కూడా నీళ్లు నిలిచాయి. దీంతో, ఏకంగా 30 విమానాలను రద్దు చేశారు. మరో 50కి పైగా విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడిందని సంబంధిత అధికారులు తెలిపారు. దుర్గా పూజకు కొన్ని రోజుల ముందు కురిసిన ఈ వర్షం నగరవాసులకు ఇబ్బందులకు గురిచేస్తోంది.
6 గంటల్లో 22 రోజుల వర్షపాతం
కోల్‌కతా నగరంలో సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు 178.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. సూచించిన ఈ కాలంలో సాధారణ వర్షపాతం 213.7 మిల్లీమీటర్లు, కాగా 16 శాతం తక్కువగా నమోదయింది. అయితే, సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి ఇవాళ (మంగళవారం) ఉదయం 8:30 గంటల మధ్య నగరంలో ఏకంగా 247.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ వర్షపాతంలో చాలా వరకు రాత్రి కొన్ని గంటల వ్యవధిలో పడింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం గణాంకాలను విడుదల చేసింది. కాగా, కోల్‌కతా నగరంలో ప్రస్తుత పరిస్థితులు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో ఫొటోలు, వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. అనేక ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ట్రాఫిక్ విషయానికి వస్తే రోడ్లపై వాహనాలతో పాటు రైలు, మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. నగరంలో మొత్తం 9 మంది చనిపోగా అందులో కొందరు విద్యుత్ షాక్‌ల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కోల్‌కతా మేయర్ ఫిర్హాదు హకీం.. నగర ప్రజలను ఇంటిలోనే ఉండాలని సూచించారు. మళ్లీ వర్షం కురవకుండా ఉంటే మరో 12 గంటల్లో పరిస్థితులు చక్కబడతాయని చెప్పారు.
Read Also- Money Fraud: కాన్ఫరెన్స్‌లో అమిత్ షా, అజిత్ దోవల్ ఉన్నారంటూ మాట్లాడించి.. బంధువుకు కుచ్చుటోపీ
ఇంత వర్షానికి కారణమేంటి?
ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ప్రభావంతో ఈ భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ కార్యాలయం పేర్కొంది. కోల్‌కతా, హూగ్లీ, హౌరా సహా గంగా నదీ పరివాహక ప్రాంతంలో ఈ భారీ వర్షం కురిసిందని తెలిపింది. అల్పపీడనం కదలిక అదే ప్రాంతంలో కొనసాగుతుండడంతో రాగల 24 గంటల పాటు అవే ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది. కాబట్టి, కోల్‌కతా నగరివాసులు మరిన్ని వర్షాలకు సంసిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
కొల్‌కతా నగరం, దాని సబర్బన్ ఏరియాల్లో సోమవారం రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల మధ్య తీవ్రమైన వర్షం కురిసింది. వీధులు, ఇళ్లను వరదనీరు ముంచెత్తింది. నగరం రహదారులు, వీధులు వాగులు వంకల్లా మారిపోయాయి. కొల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం, వర్షానికి అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బాల్లిగంజ్ (295 మిమీ), గారిహాట్ (262 మిమీ), జడవపూర్ (258 మిమీ), అలిపూర్ (240 మిమీ), ముఖుందపూర్ (280 మిమీ) ప్రాంతాలు కూడా ఉన్నాయి. కోల్‌కతాలో 24 గంటల్లో సాధారణ వర్షపాతం కంటే 2,663 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. హౌరాలో 1,006 శాతం, ఉత్తర 24 పరగనాలులో 857 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయిందని వివరించారు.
Read Also- Shreyas Iyer: అయ్యర్‌కు ఏమైంది?.. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఇండియా-ఏ టీమ్ నుంచి వైదొలగిన వైనం