Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవిని రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid:) వీడటం వెనుక, పైకి తెలియని కారణాలు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఐపీఎల్ సీజన్‌లో జట్టు దారుణంగా విఫలం కావడంతో, ఫ్రాంచైజీ ప్రస్తుతం కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థితిలో నిలిచిందని, అయితే, అందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేకపోవడంతోనే కోచ్ బాధ్యతల నుంచి ఆయన వైదొలగి ఉండవచ్చంటూ క్రికెట్ వర్గాల్లో విశ్లేషణలు వినపడుతున్నాయి. ఈ వాదనకు బలం చేకూర్చుతూ.. ఐపీఎల్‌లో రెండు మూడు జట్లకు సపోర్ట్ స్టాఫ్‌గా పనిచేసిన ఓ భారతీయ కోచ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఒక ఐపీఎల్ జట్టుతో పనిచేసే ఎవరైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హెడ్ కోచ్‌కు ‘విస్తృతమైన పాత్ర’ ఆఫర్ చేస్తే, అది ఒక విధంగా శిక్షతో సమానమైన ప్రమోషన్‌గా అనుకోవాలి. అంటే, జట్టు నిర్మాణ ప్రక్రియలో భాగం అసలు భాగస్వాములు కాబోరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ద్రవిడ్ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని, అంతర్గతంగా అసంతృప్తి, లేదా జట్టులో ఆయన పాత్ర పరిధిని తక్కువ చేసే అవకాశాన్ని ముందుగానే ఆయన ఊహించి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- Crime News: భార్య, అత్తను చంపేసిన వ్యక్తి.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ద్రవిడ్ నిర్ణయానికి అసలు కారణం ఇదేనా?
రాజస్థాన్ రాయల్స్‌కు చాలాకాలంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్ ఇప్పటికే జట్టుని వీడబోతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. 2025 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ముగిసిన నేపథ్యంలో, కొత్త కెప్టెన్సీ కోసం ఫ్రాంచైజీ సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సీజన్‌లో సంజూ గాయం కారణంగా అందుబాటులో లేని మ్యాచ్‌ల్లో రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో జట్టుకు స్థిరత్వం వస్తుందని యాజమాన్యం నమ్ముతోంది. అయితే, అదే జట్టులో యశస్వి జైస్వాల్ అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు ఉన్నప్పటికీ, రియాన్‌కు నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలన్న నిర్ణయానికి రాహుల్ ద్రావిడ్ అంగీకరించారా? లేదా? అన్నది ఓ పెద్ద ప్రశ్నగా మారింది.
మరోవైపు, ధ్రువ్ జురెల్ కూడా జట్టులో ఉన్నాడు. కెప్టెన్ ఎంపిక ఇతర నిర్ణయాల విషయంలో రాహుల్ ద్రవిడ్ అసంతృప్తిగా ఉన్నాడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జైస్వాల్, జురెల్ లాంటి ఆటగాళ్లను కాదని రియాన్‌ను ప్రమోట్ చేయాలన్న ఆలోచన, ద్రవిడ్‌కు నచ్చని అంశం కావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. జట్టులో మార్పులు తన ఆలోచనలకు అనుగుణంగా లేవని ద్రవిడ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Read Also- Nabha Natesh: అక్కడ విశేషాలు పంచుకున్న ఇస్మార్ట్ ముద్దుగుమ్మ.. మరీ టాలెంటెడ్‌గా ఉన్నావే..
రాజస్థాన్ ప్రకటన ఏంటి?
ఐపీఎల్ 2026ను దృష్టిలో ఉంచుకొని టీమ్ నిర్మాణాత్మక మార్పులకు సంబంధించి ఇటీవల నిర్వహించిన సమీక్షలో.. అత్యంత కీలకమైన బాధ్యతలు చేపట్టాలంటూ రాహుల్ ద్రవిడ్‌కు ఆఫర్ ఇచ్చామని, కానీ, ద్రవిడ్ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ప్రకటించింది. జట్టు కోచ్‌గా బాధ్యతల నుంచి దిగిపోతానంటూ చెప్పాడంటూ శనివారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. మరింత విస్తృతమైన బాధ్యతను ఆఫర్ చేసినప్పటికీ ఆయన ఒప్పుకోలేదని, కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ చెప్పాడని పేర్కొంది. ‘‘ రాజస్థాన్ రాయల్స్ ప్రయాణంలో రాహుల్ ద్రవిడ్ ఎన్నో ఏళ్లపాటు కేంద్ర బిందువుగా ఉన్నారు. ఆయన నాయకత్వం ఒక తరం ఆటగాళ్లను ఎంతగానో ప్రభావితం చేసింది. టీమ్‌లో బలమైన విలువలు, ఫ్రాంచైజీతో విడదీయరాని సంస్కృతిని నెలకొల్పి, బలమైన ముద్ర వేశారు. ప్రాంచైజీకి అత్యద్భుతమైన సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్‌కు రాజస్థాన్ రాయల్స్, టీమ్ ఆటగాళ్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది అభిమానులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు’’ అని ఒక ప్రకటనలో ఫ్రాంచైజీ పేర్కొంది. కాగా, రాహుల్ ద్రవిడ్ ప్రస్తుత వయసు 52 సంవత్సరాలు. రాజస్థాన్ రాయల్స్‌కు కొన్నేళ్లపాటు కోచ్‌గా వ్యవహరించేందుకు గతేడాది ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ, కనీసం ఏడాది కూడా పూర్తవ్వకుండానే బాధ్యతల నుంచి వైదొలగబోతున్నట్టు రాజస్థాన్ రాయల్స్‌కు తెలిపారు.