Mithun Manhas: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ (Mithun Manhas) ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల నుంచి రోజర్ బిన్నీ వైదొలగిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ శుక్లా ఇకపై ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. మరోవైపు, నూతన అధ్యక్షుడితో పాటు కొత్తగా ఇద్దరు సెలెక్టర్లను కూడా బీసీసీఐ ప్రకటించింది. ఆర్పీ సింగ్, ప్రగ్ఞాన్ ఓజా కొత్తగా సెలక్షన్ ప్యానెల్‌లో చేరనున్నారు. అజిత్ అగార్కర్ పురుషుల సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగనుండగా, వీరిద్దరూ కొత్త సభ్యులుగా జతచేరుతారు. సెలక్షన్ కమిటీలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉండగా, శివసుందర్ దాస్, అజయ్ రాత్రా ఇప్పటికే సభ్యులుగా కొనసాగుతున్నారు.
ఎవరీ మిథున్?
మిథున్ మన్హాస్ జమ్మూ కాశ్మీర్‌లోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన డోడా జిల్లాకు చెందినవారు. కేంద్రం సైన్స్, టెక్నాలజీ మంత్రి డా. జితేంద్ర సింగ్ స్వస్థలం కూడా ఇదే కావడం గమనార్హం. మొత్తం 157 ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన మిథున్ బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా ఎంపికవ్వడం క్రికెట్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఈ నిర్ణయాన్ని ఎవరూ పెద్దగా ఊహించలేదు. మిథున్ మన్సాస్ ఢిల్లీ జట్టుకు గతంలో కెప్టెన్‌గా వ్యవహరించారు. తన ఐపీఎల్ కెరీర్‌లో మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సుధీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టలేదు. టీమిండియా తరపున చోటుదక్కలేదు.
Read Also- Future City: ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన.. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మిథున్ మన్హాస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఏకంగా 9,714 పరుగులు సాధించారు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్-ఏ క్రికెట్‌లో 4,126 పరుగులు సాధించారు. ఐపీఎల్ కెరీర్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, పూణె వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరపున ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ, భారత జాతీయ జట్టులో ఆడే అవకాశం మాత్రం ఆయనకు దక్కలేదు. 2022 సీజన్‌లో ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి కోచ్‌గా కూడా వ్యవహరించారు.
Read Also- Transgenders: ట్రాన్స్ జెండర్స్ చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా?.. దాని వెనుకున్న రహస్యం ఇదే!
2016-17 సీజన్‌లో గౌతమ్ గంభీర్ తిరిగి ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా రావడంతో మిథున్ మన్హాస్ జమ్మూ కశ్మీర్‌కు మారాలని నిర్ణయించుకున్నారు. జమ్మూ కశ్మీర్‌కు ఒక ఏడాది ఆడారు. కానీ, ఫలితాలు మాత్రం ఆశించినంతంగా రాలేదు. ఆ తర్వాత రాష్ట్ర క్రికెట్ సంఘంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో పరిపాలకుడి పాత్రను స్వీకరించారు. అక్కడి నుంచి ఇప్పుడు ఏకంగా బీసీసీఐ అధ్యక్షుడి స్థాయికి ఆయన ఎదిగారు.