Australia vs India: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి బౌలింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ ను 236-10 (46.4) స్కోరుకే ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రానా 4 వికెట్ల తో చెలరేగి.. ఆసీస్ ను భారీగా దెబ్బతీశాడు. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో ఎలాగైన గెలవాలని పట్టుదలగా ఉంది.
అంతకుముందు టాస్ గెలిచిన ఆసీస్ జట్టు.. భారత్ ను బౌలింగ్ కు ఆహ్వానించింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29) జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడికి టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ చెక్ పెట్టాడు. 29 పరుగులతో ఫామ్ లోకి వస్తున్న హెడ్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 88-2 స్కోర్ వద్ద మిచెల్ మార్ష్ ను, 124-3 వద్ద మ్యాథ్యూ షార్ట్ (30) పెవిలియన్ చేరారు. అయితే రెన్షా (56) అర్ధ శతకంతో ఇన్నింగ్స్ నిలబెట్టడానికి ప్రయత్నించినప్పటికీ అతడికి సరైన సపోర్ట్ లభించలేదు. భారత బౌలర్ల ధాటికి అలెక్స్ క్యారీ (24), కూపర్ కొన్నొల్లి (23) తక్కువ పరుగులకే మైదానాన్ని వీడారు. నాథన్ ఎల్లిస్ (16) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఆసీస్ 46.4 ఓవర్లకు 236 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే.. నవీన్ యాదవ్ గెలుపు పక్కా.. మంత్రి పొన్నం ప్రభాకర్
భారత బౌలింగ్ విషయానికి వస్తే.. పేసర్ హర్షిత్ రానా ఈ మ్యాచ్ సత్తా చాటాడు. 8.4 ఓవర్లలో 39 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. తొలి రెండు వన్డేలతో పోలిస్తే ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అంచనాలకు తగ్గట్లు రాణించడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే 50 ఓవర్లలో 237 పరుగులు చేయాల్సి ఉంది.
