India vs South Africa: వైజాగ్ వేదికగా జరిగిన మూడవ వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం ముగ్గురంటే ముగ్గురు బ్యాటర్లు ఊదిపడేశారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన శతకంతో కదం తొక్కగా, దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెరో అర్ధ శతకంతో చెలరేగారు. దీంతో, భారత్ కేవలం 39.5 ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
వాళ్లకు దక్కింది ఒక్క వికెటే
భారత బ్యాటింగ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగారు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్ స్టార్ రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, రోహిత్ ఔటయ్యే సమయానికే మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 116 (నాటౌట్), రోహిత్ శర్మ 75, విరాట్ కోహ్లీ 65 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు. వీరు ముగ్గురూ కలిపి 8 సిక్సర్లు, 25 ఫోర్లు బాదిపడేశారు. కాగా, యశస్వి జైస్వాల్‌కు వన్డేల్లో ఇది తొలి శతకం. మరోపక్క దిగ్గజ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సాధించిన 75 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
రాణించిన భారత బౌలర్లు
రాంచీలో తొలి వన్డే, ఆ తర్వాత రాయ్‌పూర్‌లో రెండో వన్డేలో భారీగా పరుగులు సమర్పించుకున్న టీమిండియా బౌలర్లు, చివరిదైన వైజాగ్ వన్డేలో కాస్త ఫర్వాలేదనిపించారు. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెలరేగడంతో పర్యాటక సఫారీ జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే, సహచర ఆటగాళ్లు ఎవరూ భారీ స్కోర్లు సాధించలేకపోయినప్పటికీ, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు. 89 బంతులు ఎదుర్కొని 106 పరుగులు బాదాడు. ఇందులో 6 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్లలో రియాన్ రికెల్టన్ 0, తెంబా బవూమా 48, మ్యాథ్యూ బ్రీజ్కీ 24, ఐడెన్ మార్క్రమ్ 1, డెవాల్డ్ బ్రెవీస్ 29, మార్కో యన్సెస్ 17, కోర్బిన్ బాష్ 9, కేశవ్ మహారాజ్ 20 (నాటౌట్), లుంగి ఎంగిడి 1, బార్ట్‌మాన్ 3 చొప్పున పరుగులు చేశారు.
Read Also- Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో మరో వింత.. కోతులను పడుతున్న అభ్యర్థి.. 300 వరకూ పట్టివేత
కుల్దీప్ యాదవ్ పంజా
భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. ఇక, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 4, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు 12 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, పేసర్ అర్షదీప్ సింగ్ టీమిండియాకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే రియాన్ రికెల్టన్ వికెట్ తీశాడు.

