IND vs SA 2nd T20I: దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20 సిరీస్ లో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన తొలి టీ20లో 101 పరుగుల తేడాతో దక్షిణాఫికాను ఓడించింది. ఈ నేపథ్యంలో పుల్ జోష్ లో భారత యువ ఆటగాళ్లు.. ఇవాళ జరిగే రెండో టీ20లోనూ గెలిచి సిరీస్ పై పట్టు సాధించాలని భావిస్తున్నారు. మరోవైపు భారత్ పై ఘోర ఓటమి తర్వాత గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని కెప్టెన్ మార్క్‌రమ్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు కసిగా ఉంది. అయితే రెండో టీ20 మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే భారత జట్టులో కీలక మార్పు జరిగే అవకాశముందని అంటున్నారు. వాటికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సంజూకు చోటు!
చండీగఢ్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేటి రెండో టీ 20 జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే నేటి మ్యాచ్ లో జట్టులో ఓ మార్పు జరిగే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. టీ20ల్లో వరుసగా విఫలమవుతూ వస్తోన్న గిల్ ను పక్కన పెట్టి రెండో టీ20లో సంజూ శాంసన్ కు అవకాశం కల్పించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. గాయం తర్వాత తొలి టీ20లో పునరాగమనం చేసిన గిల్.. మెుదటి ఓవర్ లోనే పెవిలియన్ చేరాడు. దీంతో మిగతా బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడింది. దీనికి తోడు గిల్ వరుసగా విఫలమవుతూ వస్తున్న నేపథ్యంలో అతడి స్థానంలో సంజూకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదని సమాచారం. గిల్ మినహా తొలి టీ-20లో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
పిచ్ రిపోర్ట్.. వర్షం ముప్పు?
ముల్లాన్ పూర్ లో నేడు జరగనున్న మ్యాచ్ కు ఓ ప్రత్యేక ఉంది. ఆ స్టేడియంలో జరగబోతున్న తొలి అంతర్జాతీయ పురుషుల మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఈ ఐపీఎల్ లో ఈ స్టేడియంలో పలు మ్యాచ్ లు జరిగాయి. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. ఎర్రమట్టి పిచ్ కావడం, గ్రాస్ కాస్త ఎక్కువగా ఉండటం వల్ల ప్రారంభ ఓవర్లలో బౌన్స్ రాబట్టవచ్చని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. పేసర్లకు ఇది అనుకూలించనున్నట్లు చెప్పారు. ముల్లాన్ పూర్ లో సాయంత్రం వాతావరణం చాలా చల్లగా మారవచ్చు. ఉష్ణోగ్రతలు 8°C నుండి 24°C వరకు వచ్చు. కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ మ్యాచ్ పై ప్రభావం చూపవచ్చు. తొలుత బౌలింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్ కానుంది. అయితే మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్థానిక వాతావరణశాఖ పేర్కొంది.
Also Read: ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. దుమ్మురేపిన రోహిత్, కోహ్లీ.. టాప్-2 స్థానాలు కైవసం
హార్దిక్ పాండ్యా అదరహో…
దక్షిణాఫ్రికా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దుమ్మురేపిన సంగతి తెలిసిందే. గాయం నుంచి తిరిగి జట్టులోకి వచ్చిన హార్దిక్.. మరోమారు సత్తా చాటాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ 29 బంతుల్లోనే 59 పరుగులు బాది అజేయ అర్ధ శతకం చేశాడు. అటు బౌలింగ్ లోనూ కట్టుదిట్టంగా బంతులు వేసి ఒక వికెట్ తీశాడు. టీ20ల్లో ఇప్పటివరకూ 99 వికెట్లు తీసిన హార్దిక్.. నేటి మ్యాచ్ లో మరో వికెట్ పడగొడితే 100 వికెట్ల క్లబ్ లో చేరతాడు. మరోవైపు కెప్టెన్ సూర్య కుమార్ సైతం గిల్ తరహాలోనే గత కొద్దిరోజులుగా విఫలమవుతాడు. కాబట్టి రెండో టీ20లోనైనా అతడు మునుపటి ఫామ్ ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో పాటు, జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
భారత జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్/ సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్

