Ind Vs Pak Final: భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ (Ind Vs Pak Final) అంటే ఎనలేని ఆదరణ ఉంటుంది. ఇరుదేశాలకు చెందిన అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఆసక్తిగా మ్యాచ్‌లను వీక్షిస్తుంటారు. ఇక, మ్యాచ్ జరిగే స్టేడియాలకు ఫ్యాన్స్ పోటెత్తుతుంటారు. అయితే, ఆసియా కప్-2025లో లీగ్ దశ, సూపర్-4 దశలో దాయాదులైన భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని సీన్లు కనిపించాయి. లీగ్ మ్యాచ్‌లో చాలా సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. సూపర్-4 మ్యాచ్‌లో వీక్షకుల సంఖ్య మరింత తగ్గిపోవడంతో పెద్ద సంఖ్యలో సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. మరి, ఫైనల్ మ్యాచ్‌లోనైనా టికెట్లు అన్నీ సేల్ అయ్యాయా? అనే సందేహం కలగడం సహజం. అయితే, భారత్-పాక్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుండగా, ఇప్పటికే టికెట్లు మొత్తంగా అమ్ముడుపోయాయని సంబంధిత వర్గాలు ప్రకటించాయి.
Read Also- Ind Vs Pak Final: భారత్-పాక్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు అభిషేక్ శర్మ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు
దుబాయ్ స్టేడింయలో మొత్తం 28,000 సీట్లు ఉండగా, మొత్తం నిండిపోయనున్నాయని వెల్లడించాయి. కాగా, సెప్టెంబర్ 14న జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌కు సుమారు 20,000 మంది ప్రేక్షకులు మాత్రమే హాజరయ్యారు. సెప్టెంబర్ 21న జరిగిన సూపర్-4 మ్యాచ్‌కు 17,000 మంది ప్రేక్షకులు తరలి వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ బలంగా డిమాండ్లు వినిపించాయి. ఆ ప్రభావం స్టేడియానికి తరలివెళ్లే అభిమానులపై కూడా పడింది. అయితే, అందుకు భిన్నంగా భారత్ – పాకిస్థాన్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు టికెట్లు అన్నీ సేల్ కావడంతో మ్యాచ్ చరిత్రలో నిలిచిపోనుంది. ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌పై ఎంత ఆసక్తి నెలకొందో అమ్ముడుపోయిన టికెట్లు ప్రతిబింబిస్తున్నాయి.
Read Also- Mithun Manhas: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్.. ఎవరీ వ్యక్తి?
ఈ ఫైనల్ ప్రత్యేకత ఇదే
గత 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడడం ఇదే మొదటిసారి. అందుకే ఈ ఫైనల్‌కు విశేషమైన ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత టోర్నమెంట్‌లో టీమిండియా ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా ఎదుర్కొలేదు. గెలుపుల పరంపరతో ఫైనల్ మ్యాచ్‌కు దూసుకొచ్చింది. గ్రూప్ దశలో 7 వికెట్ల తేడాతో, సూపర్-4 దశలో 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను టీమిండియా ఇప్పటికే రెండు సార్లు మట్టికరిపించింది. ఆట విషయం పక్కనపెడితే పలు వివాదాలు చెలరేగాయి. మ్యాచ్‌లలో హ్యాండ్ షేక్ లేకపోవడం, మీడియా సమావేశాల్లో విమర్శల నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌కు ముందు మరింత ఉద్విగ్నపూర్వక వాతావరణం నెలకొంది.
కాగా, భారత్-పాకిస్థాన్ మధ్య మొత్తం 12 సార్లు ఫైనల్స్ ఆడగా, భారత్ 4 సార్లు మాత్రమే విజయాలు సాధించింది. పాకిస్థాన్ మాత్రం ఏకంగా 8 సార్లు గెలుపులు సాధించింది. ఈ గణాంకాలను బట్టి భవిష్యత్ ఫలితాలను అంచనా వేయలేం. ఎందుకంటే, టీమిండియా ప్రస్తుతం చక్కటి ఫామ్‌లో ఉంది. కాబట్టి ఫైనల్ మ్యాచ్‌లో రాణిస్తే తిరుగులేకుండా విజయం సాధిస్తుంది.