India vs Pakistan: ఇరుదేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా, ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య (India vs Pakistan) జరిగే మ్యాచ్‌ను ‘పైకి కనిపించని రీతి’లో బహిష్కరించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకుగానూ సరికొత్త పంథాను ఎంచుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 14) జరిగే ఈ మ్యాచ్‌కు బీసీసీఐ పెద్దలు ఎవరూ హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు అధికారిక ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, బీసీసీఐకి చెందిన అధికారులు ఎవరూ దుబాయ్‌లో జరిగే దాయాదుల పోరుకు హాజరుకాకపోవచ్చని ‘దైనిక్ జగరణ్’ కథనం పేర్కొంది.
దుబాయ్‌లో జరగబోతున్న ఈ ఉత్కంఠభరిత పోరుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నా, బీసీసీఐ పెద్దలు ఎవరూ ఇంకా అక్కడకు చేరలేదని సమాచారం. మ్యాచ్ రోజు కేవలం ఒక్క అధికారి మాత్రమే స్టేడియానికి వెళ్తారని కథనం తెలిపింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సభ్యుడిగా ఉన్న రాజీవ్ శుక్లా మాత్రమే మ్యాచ్‌కు హాజరు కావొచ్చని ‘దైనిక్ జాగరణ్’ కథనం తెలిపింది. అయితే, ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువని సమాచారం. కాగా, ఈ ఏడాది దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ తలపడినప్పుడు బీసీసీఐ టాప్ అధికారులు, అనేక రాష్ట్రాల క్రికెట్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. కానీ, ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది.
Read Also- Mirai success meet: ‘మిరాయ్’ సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయిన మంచు మనోజ్.. ఎందుకంటే?
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత-పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కారణంగా, ఇండియా వేదికగా నిర్వహించాల్సిన ఆసియా కప్ మ్యాచ్‌లను యూఏఈకి తరలించారు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ ప్రచారం’ గట్టిగా సాగుతోంది. పాకిస్థాన్‌తో టీమిండియా క్రికెట్ ఆడడాన్ని కొంతమంది అభిమానులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నిరసనలు వ్యక్తమవుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ పెద్దలు ఈ కొత్త పంథాలో బహిష్కరణకు సిద్ధమైనట్టు భావిస్తున్నారు.
మునుపటి మ్యాచ్ మాదిరిగా ఈసారి బీసీసీఐ టాప్ అధికారుల ఎవరూ స్టేడియంలో కనిపించకపోవడం ఖాయమని సమాచారం. పాక్‌తో మ్యాచ్‌పై దేశంలో వ్యతిరేకత వ్యాపిస్తుండడం, తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మ్యాచ్‌కు తగ్గిన క్రేజ్!
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే, అభిమానుల్లో ఎనలేని క్రేజ్ ఉంటుంది. కానీ, ఈ సారి మ్యాచ్‌పై భారతీయ అభిమానులు అంతగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ, మ్యాచ్ పట్ల అభిమానుల్లో అంత ఉత్సాహం కనిపించడం లేదు. ఇరుదేశాల మధ్య మ్యాచ్‌పై పెద్దగా ఉద్వేగం, హైప్ కనిపించకపోవడం చాలాకాలం తర్వాత ఇదే తొలిసారి. మొత్తంగా చూస్తే, స్టేడియంలో మ్యాచ్ ఉంటుందేమో కానీ, రాజకీయ, మానసిక భావోద్వేగాల హడావిడి మాత్రం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాగా, మరో 4 నెలల వ్యవధిలో భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు ఆసియా కప్ జట్టుని ఎంపిక చేశారు.
Read Also- Shocking Murder: కుషాయిగూడలో దారుణం.. ఓ రియల్టర్ దారుణ హత్య!