BCCI Cash Reserves: క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ (BCCI) అత్యంత ధనికమైన బోర్డ్ అనే విషయం అందరికీ తెలిసిందే. మరి, బీసీసీఐ ఖాతాలో ఎంత డబ్బు (BCCI Cash Reserves) ఉందో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారేమో!. గత ఆర్థిక సంవత్సరం నాటికి బీసీసీఐ ఖజానా రూ.20,686 కోట్లకు పెరిగిందని ‘క్రిక్‌బజ్’ పేర్కొంది. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.4,193 కోట్లు ఆర్జించిందని కథనంలో పేర్కొంది. గత ఐదేళ్ల కాలంలో బీసీసీఐ రూ.14,627 కోట్లు సంపాదించిందని తెలిపింది. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు చెల్లింపులు అన్ని పూర్తయిన తర్వాత ఈ డబ్బు మిగిలిందని వివరించింది. 2024లో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ అందజేసిన లెక్కల్లో ఈ వివరాలు ఉన్నాయని వివరించింది.
‘‘2019లో రాష్ట్ర క్రికెట్ సంఘాలకు చెల్లింపులు చేయకముందు బీసీసీఐ వద్ద నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ కలిపి రూ.6,059 కోట్లు ఉన్నాయి. 2019 నుంచి ఐదేళ్లలో రూ.14,627 కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో, మొత్తం ఖజానా రూ.20,686 కోట్లకు పెరిగింది. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,193 కోట్ల మేర సంపద పెరిగింది. జనరల్ ఫండ్ 2019లో రూ.3,906 కోట్లుగా ఉండగా, 2024లో రూ.7,988 కోట్లకు పెరిగింది. అంటే రూ.4,082 కోట్ల మేర పెరుగుదల నమోదయింది’’ అని కథనం పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల కోసం బీసీసీఐ రూ.3,150 కోట్లు కేటాయించింది. అయితే, పన్నుల విషయంలో కోర్టులు, ట్రిబ్యునళ్ల ముందు పలు కేసులు నడుస్తున్నాయని బీసీసీఐ వివరించింది.
Read Also- Bandla Ganesh: దున్నేయ్.. ఇక టాలీవుడ్ నీదే.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి బండ్ల బూస్ట్!
ఆర్థిక సంవత్సరం 2023-24లో ఆదాయపన్ను చెల్లింపు బాధ్యతల కోసం బీసీసీఐ రూ.3,150 కోట్లు కేటాయించింది. ‘‘కోర్టులు, ట్రిబ్యునల్స్ ముందు బీసీసీఐకి అనుకూలంగానే విచారణలు కొనసాగుతున్నా, భవిష్యత్తులో పన్ను సంబంధిత బాధ్యతలు ఎలాంటివి ఎదురైనా చెల్లించేందుకు అవసరమైన నిధులు కేటాయించాం. మీడియా హక్కుల ద్వారా లభించిన స్థూల ఆదాయం ఆర్థిక సంవత్సరం 2023-24లో రూ.813.14 కోట్లకు తగ్గింది. అందుకు ముందు ఏడాది రూ.2,524.80 కోట్లు వచ్చాయి. స్వదేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు తక్కువగా నిర్వహించడమే ఇందుకు మూలకారణంగా ఉంది. అయితే, పెట్టుబడులపై లాభాలు చక్కగా పెరిగాయి. పెట్టుబడులపై లాభాలు 2023-24లో రూ.533.05 కోట్ల నుంచి రూ.986.45 కోట్లకు పెరిగాయి. ఇది డిపాజిట్లపై అధిక రాబడి ఉండడమే దీనికి కారణం’’ అని రిపోర్టులో బీసీసీఐ పేర్కొన్నట్టు ‘క్రిక్‌బజ్’ తెలిపింది.
Read Also- Pookalam Controversy: పూలరంగవల్లిలో ఆపరేషన్ సిందూర్‌పై వివాదం.. 27 మందిపై కేసు
ఐపీఎల్ ఆదాయం, ఐసీసీ డిస్ట్రిబ్యూషన్ల సహకారంతో ఆర్థిక సంవత్సరం 2023-24లో బీసీసీఐ వద్ద రూ.1,623.08 కోట్లు మిగులు నమోదయింది. క్రితం ఏడాది అది రూ.1,167.99 కోట్లుగా ఉందని తెలిపింది. కాగా, 2023-24లో బీసీసీఐ పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు చేసింది. మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,200 కోట్లు, ప్లాటినమ్ జూబిలీ బెనెవొలెంట్ ఫండ్‌కి రూ.350 కోట్లు, క్రికెట్ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించింది. ఇక, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు రూ.1,990.18 కోట్లు అందించింది. ప్రస్తుత ఏడాదికి (2024-25) రూ.2,013.97 కోట్లు అందిస్తున్నట్టు అంచనాగా ఉంది. సెప్టెంబర్ 28న జరగనున్న బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో (AGM) అధికారిక లెక్కలను ప్రవేశపెట్టనున్నట్టు క్రిక్‌బజ్ కథనం పేర్కొంది.