Mahesh Kumar Goud: త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)వెల్లడించారు. కాళేశ్వరం కేసు, ఇతర అక్రమాలపై చర్యలు తీసుకోకూడదనే ఉద్దేశ్యంతోనే బీజేపీతో ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు. గాంధీభవన్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగ్ కు ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ…పార్టీలో యువతకు ప్రయారిటీ ఇస్తున్నామన్నారు. అందుకు కారణం రాహుల్ గాంధీ అని వివరించారు. భవిష్యత్ అంతా యువ నాయకులదేనని వెల్లడించారు. రాహుల్ ను ప్రధానిని చేయడమే తమ ఎజెండా అంటూ వెల్లడించారు. యువకులైన అనిల్ యాదవ్ కి రాజ్యసభ ,అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఎమ్మెల్సీలుగా రావడానికి ప్రధాన కారణం పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లో పనిచేయడమే అంటూ వెల్లడించారు.
Also Read: Ameer Ali Khan: మతసామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. మాజీ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు
పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తే పదవులు
రాహుల్ నాయకత్వంలో యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ, మహిళా, సేవాదళ్ లో పనిచేసిన వారికి పదవులు వస్తున్నాయన్నారు. వైఎస్ ఆర్ యూత్ కాంగ్రెస్ లో పనిచేశారన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా వర్క్ చేశారన్నారు. పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తే పదవులు ఆటోమెటిక్ గా వస్తాయన్నారు. ఇక వోట్ చోరీ ఇంటర్నేషనల్ సమస్యగా మారిందన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. పదవుల కోసం సోనియా, రాహుల్ గాంధీ పనిచేయడం లేదని, వాళ్లు పదవులను తృణ ప్రాయంగా వదులుకున్నారని గుర్తు చేశారు. కానీ పదవే పరమావధిగా అమిత్ షా, మోదీ పనిచేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవడం బాధకరమన్నారు.
కవిత వ్యాఖ్యలతో బీజేపీలో బీఆర్ఎస్ మానసికంగా విలీనం
ఇక కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నాడన్నారు. కేటీఆర్ తన స్థాయిని మరిచిపోయాడన్నారు. కాళేశ్వరం విచారణ నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నేతల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నాడన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సుదర్శన్ రెడ్డి కి మద్దతు తెలపక పోవడంతో బీఆర్ఎస్ వైఖరి బట్ట బయలైందన్నారు. కవిత వ్యాఖ్యలతో బీజేపీలో బీఆర్ఎస్ మానసికంగా విలీనం అయ్యిందన్నారు. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు స్పీకర్ పరిధిలోని అంశమని వెల్లడించారు. కాళేశ్వరం సీబీఐ విచారణ తప్పించుకునేందుకు బీఆర్ ఎస్ నేతలు తాపత్రాయం పడుతున్నట్లు వెల్లడించారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు
కాళేశ్వరం కేసు విచారణ సీబీఐకి ఇవ్వమని కోరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇక కోట నీలిమకు నోటీసులు రాజకీయ కక్ష్య సాధింపు చర్యగానే భావిస్తున్నట్లు తెలిపారు. 2017లో కోట నీటిమ కుటుంబం చిరునామా మార్చాలని ఎన్నికల కమిషన్‌కు ఫామ్-6 ఇచ్చినా ఈసీ చర్యలు తీసుకోలేదన్నారు. ఫామ్ – 6 ప్రకారం తమ విధులు సక్రమంగా నిర్వహించని ఈసీ ఇప్పుడు బీజేపీ ఒత్తిడితో కోట నీలిమకు నోటీసులిచ్చిందన్నారు. కోట నీలిమకు నోటీసులపై న్యాయ పరంగా ముందుకు వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Also Read: SPDCL CMD Orders: జీరో ఫిర్యాదులే లక్ష్యంగా పని చేయాలి.. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశం