Thummala Nageswara Rao: రైతుల ప్రయోజనాలు, వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నాబార్డు అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కోరారు. సచివాలయంలో నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్ తో కలిసి నాబార్డు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. నాబార్డు అధికారులు గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం, మైక్రో ఇరిగేషన్ పథకం కోసం నిధుల విడుదల, బహుళోపయోగ ప్రాథమిక సహకార సంఘాల (ఎం-పీఏసీఎస్) ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్ ₹300 కోట్లు రాష్ట్రానికి కేటాయించినట్లు నాబార్డు అధికారులు తెలిపారు. తక్కువ వడ్డీ రేటుతో (4.25%) అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2025 ముగిసేలోపు కొత్త ఆర్ఐడీఎఫ్ ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పిస్తే ఈ నిధులను వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
Also Read: Thummala Nageswara Rao: మొoథా తుఫాన్ నేపథ్యంలో.. పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తుమ్మల
మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అమలు చేయాలి
ప్రస్తుతం ఆర్ఐడీఎఫ్ కింద ₹41.37 కోట్లు మాత్రమే డ్రా చేసుకుందని, కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం ₹1811 కోట్ల డ్రాయబుల్ గ్యాప్ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఈ ఆర్ఐడీఎఫ్ రుణాలను వినియోగించుకోవాలని అధికారులు మంత్రికి సూచించారు. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడుతానని మంత్రి అధికారులకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 జిల్లాలలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నాబార్డు తెలంగాణ రాష్ట్రానికి హైక్రో ఇరిగేషన్ ఫండ్(ఎంఐఎఫ్) కింద ₹144 కోట్ల నిధులను ఆమోదించామని, ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐతో తో ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.
సీఎంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం
రాష్ట్రంలో 197 కొత్త ఎం-పీఏసీఎస్ ల ఏర్పాటుకు నాబార్డ్ అనుమతి ఇచ్చిందని, ఈ ప్రతిపాదనలను రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ (ఎస్సీడీసీ)తోఆమోదించాల్సి ఉందని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే సీఎంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సూక్ష్మ సాగు, సహకార రంగ బలోపేతం వంటి అంశాలలో రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్ మద్దతు అందిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రైతుల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. పెరిగిన ఉత్పత్తులను అనుగుణంగా నిల్వ సామర్థ్యాలతో గోదాములు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గోదాముల నిల్వ సామర్థ్యం, రైతుల ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా లేదన్నారు.గోదాములు నిర్మించేందుకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని కోరారు.
Also Read: Thummala Nageswara Rao: పత్తి సేకరణకు మరీ ఇన్ని ఆంక్షలా?.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
