Thummala Nageswara Rao: పత్తి సేకరణకు ఇన్ని ఆంక్షలా?.. ఇప్పటిదాకా తేమశాతం అన్నారు.. ఇప్పుడు ఎకరానికి కొనుగోలు పరిమితులా? రైతులు మిగతా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి? అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) కేంద్రాన్ని నిలదీశారు. ఒకవైపు దిగుమతులపై సుంకాలు ఎత్తివేసి, బహిరంగ మార్కెట్లో ధరలు పడేలా చేశారు.. గత ఐదేళ్లలో లేని నిబంధనలు ఇప్పుడే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. పత్తికొనుగోళ్లలో సీసీఐ(CCI) నిబంధనలు మార్చాలని కోరుతూ కేంద్ర టెక్స్ టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్(Minister Giriraj Singh), సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్(Lalith Kumar Guptha)తా కు మంత్రి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పత్తి రైతుల పాటి శాపాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కిసాన్ కపాస్ లో..
అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి, ఇప్పటికే పత్తిపై ఎత్తివేసిన సుంకాల వల్ల, పత్తి రైతులు మార్కెట్లో అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రావట్లేదని, కనీసం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సీసీఐ ద్వారా రైతులు మద్ధతు ధరకు అమ్ముకోవచ్చు అనుకుంటే కిసాన్ కపాస్ లో రిజిస్ట్రేషన్ అని, జిన్నింగ్ మిల్లులో L-1,L-2 అని విభజించి, రైతులకు సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లు వస్తుందో, రాదో అన్న సంశయంలో ఉంచారని మండిపడ్డారు. తేమశాతం 8-12 శాతం మాత్రమే అన్నారని, రైతులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి, సీసీఐ పెట్టిన నిబంధనలన ప్రకారం తీసుకువెళ్తుంటే, ఇప్పుడు కొత్తగా ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి అనడం కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను తెలియజేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
6 వేలకు పడిపోయింది..
దేశంలో పత్తి రైతులు సుమారు కోటి మంది ఉన్నారని తెలంగాణలో 44 లక్షల మంది ఉండగా సగటున 1నుంచి 3 ఎకరాలు మాత్రమే అన్నారు. తుపాన్ తో పంట దెబ్బతిన్నదని, తేమ శాతం 12 కంటే తక్కువ తీసుకురావడానికి రైతులు నానాతంటాలు పడ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర చౌకధరలను, సబ్సిడీ దిగుమతులకు అనుమతించడంతో మార్కెట్లో పత్తి రేటు 6 వేలకు పడిపోయిందన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ స్ట్రాటిస్టిక్స్ అంచనాల ప్రకారం తెలంగాణలో సరాసరి దిగుమతి 7 క్వింటాళ్లు ఉండవచ్చు అని, కానీ రైతు వద్ద అంతకంటే ఎక్కువ కొనమనడం ఏ మాత్రం సహేతుకం కాదన్నారు.
పునరాలోచన చేయాలని డిమాండ్..
నల్లరేగళ్లలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్న రైతులు ఉన్నారని, 7 క్వింటాళ్ల నిబంధనలతో రైతాంగాన్ని గోస పెట్టడం సరికాదన్నారు. సీసీఐ అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనను తీసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. దిగుమతి సుంకాలు ఎత్తివేతపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఒకవైపు సుంకాలు ఎత్తివేసి, బహిరంగ మార్కెట్లో పత్తికి ధర పతనమయ్యేలా చేసింది. ఇంకోవైపు సీసీఐ ద్వారా సవాలక్ష కొర్రీలు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని తేమశాతం 20 వరకు ఉన్న పత్తిని కూడా సీసీఐ అధికారులు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీ భాయ్, ఇతర అధికారులుతో సమీక్ష నిర్వహించారు.
Also Read: Khammam Crime: ఖమ్మం జిల్లా ఖమ్మం దారుణ హత్య.. కుటంబ కలహలే కారణమా?
