Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం అంటే, పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇవ్వడమేనని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మైనార్టీ ఓటర్లు ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించాలని ఆయన కోరారు. శనివారం నాడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్‌ఎస్ తీరుపై విమర్శలు గుప్పించారు. గతంలో నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో ఆశ చూపించి మోసం చేశారని, బీఆర్‌ఎస్‌కు ‘అహనా పెళ్లంట’ సినిమా టైటిల్ సరిగ్గా సరిపోతుందని మహేశ్ ఎద్దేవా చేశారు. సినిమాలో కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లుగా గత ప్రభుత్వం వ్యవహరించిందని దుయ్యబట్టారు. అయితే, తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ల జాతర కొనసాగుతోందని స్పష్టం చేశారు.
Also Read: Mahesh Kumar Goud: బీజేపీ మతవాద శక్తులకు బుద్ధి చెప్పాలి.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
లోపాయికారి ఒప్పందం
బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టడం ఈ ఒప్పందంలో భాగమేనని ఆయన వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్‌ఎస్ సహకరించిందని, ఎన్డీఏ ప్రభుత్వంలోని ప్రతి కీలక నిర్ణయానికి కేసీఆర్ మద్దతు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతి అధ్యక్ష పదవి ఎన్నిక నుంచి మొదలుకొని ట్రిపుల్ తలాక్ వంటి వివాదాస్పద బిల్లుల వరకు కేసీఆర్ బీజేపీకి అండగా నిలిచారని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. మరోవైపు, మహిళలను అవమానించిన నీచ చరిత్ర బీఆర్‌ఎస్‌దని, గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు మంత్రివర్గంలో మహిళా మంత్రి లేరని ఆయన విమర్శించారు. మరోసారి జూబ్లీహిల్స్‌లో ప్రజలను మోసం చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
Also Read: Mahesh Kumar Goud: టీజేఎస్ మద్దతు కోరుతూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ లేఖ
