Vice President: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా, ఛైర్మన్ హోదాలో రాజ్యసభకు హాజరైన ధన్‌ఖర్ సాయంత్రానికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజీనామా సంగతి అటుంచితే.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు? ఏ రాష్ట్రం నుంచి ఎవరికి అవకాశం దక్కొచ్చు? తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా లక్కీ ఛాన్స్ దొరుకుతుందా? అనేదానిపైనా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా రాజీనామా చేయాల్సి వచ్చిందా? లేకుంటే నిజంగానే ఆరోగ్యం సహకరించట్లేదా? అనే దానిపైనే ఎక్కువగా మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద డిబేట్ జరుగుతుండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా రోజులుగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో పెద్ద తలకాయలే ఉండటం, ఆ మధ్య చోటుచేసుకున్న కొన్ని పరిణామాల రీత్యా ఏమో.. ఏదైనా జరగొచ్చు అన్నట్లుగా టాక్ కూడా నడిచింది.
తెలుగోడేనా..?
పక్కాగా తెలుగు రాష్ట్రాల నుంచే ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. వాస్తవానికి చాలా రోజులుగా ఇద్దరి ముగ్గురి పేర్లు జోరుగానే ప్రచారం జరుగుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి పేరు ఆ మధ్య గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ప్రధానంగా వినిసించింది. ఉపరాష్ట్రపతి హామీ మేరకే ఇంకా పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారనే ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. పరిస్థితిని బట్టి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ లేదా ఉపరాష్ట్రపతిని చేస్తామని కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు మాటిచ్చారని రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే ప్రచారం జరుగుతోంది. దీంతో తప్పకుండా ఉపరాష్ట్రపతి పదవిలో మరోసారి తెలుగోడు కూర్చుంటారనే విశ్లేషణలు వస్తున్నాయి. వాస్తవానికి ధన్‌ఖర్ ముందు ఉపరాష్ట్రపతిగా పనిచేసింది తెలుగు వ్యక్తి మువ్వరపు వెంకయ్య నాయుడు. ఇప్పుడు మళ్లీ తెలుగు రాష్ట్రాలను ఆ అదృష్టం వరిస్తుందా అంటే చెప్పలేమనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి కావాల్సిన అన్ని అర్హతలు అటు చిరంజీవి, ఇటు విజయసాయిరెడ్డికి మెండుగానే ఉన్నాయి. ఎందుకంటే ఇరువురూ రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన వారే. చిరు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది.
Read Also- Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా.. సడన్‌గా ఎందుకు?
బిహార్ ఎన్నికల స్ట్రాటజీనా?
బిహార్ సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది అక్టోర్ లేదా నవంబర్‌లో జరగనున్నాయి. శాసనసభ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 22, 2025తో ముగుస్తుంది. కాబట్టి, ఆ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం సాధారణంగా దీపావళి, ఛత్ పూజ వంటి ప్రధాన పండుగలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందిస్తుంది. ఎన్నికల తేదీల అధికారిక ప్రకటన సాధారణంగా అక్టోబర్ మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికలకు ముందు ధన్‌ఖర్ రాజీనామా చేయడంతో పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీకి మేలు చేసేందుకే ఉపరాష్ట్రతి రాజీనామా చేశారని ప్రచారం జోరందుకున్నది. బిహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఉప రాష్ట్రపతి చేస్తారని ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతిగా ప్రస్తుతం బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్‌ను నియమించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదనే విశ్లేషణలు, ప్రచారం కూడా జరుగుతున్నది.
అర్హతలు ఏంటి..?
ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార కూటమి, రాజ్యాంగపరమైన అర్హతలతో పాటు అనేక వ్యూహాత్మక.. రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. రాజకీయాల్లో దీర్ఘకాల అనుభవం ఉన్నవారిని ఎంపిక చేస్తారు. లోక్‌సభ లేదా రాజ్యసభలో ఎంపీగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. పార్లమెంటరీ వ్యవహారాలపై, ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలపై మంచి అవగాహన ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఎందుకంటే.. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఛైర్మన్‌గా వ్యవహరించాలి కాబట్టి, సభా నియమాలు, సంప్రదాయాలపై పట్టు ఉండటం అవసరం. అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమికి సంపూర్ణ విధేయులైన, విశ్వసనీయమైన నాయకులను ఎక్కువగా ఎంపిక చేస్తారన్నది జగమెరిగిన సత్యమే. అభ్యర్థికి రాజకీయంగా పెద్దగా వివాదాలు లేని, గౌరవనీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ఇది అన్ని పార్టీల నుంచి కొంతవరకు అంగీకారాన్ని పొందడానికి సహాయపడుతుంది. ప్రతిపక్షాలకు కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తి అయితే, ఎన్నిక ప్రక్రియ సాఫీగా సాగుతుంది.
Read Also- Viral News: ఇదేం పరిస్థితి బాబోయ్.. ఇక అద్దెలు చెల్లించేదెలా?
రాజకీయ వ్యూహమే!
కొన్నిసార్లు, భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని లేదా ఏదైనా నిర్దిష్ట రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచడానికి ఆ రాష్ట్రం నుంచి ఒక ప్రముఖ నాయకుడిని ఎంపిక చేయవచ్చు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరచడానికి కూడా ఈ పదవిని ఉపయోగించవచ్చు. ఉపరాష్ట్రపతి పదవిని రాష్ట్రపతి పదవికి ఒక మెట్టుగా కూడా పరిగణిస్తారు. అందువల్ల, భవిష్యత్తులో రాష్ట్రపతి పదవికి అర్హులు కాగలరని భావించేవారిని కూడా ఎంపిక చేయవచ్చు. ఉదాహరణ.. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజస్థాన్ నుంచి వచ్చినవారు, సీనియర్ న్యాయవాది, లోక్‌సభ సభ్యుడిగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. ఇది ఆయన అనుభవం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, రాజకీయ విధేయతకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అనేది రాజ్యాంగ అర్హతలతో పాటు, రాజకీయ వ్యూహం, సామాజిక సమతుల్యత, పార్లమెంటరీ పరిజ్ఞానం వంటి అనేక అంశాల కలయిక.
Read Also- HHVM: తెలంగాణలోనూ ‘వీరమల్లు’కు బంపరాఫర్.. ఇక రికార్డులు బద్దలే!
