Viral News: ఇండియన్ సిలికాన్ సిటీగా వెలుగొందుతున్న బెంగళూరు నగరంలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువగా ఉంటాయని అక్కడి నివసిస్తున్నవారు చెబుతుంటారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోలిస్తే చాలా అధికం ఉంటున్నాయి. ఈ అభిప్రాయం మరింత బలపడుతోంది. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్, స్టార్టప్ ఉద్యోగులు, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో పనిచేసేవారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అద్దెలు ఆకాశాన్నే తాకుతున్నాయి. 1 బీహెచ్‌కే కనీస అద్దె రూ.30 వేలతో ప్రారంభమయ్యే ప్రాంతాలు కూడా నగరంలో ఉన్నాయి. చాలాచోట్ల 6-10 నెలల అద్దెను డిపాజిట్ చేయాలంటూ ఇంటి ఓనర్లు కోరుతున్నారు. ప్రీమియం ఇళ్లకు 12 నెలల అద్దె డిపాజిట్ చేయాలని కూడా కోరుతున్నారు. ఈ పరిస్థితికి అద్దం పట్టే ఓ షాకింగ్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral News) మారింది.
ఫుల్ ఫర్నిచర్‌తో కూడిన 4బీహెచ్‌కే ఇంటికి సంబంధించిన ప్రకటనలో నెల అద్దె రూ.2.3 లక్షలుగా పేర్కొన్నారు. అయితే, ఏకంగా 10 నెలల అద్దె మొత్తం రూ.23 లక్షలు డిపాజిట్ చేయాలని ఇంటి యజమానులు ప్రకటనలో కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఓ యువకుడు ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ‘బెంగళూరులో ఇంటి యజమానులు ప్రపంచంలోనే అత్యంత అత్యాశపరులు. రూ.23 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ (10 నెలల అద్దె) అంటే నిజంగా దారుణాతిదారుణం!. ప్రపంచంలోని ఇతర నగరాల్లో ఎన్ని నెలల సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతున్నారో గమనిస్తే.. న్యూయార్క్‌లో 1 నెల అద్దె మాత్రమే. టొరంటోలో 1 నెల అద్దె. సింగపూర్‌లో ప్రతి ఏడాది లీజ్‌కు 1 నెల డిపాజిట్, శాన్‌ఫ్రాన్సిస్కోలో 2 నెలలు, దుబాయ్‌లో వార్షిక అద్దెకి 5-10 శాతమే. లండన్‌లో 5-6 వారాల రెంట్ మాత్రమే డిపాజిట్ చేయాలి. కానీ, బెంగళూరులో మాత్రం పూర్తిగా నియంత్రణలేని దురాశతనం నడుస్తోంది!’’ అంటూ సెలబ్ అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు. రెంట్‌కు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ ప్రకటనను ఆయన స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. కాగా, ఇంటి విస్తీర్ణం 4,500 చదరపు అడుగులు అని ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also- Fitness: ఫుడ్‌లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. అద్భుతమైన ఆరోగ్యం!
సెలబ్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయనే చర్చకు మరోసారి దారితీశాయి. నెలకు రూ.2.3 లక్షల అద్దెకి రూ.23 లక్షల డిపాజిట్ కోరడం ఏమిటంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరు ఇంటి యజమానుల అత్యాశకు ఈ ప్రకటన ఒక నిదర్శనమని కొందరు విమర్శించారు. ఒక యూజర్ స్పందిస్తూ.. “బెంగళూరు యజమానులు ప్రపంచంలోనే అత్యంత దురాశపరులు. ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి రూ.23 లక్షల డిపాజిట్ చేయడం ఏంటి?” అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూయార్క్, టొరంటో, సింగపూర్, లండన్, దుబాయ్ వంటి ఇతర నగరాల్లో సాధారణంగా 1-2 నెలల అద్దె లేదా వార్షిక అద్దెలో 5 శాతం-10 శాతం వరకు మాత్రమే డిపాజిట్‌గా తీసుకుంటారని, బెంగళూరులో మాత్రం ఏకంగా 12 నెలల డిపాజిట్ అడగటం దారుణమని పేర్కొన్నారు.
Read Also- Mumbai blasts: పేలుళ్లు జరిగి 19 ఏళ్లు గడిచినా ‘దోషులు సున్నా’
కొత్తేం కాదు..
అంతపెద్ద మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్ కోరడంపై చాలామంది షాక్‌కి గురవ్వుతుండగా, కొందరు బెంగళూరు వాసులు మాత్రం ఇదేం కొత్తకాదని అంటున్నారు. లగ్జరీ ఇళ్లకు 12 నెలల డిపాజిట్ అడగడం సాధారణమేనని చెబుతున్నారు. 5-6 నెలల డిపాజిట్ కోరడం సర్వసాధారణంగా కనిపిస్తుందని కొందరు పేర్కొన్నారు. ఎక్కువ కాలం ఉంటారనే పరస్పర నమ్మకం లేకపోవడంతో ఇలా జరుగుతోందని, నిబంధనలు కూడా కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. “నమ్మకం లేని సమాజమే ఖరీదైన ఇళ్ల ధరలకు కారణం” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
మరికొందరు స్పందిస్తూ, ఈ పరిస్థితికి యజమానులు, అద్దెదారులు ఇద్దరూ బాధ్యులేనని పేర్కొన్నారు. కొంతమంది అసలు డిస్కషన్ లేకుండా అడిగినంతే ఇచ్చేస్తుంటారని, అందుకే మార్కెట్‌లో ఈ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కొందరు యజమానులు విచిత్రమైన నిబంధనలు విధిస్తుంటారని, నాన్ వెజ్ తినకూడదని, రాత్రివేళ గెస్ట్‌లు రాకూడదని, స్నేహితులు ఇంట్లో ఉండకూడదంటూ అనేక షరతులు విధిస్తుంటారని గుర్తుచేశారు.