HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ చారిత్రక యోధుడిగా నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్ర విడుదల వేళ అన్నీ అనుకూలిస్తున్నాయి. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి, నిర్మాతను సందిగ్ధంలో పడేయగా, పట్టు వదలని విక్రమార్కుడిలా నిర్మాత ఎఎమ్ రత్నం.. ఈ సినిమా విడుదల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఫైనల్‌గా ఈ సినిమా జూలై 24న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు హీరోయిన్ నిధి అగర్వాల్, దర్శకుడు జ్యోతి కృష్ణ, నిర్మాత రత్నం చేస్తూ వస్తున్నారు. ఇది చూసిన పవన్ కళ్యాణ్.. ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా ప్రమోషన్స్‌కు సహకరించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్, సాయంత్ర ప్రీ రిలీజ్ వేడుకకు భార్య అన్నాలెజ్నోవాతో కలిసి హాజరయ్యారు. ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జరుగుతుండగానే.. ఈ సినిమాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్‌ని విడుదల చేసింది.
Also Read- Ram Charan Peddi: అన్ బిలీవబుల్ బీస్ట్ మోడ్‌లోకి రామ్ చరణ్.. పిక్ వైరల్!
అవును.. చాలా గ్యాప్ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమాకు టిక్కెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటును కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతేకాదు, విడుదలకు ఒక రోజు ముందు అంటే జూలై 23 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలకు కూడా అనుమతినిచ్చింది. ఇంతకు ముందు ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ల ధరలను పెంచుకునేందుకు, అలాగే ఒక రోజు ముందు ప్రీమియర్స్‌కు ఓకే చెబుతూ జీవోని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం జూలై 23 రాత్రి 9 గంటలకు షో టికెట్ ధర రూ. 600 ప్లస్ జీఎస్టీ, జూలై 24 నుంచి 10 రోజుల పాటు లోయర్ క్లాస్ రూ. 100, అప్పర్ క్లాస్ రూ. 150, మల్టీప్లెక్స్‌లో రూ. 200 వరకు టికెట్ల ధరలన పెంచుకునే వెసులుబాటు కల్పించగా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ‘హరి హర వీరమల్లు’ ప్రీమియర్ షోకు, విడుదల రోజు నుంచి 10 రోజుల వరకు టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పించింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 23న రాత్రి 9 గంటల షోకు అనుమతి ఇస్తూ.. ఆ షో టికెట్ ధరను రూ. 600 ప్లస్ జీఎస్టీగానూ, సినిమా విడుదల రోజు అంటే జూలై 24 నుంచి జూలై 27 వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునే అవకాశం ఇస్తూ.. మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ. 200, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 150 వరకు పెంచుకునేలా అనుమతులు జారీ చేసింది. అలాగే జూలై 28 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 106 వరకు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ జీవోని విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఇంతకు ముందు తెలంగాణలో కూడా టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంటే, రికార్డులు బద్దలు కొట్టి చూపించేవాళ్లమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా వచ్చేసింది. ఇక రికార్డుల జాతర ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
Also Read- PSPK: సినిమాలు చేసుకుంటున్నాడని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా.. నేను నిలబడ్డాను! ఎందుకంటే?
ఇదెలా ఉంటే, తెలంగాణలో ఇకపై టిక్కెట్ల ధరలను పెంచుకునే అవకాశం ఉండదని, అలాగే ప్రీమియర్స్ కూడా ఉండవని ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది. కానీ, చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో పాటు, ఇందులో ఉన్న మెసేజ్, బడ్జెట్ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ‘హరి హర వీరమల్లు’ సినిమాకు టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించింది. రీసెంట్‌గా జరిగిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధమని తెలిపారు. హైదరాబాద్‌ను సినీ హబ్‌గా మార్చేందుకు సినీ పెద్దలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి విషయంలో ఏం చేయాలో కూడా ఆయన చెప్పమన్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అంతా భావిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
