PSPK: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ ఇందులో నటిస్తున్నారు. అగ్ర నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు, ట్రైలర్ మంచి ఆదరణ రాబట్టుకోగా.. సోమవారం పవన్ కళ్యాణ్‌తో పాటు టీమ్ అంతా మీడియాతో ఇంటరాక్షనై చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు.
Also Read- Pawan Kalyan: అందుకు నాకు పొగరో, అహంకారమో కారణం కాదు.. ఏంటంటే?
ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘హరి హర వీరమల్లు’ సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం.. ఆ తర్వాత హైదరాబాద్ సుల్తాన్ల దగ్గరకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది? అనే నేపథ్యంలో జరిగే కథ ఇది. ఈ కథకు పునాది వేసింది క్రిష్ జాగర్లమూడి. రత్నంతో కలిసి ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చారు. క్రిష్, రత్నం వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నచ్చి వెంటనే ఓకే చేశాను. అయితే కరోనా అనేది సినిమాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎ.ఎం. రత్నాన్ని నేను చాలా దగ్గర నుండి చూశాను. ఒకప్పుడు ఆయన వెంట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు, దర్శకులు తిరిగేవారు. ‘ఖుషి’ సినిమా సమయంలో మాకు ఒక నెల ముందే ప్రీ ప్రొడక్షన్ టైమ్ ఇచ్చారు. చాలా సౌకర్యాన్ని కల్పించారు. అలాంటి వ్యక్తి నలిగిపోతుంటే నిజంగా నాకు బాధేసింది. ఇది డబ్బు కోసమో, సక్సెస్ కోసమో కాదు.. మన వాళ్ళ కోసం, సినీ పరిశ్రమ కోసం నమ్మి నిలబడటంగా నేను భావిస్తున్నాను. కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా పూర్తి చేయలేకపోయినప్పటికీ.. ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాకి పునాది వేసిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
Also Read- Pawan Kalyan: రాజకీయంగా పేరున్నా.. ఆ హీరోల కంటే తక్కువే.. పవన్ షాకింగ్ కామెంట్స్!
నేను ఖుషి సినిమా చేస్తున్న సమయంలో జ్యోతికృష్ణ లండన్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడుతుంటే సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించింది. ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అనే మాటలు వినిపిస్తున్న సమయంలో.. మాకు ప్రాణవాయువు ఇచ్చిన వ్యక్తి కీరవాణి. నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప.. సినిమా గురించి పెద్దగా మాట్లాడను. ప్రమోషన్స్ చేయను. కానీ, ఈ సినిమాకి మాట్లాడటం చాలా అవసరం అనిపించింది. నిర్మాతలు కనుమరుగు అవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్‌ను వదిలేసి, ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తున్నా ఈ సినిమా పూర్తి చేశాను. ఈ సినిమా గురించి అందరికీ తెలియాలని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. ఇక్కడ ఎందరో మీడియా వారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. రత్నం వంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని.. ఈ సినిమాని నేను నా భుజాలపైకి తీసుకున్నాను. రత్నం, జ్యోతికృష్ణ, మనోజ్ పరమహంస నిద్రలు మానుకొని మరీ ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. అలాగే నిధి అగర్వాల్ సినిమా ప్రమోషన్ బాధ్యతను తీసుకున్నారు. ఈ సినిమా అనాధ కాదు.. నేనున్నాను అని చెప్పడానికే ఈ రోజు ఈ మీడియా సమావేశం. కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేవాడిని, దేశంలో ఉన్న సమస్యలకు స్పందించేవాడిని.. అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను..’’ అని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు