Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు జవాన్ మృతి చెందగా, ఒక ఉగ్రవాది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఉధంపూర్ జిల్లా మజాల్తా ప్రాంతంలోని సోన్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
అధికారుల సమాచారం ప్రకారం, పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో దాక్కున్నారనే ఖచ్చితమైన సమాచారం అందడంతో భద్రతా బలగాలు శోధన ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
భద్రతా బలగాల సంయుక్త ఆపరేషన్
జమ్మూ ఐజీపీ భీమ్ సేన్ తుటీ తెలిపిన వివరాల ప్రకారం, పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. “ ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఉగ్రవాదులతో కాంటాక్ట్ ఏర్పడింది. SOG బృందమే మొదటగా ఉగ్రవాదులను ఎదుర్కొంది,” అని ఆయన పేర్కొన్నారు. అయితే చీకటి , క్లిష్టమైన అటవీ భూభాగం కారణంగా శోధన చర్యలకు ఆటంకం ఏర్పడిందని ఐజీపీ తెలిపారు.
జవాన్‌కు తీవ్ర గాయాలు
సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఎదురుకాల్పులు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఒక SOG జవాన్ తీవ్రంగా గాయపడగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే సమయంలో ఒక ఉగ్రవాది గాయపడినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.
ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపివేత
రాత్రి చీకటి కారణంగా శోధన ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి మళ్లీ ఆపరేషన్‌ను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని కఠిన భద్రతా వలయంలో ఉంచి, అన్ని పారిపోవు మార్గాలను మూసివేశారు. ఉగ్రవాదులను పూర్తిగా మట్టుబెట్టేందుకు అదనపు బలగాలను ఘటనాస్థలికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో ఉధంపూర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొనగా, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి.

