Lionel Messi: ఇండియాలో ప్రస్తుతం ‘మెస్సీ మేనియా’ (Lionel Messi Mania) కొనసాగుతోంది. మూడు రోజుల భారత సందర్శనకు వచ్చిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం ఇవాళ (డిసెంబర్ 15) దేశరాజధాని ఢిల్లీలో అడుగుపెట్టాడు. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై నగరాలలో (G.O.A.T India Tour) ఈవెంట్ల తర్వాత అభిమానుల కోలాహలం మధ్య ఢిల్లీలో అడుగుపెట్టాడు.
షేక్ హ్యాండ్‌కి కోటి రూపాయలు
ఢిల్లీలో మెస్సీని కలవాలంటే పెద్ద మొత్తం ఖర్చు పెట్టాల్సిందే. ఎంపిక చేసిన వ్యాపారవేత్తలు, వీఐపీ అతిథుల కోసం హోటల్‌లో రహస్యంగా మెస్సీతో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు కొంతమంది వ్యాపారవేత్తలు ఏకంగా రూ.1 కోటి వరకు ఖర్చు చేసినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అత్యంత భారీ భద్రత
మెస్సీ రాక సందర్భంగా ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మెస్సీ, అతడి బృందం అత్యంత ప్రముఖమైన వ్యక్తులను కలవడంతో పాటు ఉన్నత స్థాయి సమావేశాలు, అత్యున్నత ప్రాధాన్యత ఉన్న కార్యక్రమాలలో పాల్గొననుండడంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. మెస్సీ కలవనున్న వారి జాబితాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలువురు చట్టసభ్యులు, క్రీడారంగ ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో క్రికెటర్లతో పాటు ఒలింపిక్, పారాలింపిక్ పతకాల విజేతలు ఉన్నారు. అందుకే, ఈ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు.
Read Also- Vikarabad Crime: ప్రియుడిని కలిసేందుకు అడ్డోస్తున్నాడని.. ట్రాక్టర్‌తో భర్తను గుద్దిచంపించిన భార్య!
హోటల్‌లో ఒక అంతస్తు మొత్తం కేటాయింపు
మెస్సీ, అతడి బృందం కోసం ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న ‘ది లీలా ప్యాలెస్ హోటల్’లో ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఆ బృందం కోసం హోటల్‌లోని ఒక అంతస్తు మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించినట్టు సమాచారం. హోటల్‌లోని ప్రెసిడెన్షియల్ సూట్‌లలో ఉంచుతున్నారు. ప్రత్యేకమైన ఈ సూట్‌లలో బస చేస్తే ఒక్క రాత్రికి రూ.3.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, హోటల్‌లో మెస్సీ ఉండే సూట్‌కి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు తెలియనివ్వడం లేదు. ఈ మేరకు హోటల్ సిబ్బందికి భద్రతా సిబ్బంది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. కోల్‌కతాలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.
కాగా, మెస్సీ ఇవాళ సాయంత్రం 6.15 గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు బయలుదేరి, రాత్రి 8 గంటలకు ఇండియా నుంచి బయలుదేరతాడని షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
Read Also- Cyber Crime: మీకు క్రెడిట్ కార్డ్ ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్ అంటూ..?
కాగా, అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తొలుత కోల్‌కతాలో అడుగుపెట్టాడు. అయితే, అక్కడ జరగాల్సిన కార్యక్రమం ఫెయిల్ అయ్యింది. మెస్సీ మైదానంలో ఎక్కువ సేపు ఉండకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలోకి దిగి రచ్చరచ్చ చేశారు. అయితే, ఆ తర్వాత హైదరాబాద్, ముంబై నగరాలలో జరిగిన ఈవెంట్లు సక్సెస్ అయ్యాయి.

