Live-in Relationship: రాజస్థాన్ హైకోర్ట్ లివ్ ఇన్ రిలేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ యువ జంట దాఖలు చేసిన పిటిషన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. పరస్పర అంగీకారంతో ఉన్న ఇద్దరు పెద్దవారు, పెళ్లి చేసుకునే చట్టపరమైన వయసు రాకపోయినా, లివ్-ఇన్ రిలేషన్‌లో ఉండవచ్చని కోర్టు తీర్పును ఇచ్చింది. భారత్‌లో యువతులకు 18 సంవత్సరాలు, యువకులకు 21 సంవత్సరాలు పెళ్లి వయసుగా నిర్ణయించినా, 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఇద్దరూ పెద్దవారిగా గుర్తించబడతారని కోర్టు గుర్తు చేసింది. ఆర్టికల్ 21 కింద జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగబద్ధమైన రక్షణ పొందిన హక్కులని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ కేసులో 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు కుటుంబ సభ్యుల నుంచి ముప్పు ఉందని పేర్కొంటూ పోలీసు రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. పరస్పర అంగీకారంతో తమ లివ్-ఇన్ రిలేషన్ లో ఉంటున్నామని, 2025 అక్టోబర్ 27న లివ్-ఇన్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు వారు కోర్టుకు తెలియజేశారు. అప్పటికీ తమ భద్రతకు హామీ లభించకపోవడంతో హైకోర్టు జోక్యం కావాలని కోరారు.
రాష్ట్రం తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక్ చౌధరి, అబ్బాయి 21 సంవత్సరాలు పూర్తి చేయకపోవడంతో చట్టపరంగా పెళ్లి చేసుకునే అర్హత ఉండదని వాదించారు. అందువల్ల అతనికి లివ్-ఇన్ రిలేషన్ అనుమతి ఇవ్వకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వాదనను కోర్టు బాగా పరిశీలించింది.
Also Read: Panchayat Elections: సోషల్ మీడియా వేదికగానే పోటాపోటీ ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు నూతన ఒరవడులు
తీర్పును వెలువరించిన జస్టిస్ అనూప్ ధంద్, పిటిషనర్లు చట్టపరంగా పెళ్లి చేసుకునే వయసులో లేకపోయినా, వారి మౌలిక హక్కులను కాపాడాలని స్పష్టం చేశారు. పెద్దవారైన ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో జీవించే హక్కు కలిగి ఉన్నారని, రాష్ట్రం వారి జీవన–స్వేచ్ఛను రక్షించాల్సిన బాధ్యత కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. పెళ్లి వయసు రాకపోవడం ఒక్క కారణం చేత వ్యక్తిగత స్వేచ్ఛ పరిమితం చేయకూడదని హైకోర్ట్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

