CM Revanth Reddy: బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరంగా మారిందని, ఈ ప్రాజెక్టు వల్ల కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిసింది తప్పా ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం నీరు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు, చనాక -కొరాట ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, విమానాశ్రయం, విశ్వవిద్యాలయం ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి పలు కీలక అంశాలను వివరించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం సొమ్ము వల్ల సొంత కుటుంబ సభ్యులే కత్తులతో పొడుచుకుంటున్నారని అన్నారు. బిడ్డ, కొడుకు, అల్లుడు ఒక దిక్కు, ఇక ఆ పెద్ద మనిషి ఎక్కడ పడుకున్నాడో అందరికీ తెలుసని రేవంత్ సెటైర్లు వేశారు. కల్వకుంట్ల కుటుంబంలో పైసల పంచాయితీ తప్ప అది మరో పంచాయితీ కాదన్నారు. రెండేళ్లలో ఏ ఒక్క రోజు కూడా తాను సెలవు తీసుకోలేదని, జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, చివరకు ముఖ్యమంత్రి పదవి కూడా తనకు చిన్న వయసులోనే దక్కిందని పేర్కొన్నారు.
ఆ పరిస్థితులు లేవు
బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులను ముఖ్యమంత్రి సభల్లో పాల్గొనే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్‌కు వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తనను, సీతక్కను నిర్బంధించారని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, భవిష్యత్‌లో కూడా రానివ్వబోమన్నారు. ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లాంటి గొప్ప కార్యక్రమానికి సోనియాగాంధీ ఆశ్వీరాదం తీసుకున్నట్లు చెప్పారు. ఖర్గే, రాహుల్, ప్రియాంకను కలిసి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలన్నారు.
ఏడాదిలో ఎయిర్‌పోర్టు
ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్ కట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనను కలిసి కోరారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు కోసం భూమి ఇస్తే కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు సహకరిస్తామని చెప్పారని, ప్రధాని మోదీ కూడా ఎయిర్‌పోర్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఏడాదిలోగా ఆదిలాబాద్‌కు విమానాశ్రయాన్ని తీసుకొస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్ అభివృద్ధి నా బాధ్యత
అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే రెండు నెలల్లో మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తానని, నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ప్రాణహిత, చేవేళ్లతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడం కోసం రూ.38 వేల కోట్లతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ఆదిలాబాద్‌కు నీటి కోసం రూ. వందల కోట్లు ఖర్చు చేశారన్నారు. కానీ, కానీ, ఓ పెద్దాయన దెయ్యంలా మారి ప్రాజెక్టును కాలగర్భంలో కలిపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు, ఊరు, అంచనాలన్నీ మార్చి అంచనాలు రూ.1.50 లక్షల కోట్లకు తీసుకెళ్లాడని పేర్కొన్నారు. తమ్మిడిహట్టి దగ్గర 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి మహారాష్ట్ర ఒప్పుకున్నా గత ప్రభుత్వ తీరు వల్ల కిందకు ప్రాజెక్టు తరిలిపోయిందన్నారు. దీంతో రూ.లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకపోయాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు కట్టేందుకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పొలాలకు నీరందించేందుకు ప్రాజెక్టు శంకుస్థాపనకు మళ్లీ తాను తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.
Also Read: CM Revanth Reddy: కాంగ్రెస్ సర్కార్‌కు నేటితో రెండేళ్లు పూర్తి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాదే
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కంపెనీ మూతపడిందని, ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఫ్యాకర్టీని తెరిపించడానికి ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి మాటిచ్చారు. ఆదిలాబాద్‌లో ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్‌ను మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తన మనసుకు అనిపిస్తోందని తెలిపారు. ఇంద్రవెల్లి లేదా కొముర భీం పేరిట పెట్టుకుంటే బాగుంటుందని, ఇది కేవలం తన సూచనగా చెప్పుకొచ్చారు.
త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిరుద్యోలను పట్టించుకోలేదని మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 61 వేల మందికి నియామక పత్రాలు అందించినట్లు గుర్తుచేశారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. 562 మంది గ్రూప్–1 అధికారులను తెలంగాణ పున:నిర్మాణంలో భాగస్వాములను చేసినట్లు తెలిపారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.
బీఆర్ఎస్హయాంలో దివాళా
తెలంగాణ ఆడబిడ్డలను గత ప్రభుత్వం దివాళా తీయించిందని ముఖ్యమంత్రి విమర్శించారు. కానీ, తాము రూ.8100 కోట్లను మహిళల ఉచిత ప్రయాణం కోసం కేటాయించినట్లు తెలిపారు. 1000 బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేసినట్లు గుర్తుచేశారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని వివరించారు. కొరాట, చెనాక ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. నోరు మంచిగా ఉండే వారిని సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టొద్దని, నిధులు తీసుకురాగలిగే వారిని గెలిపించుకోవాలని సూచించారు. నిధులు ఇచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: CM Revanth Reddy: ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వాన పత్రికను అందించిన సీఎం రేవంత్ రెడ్డి

