Bhatti Vikramarka: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంతమంది ఎంపికైనా ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) తెలిపారు. ప్రజా భవన్‌లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి ఆయన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అపారమైన మేధస్సు ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల వల్ల సివిల్స్ పరీక్షల్లో అభ్యర్థులు విజయం సాధించలేకపోతున్నారన్న సమాచారం తెలుసుకుని, ఆ ఇబ్బందులు తీర్చేందుకే సింగరేణి ఆధ్వర్యంలో ఈ పథకాన్ని తీసుకువచ్చామని వివరించారు.
రూ.1 లక్ష ఆర్థికసాయంతో పాటు ఢిల్లీలో వసతి సౌకర్యం
మెయిన్స్‌కు ఎంపికైన వారికి రూ.1 లక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి మరో రూ.1 లక్ష ఆర్థికసాయంతో పాటు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు భట్టి తెలిపారు. గత సంవత్సరం 20 మంది ఇంటర్వ్యూకు వెళ్లగా, అందులో ఏడుగురు సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈసారి 202 మంది మెయిన్స్‌కు ఎంపిక కాగా, అందులో 50 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని, ఈ సంఖ్య 100 దాటాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా అభ్యర్థులను అభినందించారు. సింగరేణి సీఎండీ బలరాంనాయక్ మాట్లాడుతూ పేద వర్గాల నుంచి కూడా అభ్యర్థులు సివిల్స్‌లో విజేతలుగా నిలవాలనే లక్ష్యంతో సింగరేణి సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు.
Also Read:Deputy CM Bhatti Vikramarka: లీకులు ఇస్తే చర్యలు తప్పవు.. అధికారులపై మంత్రి ఫైర్!
రాజస్థాన్‌లో సింగరేణి పవర్
సింగరేణి సంస్థతో కలిసి రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీయూఎన్ఎల్) చేపట్టనున్న 2,300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి రాజస్థాన్ కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిందని రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆయన గురువారం ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లును కలిసి లేఖను అందజేశారు. ఈ ప్రాజెక్టుల్లో 1500 మెగావాట్ల సోలార్, 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు ఉన్నాయి. రెండు రాష్ట్రాల విద్యుత్ అవసరాలకు ఈ కొత్త ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని, త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో తమ కేబినెట్ వెంటనే ఆమోదం తెలిపిందని హీరాలాల్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా తొలిసారిగా రాజస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకుందని, ఇదే తరహాలో ఇతర రాష్ట్రాలతో కూడా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: ఇందిరమ్మ చీరల పంపిణీపై మహిళల హర్షం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

