Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న చోటు చేసుకున్న భయానక ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడికి సంబంధించిన చార్జ్‌షీట్‌ను సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేయనుంది. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యాటకులే కావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ నిర్వహించిన లోతైన దర్యాప్తులో ముగ్గురు ఉగ్రవాదుల ప్రత్యక్ష పాత్రను అధికారులు గుర్తించారు. పాకిస్తాన్‌కు చెందిన ఈ ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రసంస్థ లష్కర్-ఎ-తోయిబా (LeT)తో సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌ను జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!
ఇదిలా ఉండగా, ఈ దాడికి సహకరించిన వారిపై కూడా ఎన్‌ఐఏ చర్యలు తీసుకుంది. గత జూన్ నెలలో పహల్గాం సమీపంలోని బట్కోట్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోతర్, పహల్గాం వాసి బషీర్ అహ్మద్ జోతర్‌లను అరెస్టు చేశారు. వీరు ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం, ఇతర సహాయం అందించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ దాడికి పాల్పడిన వారిద్దరూ పాకిస్తాన్ పౌరులేనని, లష్కర్-ఎ-తోయిబా సంస్థకు చెందిన వారేనని అధికారులకు గుర్తించారు.
దాడి అనంతరం ఈ ముగ్గురు ఉగ్రవాదులు డాచిగామ్–హర్వాన్ అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. అనంతరం భద్రతా దళాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా జూలై 28న శ్రీనగర్ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ మహాదేవ్’ అనే కోడ్ నేమ్ పెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు కూడా ఘనమైన ప్రతిచర్యకు దిగాయి. మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం తొమ్మిది కీలక లక్ష్యాలను భారత దళాలు ధ్వంసం చేశాయి. ఇందులో లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రసంస్థల ప్రధాన కార్యాలయాలు, శిక్షణ కేంద్రాలు కూడా ఉన్నట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇవి భారత్‌పై దాడుల ప్రణాళిక, అమలుకు ఉపయోగిస్తున్న కేంద్రాలేనని అధికారులు తెలిపారు.
మొత్తంగా చూస్తే, పహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. చార్జ్‌షీట్ దాఖలుతో ఈ కేసు న్యాయపరంగా మరింత ముందుకు సాగనుండగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకుంటున్న కఠిన చర్యలకు ఇది మరో ఉదాహరణగా నిలవనుంది.

