Cyber Crime: అంతర్జాతీయ సైబర్ మోసాల కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. రూ.1,000 కోట్లకు పైగా ప్రజల సొమ్మును మోసాలతో కొల్లగొట్టిన ట్రాన్స్‌నేషనల్ సైబర్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన కేసులో నలుగురు చైనా పౌరులు సహా మొత్తం 17 మంది వ్యక్తులు, 58 కంపెనీలపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ రాకెట్‌ను గత అక్టోబర్‌లో ఛేదించిన సీబీఐ, అనంతరం నెలల పాటు సాగించిన లోతైన దర్యాప్తులో కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
సీబీఐ దర్యాప్తు ప్రకారం, ఇది ఒక్కొక్కటి విడిగా కనిపించిన మోసాల సమాహారం కాదు. ఒకే కేంద్రంగా నియంత్రితమైన, అత్యంత సమన్వయంతో పనిచేసిన సైబర్ నేరాల సిండికేట్‌గా ఈ నెట్‌వర్క్ పనిచేసినట్లు తేలింది. ఆన్‌లైన్ లోన్ యాప్ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, పోంజీ స్కీములు, మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు, ఫేక్ పార్ట్‌టైం ఉద్యోగ ఆఫర్లు, మోసపూరిత ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫాంల నుంచి వేలాది మందిని మోసగించినట్లు సీబీఐ పేర్కొంది.
దర్యాప్తులో భాగంగా సీబీఐ మొత్తం 111 షెల్ కంపెనీలను గుర్తించింది. ఈ షెల్ సంస్థల ద్వారా మ్యూల్ అకౌంట్లను ఉపయోగించి సుమారు రూ.1,000 కోట్లను లేయరింగ్ చేసి మళ్లించినట్లు వెల్లడైంది. ఒకే బ్యాంక్ ఖాతాలో తక్కువ కాలంలోనే రూ.152 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ షెల్ కంపెనీలను డమ్మీ డైరెక్టర్లు, నకిలీ డాక్యుమెంట్లు, తప్పుడు చిరునామాలు, అసత్య వ్యాపార ఉద్దేశాలతో నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది.
ఈ షెల్ సంస్థలను బ్యాంక్ ఖాతాలు, పేమెంట్ గేట్‌వే మర్చంట్ అకౌంట్లు తెరవడానికి ఉపయోగించారని సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ నేరాల నుంచి వచ్చిన సొమ్మును వేగంగా మళ్లించడం, అసలు మూలాన్ని దాచడం సులభమైందని చెప్పారు. ఈ మొత్తం స్కామ్ మూలాలు 2020లో, దేశం కోవిడ్-19 మహమ్మారి కష్టకాలంలో ఉన్న సమయంలో మొదలైనట్లు దర్యాప్తులో తేలింది.
ఈ నెట్‌వర్క్‌ను విదేశాల నుంచి నియంత్రించిన చైనా హ్యాండ్లర్లుగా Zou Yi, Huan Liu, Weijian Liu, Guanhua Wangలను సీబీఐ గుర్తించింది. వీరి ఆదేశాల మేరకు భారతదేశంలో ఉన్న సహచరులు అమాయకుల నుంచి ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలను సేకరించి, వాటితో షెల్ కంపెనీలు, మ్యూల్ అకౌంట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. ఈ అకౌంట్ల మోసాల నుంచి వచ్చిన డబ్బును క్లీన్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.
దర్యాప్తులో కీలకంగా, ఇద్దరు భారత నిందితులకు చెందిన బ్యాంక్ ఖాతాలతో లింక్ అయిన ఒక యూపీఐ ఐడీ 2025 ఆగస్టు వరకు విదేశీ లొకేషన్ నుంచి యాక్టివ్‌గా పనిచేసినట్లు సీబీఐ గుర్తించింది. ఇది ఈ మొత్తం ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను విదేశాల నుంచే రియల్‌టైమ్‌లో నియంత్రిస్తున్నారన్న విషయాన్ని స్పష్టంగా నిరూపించిందని సీబీఐ పేర్కొంది.
ఈ ముఠా అత్యంత ఆధునిక, టెక్నాలజీ ఆధారిత పద్ధతులను ఉపయోగించిందని సీబీఐ తెలిపింది. గూగుల్ యాడ్స్, బల్క్ ఎస్‌ఎంఎస్ క్యాంపెయిన్లు, సిమ్-బాక్స్ మెసేజింగ్ సిస్టమ్స్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాంలు, అనేక మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను వినియోగించి బాధితులను మోసగించినట్లు దర్యాప్తు వెల్లడించింది. ప్రతి దశను చట్ట అమలు సంస్థలకు దొరకకుండా ఉండేలా ప్లాన్ చేశారని అధికారులు తెలిపారు.
ఈ కేసు దర్యాప్తు భారత గృహ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అందించిన సమాచారంతో ప్రారంభమైంది. ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని గుర్తించిన I4C సమాచారం మేరకు అక్టోబర్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మొదట విడివిడిగా కనిపించిన ఫిర్యాదులు, సీబీఐ లోతైన విశ్లేషణలో ఒకే ఆర్గనైజ్డ్ కుట్రగా తేలినట్లు అధికారులు తెలిపారు.
అక్టోబర్ అరెస్టుల తర్వాత, సీబీఐ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో 27 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు, ఆర్థిక రికార్డులను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరిశీలనకు పంపింది. ఈ ఆధారాలే ఇప్పుడు దాఖలైన ఛార్జ్‌షీట్‌కు బలమైన పునాదిగా నిలిచినట్లు సీబీఐ వెల్లడించింది.

