Mumbai Terror Threat: గణేష్ నిమజ్జనాలతో ముంబయి నగరం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రేపటిలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ముగియనుండటంతో నగర వీధుల్లో పెద్ద ఎత్తున గణనాథుల ఊరేగింపు జరుగుతోంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముంబయి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద పదుల సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల పేరుతో వచ్చిన బాంబు బెదిరింపులు దేశవ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
లష్కర్-ఎ-జిహాది పేరుతో..
ముంబయి పోలీసులకు వాట్సాప్‌లో ఓ బాంబు బెదిరింపు వచ్చింది. “లష్కర్-ఎ-జిహాది” పేరుతో ఈ సందేశం పోలీసులకు వచ్చింది. గురువారం ట్రాఫిక్ పోలీసుల కంట్రోల్ రూమ్ వాట్సప్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఈ సందేశాన్ని పంపారు. గణేష్ ఉత్సవం రేపటితో ముగియనున్న నేపథ్యంలో నగరంలో డజన్ల కొద్దీ పేలుళ్లు జరగబోతున్నాయని అందులో పేర్కొన్నారు. 34 వాహనాల్లో ‘మానవ బాంబులు’ పెట్టబడ్డాయని.. అవి పేలి మెుత్తం నగరాన్ని కుదిపేస్తాయని బెదిరించారు. 14 మంది పాకిస్థాన్ తీవ్రవాదులు ఇప్పటికే భారత్ లోకి ప్రవేశించారని సందేశంలో హెచ్చరించారు. 400 కిలోల ఆర్డీఎక్స్ తో పేలుళ్లు జరిపి.. నగరంలో కోటి మందిని చంపగలమని బెదిరించారు.
Also Read: Shocking Incident: అమ్మబాబోయ్.. కంటి కింద పెరిగిన పన్ను.. అవాక్కైన వైద్యులు
నగరంలో భద్రత కట్టుదిట్టం
తాజా బెదిరింపులతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు.. నగరవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ‘ఈ బెదిరింపును అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS)కి సమాచారం ఇచ్చాం’ అని ఒక అధికారి తెలిపారు. ‘మా భద్రతా బలగాలు ఏ విధమైన ముప్పునైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మేము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పార్కింగ్ స్థలాల నుండి బేస్‌మెంట్ వరకు అన్నీ చెక్ చేస్తున్నాం. ఎలాంటి చోటు వదిలిపెట్టడం లేదు’ అని ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.
Also Read: Japanese woman: అంతరిక్షంలో చిక్కుకున్నా.. ఆక్సిజన్ కావాలంటూ.. డబ్బు దోచేసిన ఫేక్ వ్యోమగామి
ప్రజలకు విజ్ఞప్తి..
ఉగ్రసంస్థ పేరుతో వచ్చిన వదంతులను ప్రజలెవరు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఆ సందేశం నిజమని తేల్చే ఒక్క ఆధారం కూడా బయటపడలేదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ముంబయిలో 10 రోజుల గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నిమజ్జనానికి రేపే (ఆగస్టు 6) చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున గణనాథుడి విగ్రహాలు రోడ్లపైకి రానున్నాయి. వాటిని వీక్షించేందుకు లక్షల్లో ప్రజలు తరలివస్తుంటారు.
తప్పుడు బెదిరింపు కాల్
మరోవైపు మహారాష్ట్రలోని థానే జిల్లాలోనూ ఇదే తరహాలో బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేసారు. నిందితుడిని రూపేల్ మధుకర్‌గా గుర్తించారు. కల్వ రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టినట్టు ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు అతడు ఫోన్ చేశాడని రైల్వే పోలీసులు తెలిపారు. పోలీసు హెల్ప్ లైన్ కు వచ్చిన కాల్ ఆధారంగా అతడ్ని ట్రేస్ చేసి అరెస్ట్ చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.