Health Awareness: మునగాకుతో ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో మునగాకు ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు గట్టిపడడానికి, చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా బాగా దోహదపడుతుంది. ఇవన్నీ మునగాకు ద్వారా కలిగే గొప్ప ప్రయోజనాలు, అయితే, కొందరు వ్యక్తులు మునగాకు అస్సలు తినకూడదు. తిన్నారంటే ఆరోగ్యానికి కీడు తలపెడుతుందని ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తినకూడని వ్యక్తులు మునగాకు తిన్నారంటే, విషంతో సమానంగా హానికలిగిస్తుందని చెబుతన్నారు. మరి, మునగాకు ఎవరు తినకూడదు, తింటే ఏమవుతుందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అందరూ తినకూడదు!
మునగాకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్య పరిస్థితులలో మునగాకు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుందని సామాజిక విశ్లేషకులు, ఆయుర్వేద నిపుణులు డా.చిన్నరావు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు గర్భందాల్చిన ప్రారంభ దశల్లో మునగాకు తినకూడదు. మునగలోని కొన్ని సమ్మేళనాలు గర్భాశయ సంకోచాన్ని ప్రేరేపించే అవకాశం ఉంటుందని చెప్పారు. గర్భధాల్చిన తొలి దశలో వైద్యుల సలహాలు, సూచనలు లేకుండా తినకపోవడమే మంచిదని సూచించారు.
బీపీ మందులు వాడుతున్నవారు
మునగాకు సహజంగా బీపీని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. బీపీ కంట్రోల్ కోసం మందులు వాడుతున్న వ్యక్తులు మునగాకును కూడా తింటే బీపీ బాగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, బీపీ మందులు వాడే వ్యక్తులు మునగాక వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవారు కూడా మునగాకు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించే ఔషధ లక్షణాలు మునగాకుకు ఉన్నాయి. షుగర్ టాబ్లెట్లు వాడే వ్యక్తులు మునగాకు తింటే హైపోగ్లైసీమియాకు దారితీసే అవకాశం ఉంటుంది. అంటే, రక్తంలో షుగర్ లెవల్స్ కనిష్ఠ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంటుంది.
జీర్ణ సమస్యలుంటే.. జరజాగ్రత్త
జీర్ణ సమస్యలు ఉన్నవారు మునగాకు తింటే వికారం, ఉబ్బరం లేదా కడుపులో ఇబ్బంది వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడే సున్నిత వ్యక్తులకు ఈ ప్రతికూల పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.
థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు కూడా మునగాకును చాలా జాగ్రత్తగా వాడాలి. మునగలో ఉండే కొన్ని సమ్మేళనాలు థైరాయిడ్ హార్మోన్ లెవల్స్‌ను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా, హైపోథైరాయిడిజం ఉన్నవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆహారంలో భాగంగా మునగాకు తీసుకునే ముందు ఇంట్లో వ్యక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మునగాకు వాడాలి. వైద్య నిపుణులను సంప్రదించడం మేలు చేస్తుంది. మెడిసిన్ వాడే వ్యక్తులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మునగాకు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనదని, సరిగ్గా ఉపయోగించకపోతే మాత్రం కీడు చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
Read this- ISKCON Monk: సుందర్ పిచాయ్ ప్రశ్నకు ఇస్కాన్ సన్యాసి ఇచ్చిన సమాధానం ఇదే
గమనిక: పలు అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.