ISKCON monk: ప్రస్తుతం కొనసాగుతున్నది ‘డిజిటల్ యుగం’. వినోదం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ సేవలు విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్నాయి. వృత్తి రీత్యా ఉపయోగించేవారు కొందరైతే, వినోదం కోసం అధిక సమయాన్ని వెచ్చిస్తున్నవారు చాలామందే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువతకు ఇంటర్నెట్ ఒక వ్యసనంలా మారిపోయింది. కారణం ఏదైతేనేం, ఇంటర్నెట్‌పై అధిక సమయాన్ని గడుపుతున్నవారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, ఆధ్యాత్మిక మార్గం ఇందుకు పూర్తిగా విభిన్నమైనది. ఒత్తిడిని ఆమడ దూరం పారదోలే జీవనశైలి ఈ విధానంలో అలవడుతుంది. టెక్ రంగ దిగ్గజ వ్యక్తి, ఆధ్యాత్మిక గురువు మధ్య చర్చ జరిగినప్పుడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటనేది మరింత అర్థవంతంగా బోధపడుతుంది.
Read this- Medchal District Crime: చాకలి ఐలమ్మ మునవరాలు దారుణ హత్య.. కన్నతల్లిని చంపిన కూతురు!
అలాంటి ఒక అనుభవాన్నే, ఇటీవలే లండన్‌లో ముగిసిన ఇండియా గ్లోబల్ ఫోరం-2025లో (IGF) ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ మాట్లాడుతూ, టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో (Sundar Pichai) ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. తాజ్ సెయింట్ జేమ్స్ కోర్టులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులను ఉద్దేశించి గౌరంగ దాస్ మాట్లాడుతూ… తాను, సుందర్ పిచాయ్ ఐఐటీలో (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఒకే బ్యాచ్ విద్యార్థులమని వెల్లడించారు. అయితే, వేర్వేరు క్యాంపస్‌లలో చదువుకున్నామని తెలిపారు. కాలేజీ రోజుల్లో ఎప్పుడూ ఒకరినొకరం కలుసుకోలేదని వివరించారు.
తాను ఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తి చేయగా, పిచాయ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదివారని పేర్కొన్నారు. ‘‘గ్రాడ్యుయేషన్ పూర్తయిన చాలా ఏళ్ల తర్వాత మేము ఒకసారి కలుసుకున్నాం. నా కంటే చిన్నవాడిలా కనిపిస్తున్నావంటూ పిచాయ్ నన్ను ప్రశ్నించారు. ఒత్తిడిని కలగజేసే గూగుల్‌లో నువ్వు పనిచేస్తున్నావు. ఒత్తిడిని మటుమాయం చేసే దేవుడితో నా పని’’ అని బదులిచ్చానంటూ గౌరంగ దాస్ గుర్తుచేసుకున్నారు. డిజిటల్ వ్యసనం, సోషల్ మీడియాతో ముడిపడిన మానసిక అనారోగ్య సమస్యలపై ఈ సందర్భంగా గౌరంగ దాస్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు.
Read this- Team India: 93 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. టీమిండియా సంచలన రికార్డు
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే నుంచి బీటెక్ పట్టా పొందిన తాను, ఒత్తిడి లేని జీవనశైలిలో పయనిస్తున్నందున యవ్వనంగా కనిపిస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ యుగంలో మానసిక సమస్యల అంశంపై మాట్లాడే సందర్భంలో ఈ అనుభవాన్ని గౌరంగ దాస్ పంచుకున్నారు. తద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ‘‘మనకొక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే, ప్రపంచవ్యాప్తంగా 230 మిలియన్ల మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారారు. ఒక్క భారతదేశంలోనే, ఏకంగా 70 శాతం మంది టీనేజర్లు ప్రతిరోజూ సుమారు 7 గంటల సమయం ఆన్‌లైన్‌లో గడుపుతారు. ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు” అని దాస్ పేర్కొన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను మితిమీరి వినియోగించడంతో యువత మనసులపై ప్రభావం చూపుతోందని అన్నారు. యువతలో ఒంటరితనం పెరిగిపోతోందని ఆందోళన వెలిబుచ్చారు. యువత డిజిటల్ వ్యసనపరులు అవుతున్నారని విచారం వ్యక్తం చేశారు.