Heart Diseases: గత కొన్నేళ్లుగా యువతలో గుండె జబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఉన్న చోటే పిట్టల్లా రాలిపోతుండడం కలవరానికి గురిచేస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) గణాంకాల ప్రకారం, ప్రతి 33 సెకన్లకు ఒకరు గుండె సంబంధ వ్యాధులతో (CVDs) ప్రాణాలు కోల్పోతున్నారు. 2022లో గుండె జబ్బులతో ఏకంగా 702,880 మంది మృతి చెందారు. అంటే, ప్రతి 5 మరణాలలో ఒక దానికి గుండె సంబంధిత సమస్యలే కారణం కావడం ఆందోళన కలిగించే విషయం. ఇక, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు గుండె సంబంధిత సమస్యలే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) రిపోర్ట్ కూడా చెబుతోంది. హృద్రోగ సమస్యలతో ప్రతి ఏడాది సుమారు 17.9 మిలియన్ల మంది చనిపోతున్నారని పేర్కొంది.
ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే గుండెను పదిలంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టమవుతోంది. గుండె ఆరోగ్యం దైనందిన జీవితంలో ఒక ముఖ్య భాగంగా కావాలని స్పష్టం చేస్తోంది. ఆహారం మొదలుకొని, వ్యాయామం, జీవనశైలిలో మార్పుల ద్వారానైనా గుండెను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజ్‌రాజ్ ఇటీవల గుండె జబ్బులకు అసలు కారణాలపై కీలక విషయాలు పంచుకున్నారు.
Read Also- Viral News: బెంగళూరులో వింత పరిస్థితి.. ఆఫీసులు మూసివేయాలంటూ డిమాండ్లు
గుండె జబ్బులకు కారణం ఏంటి?
గుండె జబ్బులకు అసలైన కారణం కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం కాదని, శరీరంలో సర్క్యూలేట్ అయ్యే ఎల్‌డీఎల్ (LDL) కణాలు అని డాక్టర్ భోజ్‌రాజ్ చెప్పారు. ఎల్‌డీఎల్ అంటే తక్కువ సాంద్రత లిపోప్రొటీన్లు (Low-density lipoproteins) అని ఆయన వివరించారు. “శరీరంలో ఎల్‌డీఎల్ పరిమాణం ఎంత ఉందనేది ముఖ్యం కాదు. దేనిని దెబ్బతీస్తుందనేది కీలకం’’ అని ఆయన పేర్కొన్నారు. ఎల్‌డీఎల్‌ను కొన్నిసార్లు ‘చెడు కొలెస్ట్రాల్’ అని కూడా పిలుస్తారని, ఎందుకంటే దీని స్థాయి ఎక్కువైనప్పుడు గుండె ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి దారితీస్తుందని ఆయన వివరించారు. ఇక, హెచ్‌డీఎల్ (HDL) అంటే అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు అని ఆయన చెప్పారు.
కొలెస్ట్రాల్ కణాలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయని, అయితే, ఇది డీఏఎంపీపై ( damage-associated molecular pattern) ఆధారపడి ఉంటుందని డాక్టర్ భోజ్‌రాజ్ వివరించారు. ఈ ప్రక్రియ రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని, గుండె జబ్బుల అవకాశాన్ని పెంచుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సమస్యను గుర్తించడానికి ఏడాది ఒకసారైనా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని, తద్వారా సమస్యలను గుర్తించవచ్చని సూచన చేశారు.
Read Also- Rupee Fall: మన ‘రూపాయి’కి ఏమైంది?.. ఇవాళ ఒక్కరోజే భారీ పతనం
ఈ టెస్టులు పక్కా
సీనియర్ కన్సల్టెంట్, కార్డియోథొరాసిక్ , కార్డియాక్ సర్జన్ (వాస్కులర్ సర్జరీ) అయిన డాక్టర్ రాజీవ్ వశిష్త్ ఇటీవల మాట్లాడుతూ, ఏడాదికి ఒకసారి చేయించుకునే హెల్త్ టెస్టులలో మిస్ అవుతున్న టెస్టుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈసీబీ (ఎలక్ట్రో కార్డియోగ్రామ్) టెస్టులో ప్రతిదీ తెలియదని స్పష్టం చేశారు. గుండెకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలియాలంటే మరికొన్ని టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందని పలు సూచనలు చేశారు. ఆ జాబితాలో లిపిడ్ ప్రొఫైల్, ఉపవాసంలో ఉన్నప్పుడు రక్తంలో షుగర్, బీపీపై పర్యవేక్షణ, నడుము చుట్టుకొలత టెస్టులు చేయించుకోవాలన్నారు. అప్పుడప్పుడు, ఎకోకార్డియోగ్రామ్ లేదా స్ట్రెస్ టెస్ట్ చేయించుకోవాలని సూచన చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ లేదా డిస్ప్నియా లేదా ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా ఈ టెస్టులు చేయించుకోవాలని పేర్కొన్నారు.