Indian Rupee
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Rupee Fall: మన ‘రూపాయి’కి ఏమైంది?.. ఇవాళ ఒక్కరోజే భారీ పతనం

Rupee Fall: దేశీయ కరెన్సీ ‘రూపాయి’ (Rupee Fall) విలువ అంతకంతకూ దిగజారుతోంది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే ఏకంగా 26 పైసలు మేర పతనమై, డాలర్ మారకంలో 85.66 స్థాయికి క్షీణించింది. దీంతో, శుక్రవారం సాయంత్రం 85.39 వద్ద ముగిసిన రూపాయి ఇవాళ చాలా బలహీనంగా మారింది. అమెరికా వ్యతిరేక విధానాలు ప్రతిపాదిస్తున్న ‘బ్రిక్స్’ దేశాలపై (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) 10 శాతం ఏకపక్ష సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం దేశీయ కరెన్సీ క్షీణతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

బ్రిక్స్‌తో కలిసే ఏ దేశంపైనైనా సుంకాలు విధిస్తామని, ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్‌’లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. కాగా, బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా‌తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం 10 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం బ్రెజిల్‌లోని రియో డిజనీరియో నగరంలో బ్రిక్స్ అధినేతల శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. వాణిజ్య సుంకాలు, మధ్యప్రాచ్యంలో ఘర్షణలు, ఆయుధ వ్యయాల విషయంలో ట్రంప్‌ వైఖరికి విరుద్ధమైన విధానాలను స్వీకరించడానికి బ్రిక్స్ దేశాలు సమాయత్తమవుతుననాయి.

Read Also- BRICS Summit: బ్రిక్స్ సదస్సులో మోదీ సంచలన వ్యాఖ్యలు

మార్కెట్ల బలహీనత ప్రభావం
సోమవారం ఉదయం దేశీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమవడం, ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఎఫ్ఐఐ(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) పెద్ద మొత్తంలో మార్కెట్ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా రూపాయి క్షీణతకు కారణమయ్యాయి. మరోవైపు, ఆగస్టు 1 నుంచి అధిక సుంకాలు మొదలవబోతున్నాయని, జూలై 9 లోగా కొత్తగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలంటూ అమెరికా తన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ఒత్తిడి పెంచింది. రూపాయి పతనానికి ఇది కూడా ఒక కారణమని ఫారెక్స్ నిపుణులు విశ్లేషించారు. అయితే, డాలర్ బలహీనంగా కనిపిస్తుండడం, ముడి చమురు ధరలు కనిష్ఠంగా ఉండడం, దేశీయ ఫారెక్స్ నిల్వల పెరుగుదల అంశాలు రూపాయి మరింత బలహీనం కాకుండా నిరోధించాయని పేర్కొన్నారు. ట్రంప్ పాలనా యంత్రాంగం తీసుకున్న నిర్ణయాల కారణంగా వ్యాపారాలు, వినియోగదారులతో పాటు అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలలో కూడా అనిశ్చితి పెరుగుతోంది. ట్రంప్ ఏ రోజున ఎలాంటి ప్రకటన చేస్తారో అనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also- Personal Finance: పెళ్లికి డబ్బులు కావాలా.. ఇలా చేయండి తిరుగుండదు!

అండగా జాతీయ బ్యాంకులు

నిజానికి గత కొన్ని రోజులుగా రూపాయి విలువ 85.30 నుంచి 85.60 మధ్య కదలాడింది. జాతీయ బ్యాంకులు డాలర్లను కొనుగోలు చేయడం, ఎగుమతిదారులు, ఇతర భాగస్వాముల అమ్మకాలు సానుకూలమవ్వడంతో రూపీ ఒక పరిధిలో కొనసాగిందని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ విశ్లేషించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ టారీఫ్ విధానం విషయంలో గందరగోళాన్ని సృష్టిస్తుండడం ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం కట్టు తప్పవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళనల ఫలితంగా డాలర్ కూడా బలహీనపడుతోందని భన్సాలీ పేర్కొన్నారు. గ్లోబ్ల బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్‌ ధర 0.66 శాతం తగ్గి 67.85 డాలర్లకు చేరిందని చెప్పారు. కాగా, సోమవారం ఉదయందేశీయ ఈక్విటీ మార్కెట్ల ట్రెండ్ విషయానికి వస్తే, బీఎస్ఈ సెన్సెక్స్ ఆరంభంలో 170.66 పాయింట్లు నష్టపోయి 83,262.23 వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 53.75 పాయింట్లు తగ్గి 25,407.25 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇక, జూన్ 27తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 4.84 బిలియన్ డాలర్ల మేర పెరిగి 702.78 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!