Sleeping Less Effects: మనిషికి నిద్ర ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుత గజి బిజీ జీవితాల్లో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. రోజుకు కనీసం 6-8 గంటలు పడుకోవాలన్న నియమానికి తూట్లు పొడుస్తున్నారు. దీనివల్ల కళ్లపై తీవ్ర దుష్ప్రభావం పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి సమస్య కళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళ్లకు జరిగే నష్టాలు.. వాటి నుంచి బయటపడేందుకు అనుసరించాల్సిన మార్గాలను ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
పొడిబారిన కళ్లు
కంటి లోపల ఉండే కన్నీరు.. కళ్లకు చాలా అవసరం. అవి కంటిని నిత్యం తేమగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. ఒకవేళ మీరు రోజూ 6 గంటల కంటే తక్కువ నిద్రిస్తే.. కంటి లోపల తగినంత కన్నీరు ఉత్పత్తి కాదు. ఫలితంగా మీ కళ్లు పొడిబారి పోయి.. ఎర్రగా, దురదగా, మంటగా అనిపించవచ్చు. ఇవి కంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం కూడా ఉండవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కనురెప్పలు వణకడం
కంటికి వెలుపల ఉండే రెప్పలు.. కళ్లకు రక్షణగా పనిచేస్తుంటాయి. ఒకవేళ నిద్ర తగినంతగా పోకపోతే.. వాటి సామర్థ్యం సన్నగిల్లుతుంది. ఫలితంగా కంటి రెప్పలు ఊరికే అదరడం లేదా వణకడం జరుగుతుంది. ఈ లక్షణాన్ని మయోకిమియా అంటారు. ఒక్కోసారి అలసట, ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు. అయితే తరుచూ ఇదే విధంగా కంటి రెప్పలు వణుకుతూ ఉంటే అది కళ్లకు ప్రమాదమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నల్లటి వలయాలు
తగినంత నిద్ర లేకపోతే కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయని వైద్యులు సూచిస్తున్నారు. కంటి కింద డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయంటే.. తగినంత నిద్ర పోవడం లేదని అర్థం చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. 6 గంటల కంటే తక్కువ నిద్ర పోతే కంటి చుట్టూ ఉండే రక్త నాళాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని దీనివల్ల కళ్లు ఉబ్బడంతో పాటు డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయని వివరిస్తున్నారు.
అస్పష్ట దృష్టి, ఫోకస్ సమస్య
తక్కువ నిద్ర కళ్లలోని కండరాలను బలహీనపరుస్తుంది. దీనివల్ల దృష్టి మసకబారడం లేదా స్పష్టత తగ్గడం జరుగుతుంది. కంప్యూటర్ ముందు పనిచేసే వారు ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తూ వర్క్ చేయలేకపోతారు. ఫలితంగా చేసే పనిలో ఏకాగ్రత లోపిస్తుంది.
కంటి ఇన్ఫెక్షన్లు
లవణాలు, లిపిడ్లు, ప్రోటీన్లు కలిగి ఉన్న కన్నీరు.. బ్యాక్టీరియా, దుమ్ము దూళిల నుండి మన కళ్లను రక్షిస్తుంటాయి. మీకు తగినంత నిద్ర లేకపోతే.. కన్నీరు ఉత్పత్తి ఆగిపోయి.. మీ కళ్లు ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇది కండ్ల కలక వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు.
కాంతిని చూడలేకపోవడం
సరిపడ నిద్రలేక అలిసిపోయిన కళ్లు.. చాలా సున్నితంగా మారిపోతాయని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల ప్రకాశవంతమైన వెలుగును చూసినప్పుడు వారు ఒత్తిడికి గురయ్యే ప్రమాదముందని పేర్కొంటున్నారు. లైట్లు ఉన్న గదిలో కూర్చోవడం, ఫోన్ స్క్రీన్ చూడటం, కంప్యూటర్ ముందు పనిచేయడం కష్టంగా అనిపించవచ్చు. కొందరిలో ఈ ప్రకాశవంతమైన వెలుగు కారణంగా తలనొప్పి కూడా రావొచ్చు.
Also Read: KPHB Toddy Adulteration: కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం సీరియస్
కంటి సమస్యకు పరిష్కారాలు
❄️ నిద్రలేమి వల్ల కలిగే తీవ్రమైన ప్రభావాల నుండి మీ కళ్ళను రక్షించుకోవడానికి.. మీరు మీ నిద్ర షెడ్యూల్‌ను మెరుగుపరచుకోవాలి. కనీసం 8 గంటలు నిద్రపోయేలా ప్రయత్నం చేయాలి.
❄️ పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని వీలైనంతగా పరిమితం చేయాలి. అలాగే 20-20-20 నియమాన్ని పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి.
❄️ ధ్యానం లేదా డీప్ బ్రీత్ తీసుకోవడం వంటి మంచి అలవాట్లను అలవరుచుకోవాలి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలసట, ఆందోళనను దూరం చేసి కంటిపై ఒత్తిడి తగ్గిస్తాయి.
❄️ ప్రతీ రోజు 7-8 గంటలు నిద్రపోవడం వల్ల కళ్లకు తగినంత విశ్రాంతి దొరుకుతుంది. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి మీ కళ్లు మీకు సహకరిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.