Immunity Boosting Tips: మానవుడు తన నిత్య జీవితంలో బ్యాక్టీరియాలు, వైరస్ లు వంటి కంటికి కనిపించని శత్రువులతో పోరాడుతున్నాడు. అయితే వాటిపై పోరాడేందుకు శరీరంలో రోగ నిరోధక శక్తి (Immune system) బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు తరుచూ అనారోగ్యాల బారిన పడుతుండటాన్ని చూస్తూనే ఉన్నాం. కాబట్టి తరుచూ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు.. సహజంగానే తమ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు టాప్ – 7 చిట్కాలను ఈ కథనంలో అందిస్తున్నాం. వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరమే రాదని వైద్యులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నాణ్యమైన నిద్ర
రోగనిరోధక శక్తి బలోపేతానికి నాణ్యమైన నిద్ర ఎంతో అవసరం. మన ఇన్ ఫెక్షన్లతో పోరాడటానికి సైటోకిన్ల ఉత్పత్తి చాలా ముఖ్యం. నిద్రలేమితో బాధపడేవారిలో సైటోకిన్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇమ్యూనిటీ సిస్టమ్ పనితీరు మందగిస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాబట్టి రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరి.
పౌష్టికాహారం
మనం తినే ఆహారమే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలా? బలహీన పరచాలా? అని నిర్దారిస్తాయి. కాబట్టి మీరు తినే ఆహారంలో వివిధ రకాల పండ్లు, తాజా కూరగాయాలు, తృణ ధాన్యాలను తప్పనిసరి చేయండి. విటమిన్ సి (ఉసిరి, నిమ్మ), జింక్ (చిక్కుళ్లు) ఉన్న ఆహారపదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోండి. ఇవి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. పెరుగు, ఊరగాయలు, పులియబెట్టిన ఆహారం పేగు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
నీరు తాగడం
నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రోజుకు 2.5-3 లీటర్లు తాగడం శరీరానికి చాలా అవసరం. తగినంత నీరు తాగినప్పుడే అవి మన శరీరంలోని విష పదార్థాలు, వ్యర్ధాలను బయటకు పంపగలదు. తులసి, అల్లం, పసుపుతో కూడిన హెర్బల్ టీలు.. వర్షాకాలం, ఇన్ ఫెక్షన్లు వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయాల్లో తాగితే ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టకరం.
శారీరక శ్రమ
మితమైన వ్యాయామం (రోజుకు సుమారు 30 నిమిషాలు) రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే రోగ నిరోధక కణాలు మరింత చురుగ్గా కదలడానికి సహాయపడతాయి. యోగా, వాకింగ్.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉత్తమ మార్గాలుగా ఉన్నాయి.
ఒత్తిడి లేని జీవనం
దీర్ఘకాలిక ఒత్తిడి.. రోగనిరోధక శక్తి ప్రతిస్పందనను అణిచివేస్తుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వారిలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ధ్యానం, ప్రకృతిలో సమయం గడపడం, స్క్రీన్ టైమ్ ను వీలైనంతగా పరిమితం చేయడం వంటి చర్యలతో అధిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.
ముందస్తు ఆరోగ్య పరీక్షలు
చాలా మంది అనారోగ్యం బారిన పడిన తర్వాత మాత్రమే హెల్త్ చెకప్ కు వెళ్తుంటారు. అలా కాకుండా రెగ్యులర్ గా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే విటమిన్ డి లేదా బి 12 లోపాలను గుర్తించవచ్చు. రక్తంలో చక్కెల స్థాయులు, కాలేయ పనితీరును పర్యవేక్షించడానికి వీలు కలుగుతుంది. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసే అంశాలు కాబట్టి.. రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం ఉత్తమమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: PM Dhan Dhanya Krishi Yojana: పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఆమోదం.. ప్రతి ఏటా రూ.24వేల కోట్లు
వ్యక్తిగత పరిశుభ్రత
ఈ రోజుల్లో వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, టచ్ పాయింట్లను శుభ్రంగా ఉంచడం, మరొకరు తిన్న ఆహారాన్ని షేర్ చేసుకోకపోవడం వంటివి చేయాలి. తద్వారా వైరస్, బ్యాక్టీరియాల వ్యాప్తిని నివారించవచ్చు. ఇన్ ఫెక్షన్న నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
Also Read This: Shubhanshu Shukla: ఫ్యామిలీని కలుసుకున్న శుభాంశు శుక్లా.. నెట్టింట భావోద్వేగ పోస్ట్!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.