Diwali Outside India: దీపావళి పండుగ పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరికీ భారతదేశమే గుర్తుకొస్తుంది. వాస్తవానికి మనదేశంలోనే కాకుండా, మరికొన్ని దేశాల్లో కూడా దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం (Diwali Outside India) ఉంది. అక్కడ కూడా చాలా గ్రాండ్‌గా వేడుకలు నిర్వహిస్తుంటారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు, సంస్కృతీ వారసత్వమే ఇందుకు కారణం అయినప్పటికీ, ఆయా దేశాల్లో కూడా వెలుగుల పండుగగా విరాజిల్లుతోంది. మరి, ఆ దేశాలు ఏంటి?, అక్కడ ఏవిధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? అనే విషయాలను ఈ కథనంలో చూద్దాం.
ట్రినిడాడ్ అండ్ టొబాగో
దక్షిణ అమెరికాకు సమీపంలో ఉండే కరేబియన్ దీవుల దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. 19వ శతాబ్దంలో అక్కడికి పెద్ద సంఖ్యలో వలస వెళ్లిన భారతీయులు స్థిరపడ్డారు. తరాలు మారినప్పటికీ వారి వారసులు సంప్రదాయాలను సజీవంగా ఉంచుతున్నారు. ఆ దేశంలో దీపావళి పండుగ కేవలం హిందూ పండుగ మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ఒక సాంస్కృతిక ఉత్సవంగా గుర్తింపునిచ్చారు. దీపావళి పండుగ రోజున దేశమంతా జాతీయ సెలవుదినంగా పాటిస్తారు. భారతదేశంలో మాదిరిగానే పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే ఇళ్ల శుభ్రం చేసుకోవడం, కొత్త దుస్తులు కొనుక్కోవడం, పిండివంటలు చేయడం వంటివి ఆచరిస్తుంటారు. దీపావళి పండుగ రోజు రాత్రి ఇళ్లు, ప్రభుత్వ ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో మట్టి ప్రమిదలు, విద్యుత్ దీపాల అలంకరణతో వెలిగిపోతుంటాయి. ఆ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.
ముఖ్యంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని దివాళీ నగర్ (Divali Nagar) ఈ పండుగకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దేశ రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు సమీపంలో దివాళీ నగర్ ఉంటుంది. పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే ఈ నగరం దీప కాంతులతో కళకళలాడుతుంది. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, రామాయణ ఘట్టాల ప్రదర్శనలు, నాటకాలు నిర్వహిస్తుంటారు. వివిధ రకాల సాంప్రదాయ భారతీయ వంటకాల స్టాల్స్, దీపాలు, షాప్‌లు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో దివాళీ నగర్ మొత్తం సందర్శకులతో కిక్కిరిసిపోతుంది. కేవలం హిందువులే మాత్రమే కాకుండా, , క్రిస్టియన్లు, ముస్లింలు కూడా మతస్తుల ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి మత సామరస్యానికి ఇదొక చక్కటి ఉదాహరణ.
Read Also- TG Police Corruption: చట్టం ఉన్నోళ్లకు చుట్టమా.. నీటి మీద రాతలుగా పోలీస్ బాస్‌ల ఆదేశాలు
నేపాల్‌లో 5 రోజుల పండుగ
నేపాల్‌లో దీపావళి పండుగను తిహార్ (Tihar), లేదా యమపంచక్ అని పిలుస్తారు. లక్ష్మీ పూజతో సరిపెట్టుకోకుండా, ఐదు రోజుల పాటు మనుషులతో సన్నిహితంగా మెలిగే జంతువులను, సోదర బంధాన్ని గౌరవించే ప్రత్యేక ఉత్సవంగా అక్కడ జరుపుకుంటారు. జంతువులను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. తిహార్ పండుగలో మొదటి నాలుగు రోజుల్లో కాకులు, కుక్కలు, ఆవులు, ఎద్దులను పూజిస్తారు. ముఖ్యంగా ‘కుకుర్ తిహార్’ రోజున కుక్కలకు పూలమాలలు వేసి, తిలకం దిద్ది, రుచికరమైన ఆహారాన్ని అందించి వాటికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. మూడవ రోజున భారత్‌లో మాదిరిగానే లక్ష్మీ పూజ చేస్తారు. ధన దేవతను స్వాగతిస్తూ ఇళ్ల ముందు దీపాలు, మట్టి ప్రమిదలు వెలిగిస్తారు. ఇక, చివరి రోజున ‘భాయ్ టికా’ పండుగను జరుపుకుంటారు. ఆ రోజున అక్కాచెల్లెల్లు తమ అన్నయ్యలు, తమ్ముళ్ల నుదిటిపై సప్తవర్ణాల (ఏడు రంగుల) తిలకం దిద్ది, వారు దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటారు. ఈ సందర్భంగా సోదరులు కూడా తమ అక్కాచెల్లెళ్లకు కానుకలు ఇస్తారు. రంగురంగుల పూల దండలను మెడల్లో ధరించి ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. అంతేకాదు, పిల్లలు, యువకులు గ్రూపులుగా ఏర్పడి ఇంటింటికి తిరుగుతూ సాంప్రదాయక పాటలు పాడుతూ, ఆశీర్వదిస్తుంటారు. ఇందుకు ప్రతిఫలంగా ఇంటి యజమానులు వారికి డబ్బులు, స్వీట్స్ ఇస్తారు.
Read Also- Bandi Sanjay: మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి: బండి సంజయ్ హెచ్చరిక
మలేషియా, సింగపూర్‌లోనే విశిష్ట ప్రాధాన్యత
మలేషియా, దాని పొరుగునే ఉన్న సింగపూర్‌లో కూడా దీపావళి పండుగ గ్రాండ్‌గా జరుపుకుంటారు. మలేసియాలో ఆ రోజు జాతీయ సెలవుదినం. ఈ రెండు దేశాలలో దీపావళి పండుగకు ముఖ్యమైన ప్రత్యేకత ‘ఓపెన్ హౌస్ (Open House)’ సంస్కృతి. అంటే, దీపావళి పర్వదినాన, లేదా ఆ తరువాత, అక్కడి భారతీయ కుటుంబాలు తమ ఇళ్లకు ముస్లిం, చైనీస్, ఇతర మతాలకు చెందిన ఫ్రెండ్స్‌ను పొరుగువారికి ఆహ్వానిస్తారు. వివిధ సంస్కృతులకు చెందిన వారంతా ఒకే ఇంట్లో కూర్చుని, సాంప్రదాయ భారతీయ వంటకాలతో విందులు చేస్తారు.
పండుగ రోజున సింగపూర్‌లోని లిటిల్ ఇండియా ప్రాంతం, మలేషియాలోని బటు కేవ్స్ దేవాలయం, కౌలాలంపూర్ వీధులు వేల కొద్దీ రంగురంగుల దీపాలతో వెలిగిపోతుంటాయి. భారీ రంగోలిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. మలేషియాలోని హిందువులు దీపావళి రోజున వేకువజామునే లేచి, నూనెతో తలస్నానం చేస్తారు. అనంతరం ఆలయాలకు వెళ్తారు. ఈ సంప్రదాయం పాపాలను పోగొట్టి, శుభాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తారు. దీపావళి పండుగ సాధారణంగా హిందూ పంచాంగం ప్రకారం వస్తుంది, కాబట్టి ఆయా దేశాల స్థానిక సమయం, ఆచారాల ఆధారంగా లక్ష్మీ పూజ ముహూర్తం ఒక రోజు అటూ ఇటుగా మారవచ్చు.
