Herbal Teas: సాధారణంగా వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంటుంది. అధిక తేమ, ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గుల కారణంగా జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతుంది. దీని వల్ల చాలా మందిలో కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్, ఇన్పెక్షన్లు వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి వర్షాకాలంలో హెర్బల్ టీలను తాగడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఇవి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు.. తీవ్ర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణగా నిలుస్తుంది. ఇంతకీ వర్షకాలంలో జీర్ణ క్రియను పెంచే హెర్హల్ టీలు ఏవి? అవి ఎలా పనిచేస్తాయి? వాటి వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటీ? అన్నది ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
పుదీనా టీ (Peppermint Tea)
పుదీనా ఆకులతో తయారు చేసే ఈ టీ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇందులోని మెంథాల్ కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) లక్షణాల నుంచి కూడా ఉపశమనం అందిస్తుంది. తాజా లేదా ఎండిన పుదీనా ఆకులను 5-10 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి ఈ టీ తయారు చేయవచ్చు.
అల్లం టీ (Ginger Tea)
అల్లం జీర్ణక్రియకు అద్భుతమైన సహజ ఔషధం. ఇందులోని జింజెరాల్స్, షోగాల్స్ కడుపు ప్రక్రియను బలోపేతం చేసి.. వికారం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. వేడి నీటిలో అల్లం ముక్కలను 10 నిమిషాలు మరిగించి తేనె లేదా బెల్లం జోడించి తాగవచ్చు.
తులసి టీ (Tulsi Tea)
తులసి ఆకులకు ఉన్న యాంటీఆక్సిడెంట్ గుణాలు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది. తులసి ఆకులను 5-7 నిమిషాలు వేడి నీటిలో మరిగించి తేనె లేదా నిమ్మరసం జోడించి తాగవచ్చు.
చమోమిలే టీ (Chamomile Tea)
చమోమిలే టీ జీర్ణ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి.. దానిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది ఆమ్ల రిఫ్లక్స్, కడుపు నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. ఎండిన చమోమిలే పుష్పాలను 3-5 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి టీగా తాగవచ్చు.
సోంపు టీ (Fennel Tea)
సోంపు గింజలు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. సోంపు గింజలను వేడి నీటిలో 5-10 నిమిషాలు నానబెట్టి ఈ టీ తయారు చేయవచ్చు.
లవంగం టీ (Clove Tea)
లవంగం యాంటీ బాక్టీరియల్ గుణాలతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే గొంతు నొప్పిని సైతం తగ్గిస్తుంది. లవంగాలను వేడి నీటిలో 5-7 నిమిషాలు మరిగించి తాగవచ్చు.
ములేఠీ టీ (Licorice Tea)
ములేఠీ (లికోరైస్)తో చేసే టీ తాగిడం వల్ల అది కడుపులో ఆమ్ల గాఢతను తగ్గించడమే కాకుండా.. గుండెల్లో మంటను నివారిస్తుంది. ఇది కడుపు లైనింగ్‌ను శాంతపరుస్తుంది. ములేఠీ రూట్‌ను 10 నిమిషాలు నీటిలో మరిగించి ఈ టీ తయారు చేయవచ్చు.
దాల్చిన చెక్క టీ (Cinnamon Tea)
దాల్చిన చెక్క యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది. దీంతో చేసిన టీ తాగడం ద్వారా వర్షాకాలంలో జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. దాల్చిన చెక్క.. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. దాల్చిన చెక్కను వేడి నీటిలో 7-10 నిమిషాలు నానబెట్టి తాగవచ్చు.
గులాబీ టీ (Rose Tea)
గులాబీ రేకులతో తయారు చేసే ఈ టీ.. విటమిన్ – Cని గణనీయంగా శరీరానికి అందిస్తుంది. తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే గొంతు నొప్పి, విరేచనాలను తగ్గిస్తుంది. గులాబీ రేకులను 5-6 సెకన్ల పాటు వేడి నీటిలో మరిగించి తేనె జోడించి తాగవచ్చు.
Also Read: Diets – Supplements: ప్రొటీన్స్ తీసుకోవడంలో కన్ఫ్యూజనా? ఇవి తెలిస్తే ఫుల్ క్లారిటీ వచ్చినట్లే!
వారు మాత్రం జాగ్రత్త..
హెర్బల్ టీలను అన్ని వయస్సుల వారు ఎలాంటి సంకోచం లేకుండా తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ టీలను తయారు చేసేటప్పుడు తాజా లేదా ఎండిన హెర్బ్‌లను ఉపయోగించవచ్చని పేర్కొంటున్నారు. వాటికి తేనె లేదా నిమ్మరసం జోడిస్తే రుచి మరింత పెరగడంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెరగవుతాయని చెబుతున్నారు. అయితే గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, ఔషధాలు ఉన్నవారు హెర్బల్ టీలను తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.