Home Remedies: చలికాలం వస్తే చాలు అమ్మో చలి బాబోయ్.. చలి అంటారు. వాన పడితే .. వానలు ఎక్కువగా పడుతున్నాయి అంటారు. ఎండలు వస్తే కొంచం సేపు కూడా బయట ఉండలేకపోతున్నాం అంటారు. ఇలా మనిషి ఏది ఎక్కువగా ఉన్నా కూడా తట్టుకోలేరు. అయితే, ఈ సీజన్లో వేడి పానీయాలు తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ, ఇదే సమయంలో జలుబు, దగ్గు కూడా ఈ కాలంలో సాధారణమే. మార్కెట్లో దొరికే సిరప్స్, మందులు వాడకుండానే, ఇంట్లో ఉన్న సహజ పదార్థాలతో ఈ సమస్యలకు త్వరగా ఉపశమనం పొందొచ్చు.
1. అల్లం – తేనె టీ
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. తాజా అల్లం ముక్కలను నీటిలో మరిగించి, తేనె వేసి రోజుకు 2–3 సార్లు తాగితే జలుబు సమస్యలు తగ్గుతాయి అలాగే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
2. పసుపు పాలు (Golden Milk)
పసుపులో ఉండే కర్క్యూమిన్ యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. వేడి పాలలో ఒక చెంచా పసుపు వేసుకుని తాగితే గొంతు నొప్పి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గి త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది.
3. యూకలిప్టస్ ఆయిల్‌తో ఆవిరి పీల్చడం
ఆవిరి పీల్చడం ముక్కు దిబ్బడను తగ్గించి, శ్వాస మార్గాలను తెరుస్తుంది. వేడి నీటిలో కొన్ని చుక్కలు యూకలిప్టస్ లేదా పెప్పర్‌మింట్ ఆయిల్ వేసి 5–10 నిమిషాలు ఆవిరి పీల్చడం ద్వారా ఛాతి దిబ్బడ తగ్గుతుంది.
4. తులసి ఆకులు
తులసి ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. కొన్ని తులసి ఆకులు నమలడం లేదా తేనెతో తులసి టీ తాగడం దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది.
5. వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అయితే, రోజూ 1–2 వెల్లుల్లి రెబ్బలు తినడం లేదా వంటకాల్లో వేసుకోవడం వలన జలుబు లక్షణాలు తగ్గుతాయి.
6. నిమ్మరసం – తేనె నీరు
నిమ్మరసంలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసం, ఒక చెంచా తేనె వేడి నీటిలో కలిపి రోజుకు 2–3 సార్లు తాగడం వలన గొంతు నొప్పితో పాటు, దగ్గు కూడా తగ్గిస్తుంది.

