MLC Kavitha: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌లో నైరాశ్యం నెలకొన్నది. అలాంటి సమయంలో కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత ( Kavitha) లేఖాస్త్రం సంధించడం, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం, జాగృతి పేరుతో హడావుడి చేయడం అటు పార్టీలో, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా ఇంకో ఎమ్మెల్సీకి చెందిన కార్యాలయంలో జాగృతి సభ్యులు దాడి చేయడం ఇలా అన్నీ బీఆర్ఎస్‌కు డ్యామేజ్ చేస్తున్నాయన్న చర్చ నేపథ్యంలో కేసీఆర్, (KCR) హరీశ్ రావు, కేటీఆర్ (KTR) భేటీ కావడం హాట్ టాపిక్ అయింది.
నంది నగర్‌లో సమావేశం
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) భేటీ అయ్యారు. నంది నగర్‌లోని నివాసంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర, జాతీయ రాజకీయాలతో పాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలపై కేసీఆర్ ఆరా తీశారు. కాంగ్రెస్, బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలపైనా చర్చించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాగించిన తరహాలో తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. యువత, విద్యార్థులకు చేరువ కావడం లక్ష్యంగా తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారని లీకులు వచ్చాయి. అంతేకాదు, పార్టీ పటిష్టతకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. అయితే, ఈ భేటీలో ప్రధానంగా కవిత తీరుపై చర్చించినట్టు తెలుస్తున్నది. జాగృతి పేరుతో చేస్తున్న కార్యక్రమాలు, పార్టీలో, బయట కవిత కయ్యాలపై కేసీఆర్ ఆరా తీసినట్టు సమాచారం.
Also Read: CM Revanth Reddy: పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన రేషన్ కార్డులెన్ని? సీఎం సంచలన వ్యాఖ్యలు..
ఒంటరైన కవిత!
ఎమ్మెల్సీ కార్యాలయంపై జాగృతి నేతల దాడి, ఆ తర్వాతి పరిణామాలపై బీఆర్ఎస్ పెద్దగా స్పందించడం లేదు. ప్రత్యర్థి నాయకుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా, కవిత పక్షాన పార్టీ నిలడిన ఆనవాళ్లు తక్కువే. కేవలం జాగృతి మాత్రమే పోరాటం చేస్తున్నది. పార్టీ ఎమ్మెల్సీగా కవిత ఉన్నప్పటికీ ఆమె పక్షాన నిలబడడం లేదు. పార్టీ అండగా ఉంటుందని భావించినప్పటికీ ఆశించిన స్పందన రాలేదు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నా ప్రత్యర్థి ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు. మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినా పట్టించుకోరా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఎందుకు స్పందించడం లేదనేది కూడా గులాబీ కేడర్‌లోనూ చర్చకు దారి తీసింది.
ఒకరిద్దరు నేతలు మినహా కవితకు అండగా నిలబడింది లేదు. ముఖ్యంగా అగ్ర నాయకులు కేటీఆర్, హరీశ్ రావు మౌనంగా ఉన్నారు. దీన్నిబట్టి కవితను దూరం పెట్టారా అనే డౌట్ వ్యక్తమవుతున్నది. ఎందుకు ఆమెకు మద్దతు పలకడం లేదు. పార్టీతో ఉన్న గ్యాప్‌తోనే ఓన్ చేసుకోవడం లేదా, లేకుంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే కోపంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం స్పందించడం లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ కవితకు ఎందుకు పార్టీ అండగా నిలబడలేదు, ఎవరిపైనైనా ఇలాంటి మాటల దాడులు జరిగితే కూడా పార్టీ ఇలాగే ఉంటుందా అనేది కూడా ఇప్పుడు కేడర్‌లో చర్చనీయాంశమైంది.
మిగతా వారి పరిస్థితేంటి?
కేసీఆర్ కుమార్తె అయిన కవితకే పార్టీ నుంచి మద్దతు లేకపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటదనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీసింది. కవితకు పార్టీలో సపోర్టు లేదని, ఆమె ఒంటరి అని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఆమె స్థాపించిన జాగృతి సంస్థకు చెందిన కార్యకర్తలే పోరాట బాట పట్టారు. కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించడంతో పాటు ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. కవితనే స్వయంగా మండలి చైర్మన్ గుత్తాతో పాటు లా అండ్ ఆర్డర్ ఐజీకి ఫిర్యాదు చేశారు. జాగృతి కార్యకర్తలు సోమవారం మహిళా కమిషన్‌కు కంప్లయింట్ చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తమకేమీ పట్టనట్లుగా, పార్టీ ఎమ్మెల్సీ కాదన్నట్లుగా వ్యవహరించడం చర్చనీయాంశమైన వేళ, కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ భేటీ కావడం, కవిత కయ్యాలపై సుదీర్ఘంగా చర్చించడంతో ఏం జరుగబోతుందో అనే ఉత్కంఠ నెలకొన్నది.
Also Read: Star Heroine: 50 సెకన్ల కోసం ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్?