Israel Hamas War Palestine Conflict Gaza Air Strikes Bombings Land Operations: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య మొదలైన యుద్ధం బుధవారం నాటికి 222 రోజులకు చేరింది. ఈ ఏడున్నర నెలల మారణహోమాన్ని ఆపేందుకు ఈజిప్టు, ఖతార్ ప్రతినిధుల మధ్యవర్తిత్వంలో ఈజిప్టు రాజధాని కైరోలో ఇటీవల చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ.. హమాస్ సమ్మతి తెలపడంతో ఇక యుద్ధం ముగిసి, శాంతి నెలకొంటుందని అందరూ భావించారు. కానీ, అంతలోనే చర్చల నియమాలకు నీళ్లొదిలిన హమాస్, కీరమ్ షెలోమ్ సరిహద్దు క్రాసింగ్‌పై క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు బలికావడం, తామే ఈ దాడి చేశామని హమాస్ ప్రకటించుకోవటంతో ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ‘ ఇక.. ఏ దేశం అండగా నిలిచినా, నిలవకున్నా..ఏ అంతర్జాతీయ సంస్థ మమ్మల్ని వెలివేసినా మా దేశాన్ని మేమే రక్షించుకోకుండా ఎవరూ ఆపలేరు’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ భీకర ప్రకటన చేశారు. దానికి కొనసాగింపుగా, గాజాకు ఆహారం, ఇతర మానవతా సాయం అందించే ఏకైక మార్గాన్ని మూసివేయాలని ఆయన ఆదేశించారు. మంగళవారం తెల్లవారుజాము సమయానికి ఇజ్రాయెల్ వాయుసేన భీకర దాడికి దిగి, రఫా-ఈజిప్డు సరిహద్దుకు ఆనుకుని ఉన్న పాలస్తీనా వైపు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. మరోవైపు, మంగళవారం నాటికి ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో మృతిచెందిన వారి సంఖ్య 34,736కి చేరిందని, మరో 78 వేల మంది గాయాల పాలయ్యారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తమ దేశంపై జరిగిన దాడికి తాము దీటుగా స్పందించామని, బాధిత దేశంగా ఉన్నప్పటికీ తాము ఖతార్, ఈజిప్ట్ దేశాల మధ్యవర్తిత్వాన్ని హుందాగా తాము అంగీకరించి చర్చలకు సిద్ధపడ్డామని, కానీ, హమాస్ మాటతప్పి తమమీద తాజాగా దాడిచేయటంతో చర్చల మీద తమకున్న ఆశలు ఆవిరయ్యాయని నెతన్యాహూ ప్రకటించారు. ఇంకా శాంతి, సంయమనం అంటూ గాజా నుంచి తాము వెనక్కి వస్తే, హమాస్ దళాలకు తిరిగి పుంజుకునేందుకు తగిన సమయం దొరుకుతుందని, దీంతో వారుఅనతి కాలంలో మళ్లీ సాయుధ, మిలిటరీ సంపత్తిని పెంపొందించుకుని, తమపై దాడికి దిగుతారనేది నెతన్యాహూ వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే రఫాపై దాడికి ఇజ్రాయెల్ మంత్రివర్గం ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో.. ఇజ్రాయెల్ సేనలు రఫా దిశగా సాగిపోతున్నాయి. ఇప్పటికే గాజాస్ట్రిప్ వైపున ఉన్న రఫా సరిహద్దులను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ సేనలు, హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులకు రెడీ కావటంతో రఫాలో తలదాచుకుంటున్న లక్షల మంది శరణార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇజ్రాయెల్ సేనలు వారిని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తూ, భీకర దాడికి సిద్ధం కావటం యావత్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. శాంతి చర్చల కోసం నెలల తరబడి జరిగిన ప్రయత్నాలన్నీ తాజా పరిణామాలతో వృధాగా మారాయి.
Also Read: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం..!
మరోవైపు రఫాపై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధం కావటంతో ఐక్యరాజ్య సమితి తలపట్టుకుంటోంది. యుద్ధం కారణంగా శరణార్ధులుగా మారిన వారికోసం ఐక్యరాజ్యసమితి సేకరిస్తున్న ఆహారం, ఔషధాలు వంటవన్నీ రఫాలోని గోదామల్లో నిల్వ చేశారు. మరోవైపు దాడుల మూలంగా గాయపడిన వేలాది మంది క్షతగాత్రులు రఫాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ రఫా మీద దాడికి దిగితే, ఈ గోదాములు, ఆసుపత్రులన్నీ నామరూపాలు లేకుండా పోతాయని, ఇంతకన్నా ప్రాణనష్టం లక్షలకు చేరకమానదని ఐక్యరాజ్యసమితి నెత్తీనోరూ కొట్టుకుంటోంది. ఈ వాదనను పూర్వపక్షం చేస్తూ, తాము పౌర నివాసాలు, శరణార్ధుల శిబిరాల జోలికి పోమని, తమ లక్ష్యం అక్కడి హమాస్ తీవ్రవాదులు, వారి స్థావరాలేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, గాజా నగరాన్ని నేలమట్టం చేసిన ఇజ్రాయెల్, రాబోయే రోజుల్లో రఫా నగరాన్నీ సర్వనాశనం చేయకుండా ఊరుకోదని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.
అధికారిక లెక్కల ప్రకారం గాజా నగరంలో సుమారు 20 లక్షల మంది పాలస్తీనియన్లు ఉండగా, ఇప్పటి వరకు వారిని ఇజ్రాయిల్ మిలిటరీ వేరే ప్రాంతాలకు తరలిస్తూ వచ్చింది. ఈ క్రమంలో వీరిలో చాలామంది 64 చ.కి.మీ విస్తీర్ణం గల రఫా నగరం, దాని శివారు ప్రాంతాల్లోని శరణార్ధి శిబిరాల్లో ఉన్నారు. ఇజ్రాయిల్ దాడులకు ముందు రఫా జనాభా 2.5 లక్షలు కాగా, తరలివచ్చిన శరణార్థులతో కలిపి ఇప్పుడు అక్కడ 12 లక్షల మంది ఉన్నారు. వారిలో సగం మంది బాలలేనని, ఇజ్రాయెల్ దూకుడుగా వ్యవహరిస్తే, అమాయకులైన బాలలు లక్షల్లో మరణిస్తారని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చర్చలకు హమాస్ దిగిరావటానికి ఇదీ ఒక ప్రధాన కారణంగా ఉంది. మరోవైపు హమాస్ సాయుధులు జనంలో కలసిపోవటంతో వారిని పట్టుకోవటం ఇజ్రాయెల్‌కు తలకు మించిన భారంగా మారుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కైరోలో నిలిచిపోయిన శాంతి చర్చల పునరుద్ధరణకు చర్చల మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌తో చర్చించేందుకు అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ డైరెక్టర్ బిల్ బర్సన్ బయలుదేరినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాను సైతం చర్చలకు సిద్ధమేనని హమాస్ కూడా అంగీకరించిందని, ఈ మేరకు ఖతార్, ఈజిప్ట్ దేశాల మధ్యవర్తులకు హమాస్ సందేశాన్ని కూడా పంపినట్లుగా కూడా తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైతం చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినా, దాడులు ఆపబోమని తెగేసి చెప్పటమే గాక రఫా నగరం నుంచి పాలస్తీనియన్లు తక్షణం వెళ్లిపోవాలని విమానాల ద్వారా సోమవారం రాత్రి కరపత్రాలను వదలిపెట్టటంతో ఈ చర్చలు ముందుకు సాగవనే భయాలు పెరిగిపోతున్నాయి.
Also Read: దారి చూపే దీపం, ఆత్మీయ నేస్తం, పుస్తకం…
ఈ క్రమంలో ఇజ్రాయెల్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండగా నిలిచిన అమెరికా పరిస్థితిలో కుడితిలో పడిన ఎలుకలా మారింది. ఇజ్రాయెల్ కనుక రఫా నగరంలో మారణహోమం సృష్టిస్తే, ఇజ్రాయెల్ మిత్రుడిగా తానూ నిందమోయాల్సి వస్తుందనే భయం ఆ దేశ పాలకుల్లో పెరుగుతోంది. అందుకే తరచూ ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ, కొన్ని ఆంక్షలు విధిస్తూ నెతన్యాహూ దూకుడును నియంత్రించేందుకు వైట్‌హౌస్ పెద్దలు నానా తిప్పలు పడుతున్నారు. గాజాలో మారణకాండను ఖండిస్తూ అమెరికా విద్యార్థులు యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున నిరసనలకు దిగటం, ఈ నిరసనలు నానాటికీ తీవ్రతరం కావటంతో వచ్చే అధ్యక్ష ఎన్నికలలో తమ ఓటమి ఖాయమని డెమోక్రాట్లు భయపడుతున్నారు. పాలస్తీనా పౌరులకు సంఘీభావం తెలుపుతున్న విద్యార్థులంతా యూదు వ్యతిరేకులంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్య, కొలంబియా వర్సిటీలో జరిగిన విద్యార్థుల మీద కాల్పులు.. డెమెక్రాట్లకు తలనొప్పిగా మారాయి. మరోలా చెప్పాలంటే, యుద్ధాన్ని ఆపితే నెతన్యాహు, ఆపలేకపోతే జో బైడెన్ రాజకీయంగా పతనం కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానంతో సహా పలు దేశాల అభ్యర్థనలు, హెచ్చరిలేవీ ఈ పరిస్థితిలో రవ్వంత మార్పును తీసుకురాలేకపోవటం దురదృష్టకరం.
అయితే, ఇప్పుడు రాజీపడితే తమ దేశం ఉనికే.. ప్రమాదంలో పడుతుందని, రాజకీయంగానూ ప్రతికూల పరిస్థితి ఎదురవుతుంని భావిస్తు్న్న నెతన్యాహూ ఎవరి మాటలనూ లక్ష్యపెట్టకుండా మున్ముందుకే సాగిపోతున్నారు. అటు ఆ దేశ పౌరులు సైతం తమ ప్రధాని నెతన్యాహూ నిర్ణయాలను సమర్థిస్తూనే, ఏదో ఒక మార్గంలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను వీలున్నంత త్వరగా విడిపించుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హమాస్ సైతం దుందుడుకు ప్రకటనలు చేస్తూ పరిస్థితిని దిగజార్చుతూనే ఉంది. వీరిద్దరి కారణంగా గాజా, రఫా నగరాల్లోని అమాయక పౌరులు అల్లాడిపోతున్నారు. గాయపడ్డ వారికి ఆసుపత్రుల్లో చికిత్సకు అవసరమైన మందులు లేని దుస్థితి. ప్రతి నలుగురు పాలస్తీనియన్లలో ఒకరు ఆకలితోనే మరణిస్తుండటం, నివాస భవనాల్లో కరెంటు, నీటి సరఫరా లేకపోవటం అక్కడ దిగజారుతున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకనైనా, ఇరుపక్షాలూ వివేకంతో ఆలోచించి, యుద్ధానికి స్వస్తి పలికి, చర్చలకు సిద్ధంకావాలని, ఈ మారణహోమం మరో ప్రపంచయుద్ధంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి దేశం మీదా ఉందని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేస్తోంది.
-గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్)