- బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య
- 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు
- పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం
- బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు
- మూతపడిన పాఠశాలలను తెరిపిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
- సీఎం ఆదేశాలను పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
- జీరో ఎన్ రోల్ మెంట్ పాఠశాలలకు కేటాయించని ఉపాధ్యాయులు
- ఈ విద్యా సంవత్సరానికి ఇంతేనా
Any teacher not alloted to Zero enrollment schools in Telangana
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో విద్యావ్యవస్థ తీవ్ర అవస్థలపాలయింది. తెలంగాణ వస్తే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని ప్రసంగాలతో ఊదరకొట్టిన నాటి బీఆర్ ఎస్ నాయకులు బాల్యం నిర్వీర్యం అయిపోతుంటే చోద్యం చూశారే తప్ప రాష్ట్ర విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టామని గోడలకు రంగులు వేసి కరపత్రాలు ముద్రించుకుని మురిపోయారు నాటి బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో 28 వేల పైచిలుకు పాఠశాలలు ఉండగా అందులో ఇప్పటికీ సగానికిపైగా పాఠశాలలు మూసి వేయబడ్డాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తక్షణ చర్యలు తీసుకోకపోతే కొత్తగా మరికొన్ని మూతబడే ప్రమాదం ఉంది. మూతబడిన ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ తిరిగి తెరిపించాలని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను విద్యాశాఖ అధికారులు బేఖాతరు చేస్తున్నారు.
ఇకనైనా దృష్టిపెడతారా?
విద్యార్థులు లేక మూతబడిన పాఠశాలలను తెరిపిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ నీటి మూటగానే మిగిలింది. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న వాటికి కేటాయించనేలేదు. విద్యార్థులున్న పాఠశాలలకే ఉపాధ్యాయులను కేటాయిస్తూ వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పది మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలకు ఒకరు, 11 నుంచి 40 మంది వరకు ఉన్న పాఠశాలలకు ఇద్దరు, 41 నుంచి 60 మంది ఉన్న పాఠశాలలకు ముగ్గురు, 61, ఆపైన విద్యార్థులున్న పాఠశాలలకు మంజూరైన అన్ని పోస్టులను భర్తీ చేసేలా వెబ్ ఆప్షన్లను కేటాయించింది. తాజా ప్రకటనతో ముఖ్యమంత్రి హామీ ఇప్పట్లో అమలయ్యేలా లేదని తేలింది.రాష్ట్రంలో మూతపడిన ప్రభుత్వ బడులను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ బడులను తెరిపించేందుకు ఉపాధ్యాయులను కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో విద్యార్థులు లేక (జీరో ఎన్‌రోల్‌మెంట్) మూతపడిన 1,739 ప్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెరుచుకుంటాయని ప్రజలు ఆశించారు. కానీ, ఆ పాఠశాలలకు తాజాగా ఒక్క ఉపాధ్యాయుడినీ ప్రభుత్వం కేటాయించలేదు.
రంగారెడ్డి పరిధిలో
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలో ఖాజాగూడ, మంచర్లగూడ పాఠశాలలు మూతబడి దశాబ్ద కాలం గడుస్తున్నది. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు చేసేదేమీ లేక తమ పిల్లలను అప్పో సప్పో చేసి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూతబడిన అన్ని పాఠశాలలను తిరిగి తెరిపించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పటికే శంకర్పల్లి మండలంలో మూతబడిన లక్ష్మారెడ్డి గూడ ప్రాథమిక పాఠశాల, లచ్చిరెడ్డి గూడ, కచ్చిరెడ్డి గూడ గ్రామాల్లో విద్యాశాఖ అధికారులు పాఠశాలలను తెరిపించారు. కాగా, పాఠశాలలు తెరిచి 15 రోజులు గడుస్తున్నా మండలంలో ఇంకా ఖాజాగూడ, మంచర్లగూడ పాఠశాలలు తెరుచుకోలేదు. ఖాజా గూడ గ్రామస్తులు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల తెరుచుకోకపోవడంతో తమ పిల్లలను సమీపంలోని ఎలవర్తి గ్రామానికి పంపించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో మూతబడిన పాఠశాలలను తెరిపిస్తుండగా, తమ గ్రామంలో ఎందుకు తెరిపించడం లేదని ఖాజాగూడ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మూతబడిన ఖాజాగూడ, మంచర్లగూడ పాఠశాలలు తెరిపించే విషయమై సంప్రదించేందుకు శంకర్పల్లి ఇన్చార్జి ఎంఈవో సయ్యద్ అక్బర్‌కు ఫోన్ చేస్తే.. ఆయన స్పందించకపోవడం గమనార్హం.