GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని, వచ్చామా.. పోయామా.. అన్నట్టు పని చేస్తే కుదరదని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఓ సమీక్షా సమావేశంలో తెగేసి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అందరూ ఫీల్డ్ విజిట్ చేసి వాస్తవ సమస్యలు తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట రాజధాని నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్ పై ఆమ్రపాలి కాట ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, మూసాపేట్, భరత్ నగర్‌లో రైతు బజార్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వీధుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. గార్బేజ్, వల్బరేబుల్ పాయింట్ తొలగింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక జోనల్ కమిషనర్‌లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, రవి కిరణ్‌లు ఖైరతాబాద్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్ జోనల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్ పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
బుధవారం కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పర్యటించారు. నారాయణగూడ క్రాస్ రోడ్ వద్ద శానిటేషన్ పై ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అక్కడ నిర్మించిన మార్కెట్ గదుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. శంకర్ మఠ్ వద్ద రాంకీ ఆర్ఎఫ్‌సీ వెహికిల్ డ్రైవర్‌తో ఆమె మాట్లాడి చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లపై చెత్త లేకుండా, డ్రైనేజీల దగ్గర ఎలాంటి వేస్ట్ అడ్డుపడకుండా తగిన విధంగా శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.