Alternative Energy Sources Are The Refuge: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానం కారణంగా మానవుని ఇంధన అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. అయితే, అవసరాలే ప్రాతిపదికగా యథేచ్ఛగా ఇంధన వనరులను వాడటం వల్ల పర్యావరణ సమస్యలతో బాటు అనేక కొత్త సమస్యలూ పుట్టుకొస్తున్నాయి. ఇంధన అవసరాలు పెరిగే కొద్దీ భూమ్మీది పచ్చదనం హరించుకుపోయి, మానవుడి ఆరోగ్యం కోలుకోలేని రీతిలో దెబ్బతింటోంది. ఇక.. డిమాండుకు తగినంతా ఇంధన వనరులు అందుబాటులో లేని భారత్ వంటి అనేక దేశాలు ముడిచమురు, బొగ్గు కోసం విదేశాలపై ఆధారపడవలసి రావటం, తత్ఫలితంగా ఏటా పెద్దమొత్తంలో విదేశ మారక ద్రవ్యాన్ని కోల్పోవాల్సి రావటంతో ఇతర రంగాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. అందుకే అందుకే ప్రపంచవ్యా్ప్తంగా ప్రత్యామ్నాయ, ఆధునిక ఇంధన వనరుల అన్వేషణ, పరిశోధనలు సాగుుతున్నాయి. వైశాల్యంలో చిన్నదైన స్పెయిన్ ఇప్పటికే దేశంలోని 99 ఘన వ్యర్థాలను కరెంటు ఉత్పత్తికి వాడుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది.
ఇక మన దేశం విషయానికొస్తే, 144 కోట్ల జనాభాకు తగిన ఇంధన వనరులు దేశంలో అందుబాటులో లేవు. ప్రగతి సాధనలో కీలకంగా మారిన విద్యుత్ తయారీకి నేటికీ దేశం బొగ్గు మీదనే అధికంగా ఆధారపడుతోంది. అయితే, 100 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే సుమారు 50 నుంచి 60 కిలోల బొగ్గును మండించాల్సి వస్తోంది. ఒక్క 2023లోనే మనదేశం 748 మిలియన్ టన్నుల బొగ్గును వినియోగించింది. ఇది.. ఉత్తర అమెరికా, యూరోప్ దేశాల మొత్తం వినియోగం కంటే ఎక్కువ. 2023లో వాడిన మొత్తం బొగ్గులో 447 మిలియన్ టన్నుల బొగ్గును కేవలం దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలే వాడాయి. బొగ్గు లభ్యత తక్కువగా ఉండటంతో పెరుగుతున్న డిమాండ్ కారణంగా దేశంలో బొగ్గు ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తోంది. పాలనా పరమైన సవాళ్లు, పారదర్శకత లోపించడం, ధరల విధానం లోపభూయిష్టంగా ఉండటం, రవాణా, అవస్థాపనా సౌకర్యాల కొరత, విద్యుత్ రంగంలో సంస్కరణలు లేకపోవడం వంటివి తోడు కావటంతో బొగ్గు రంగం సమస్యల ఊబిలో ఇరుక్కుపోయింది. దీనికి తోడు పెరుగుతున్న కాలుష్యం అదనపు తలనొప్పిగా మారుతోంది.
ఈ పరిస్థితులను ఊహించి 2010లో నాటి యూపీయే ప్రభుత్వం జాతీయ సోలార్ మిషన్‌ను రూపొందించింది. 2022 కల్లా లక్షా 75 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెద్దయెత్తున సౌరవిద్యుత్ పార్కులు స్థాపించాలని, భూమి కొరత ఉన్న చోట్ల పంట కాలువలు, గట్లపై ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 10 వేల మెగావాట్ల కేంద్రాలను నెలకొల్పాలని నిర్దేశించారు. డీజిల్, సంప్రదాయ విద్యుత్తుతో నడుస్తున్న 27లక్షల వ్యవసాయ పంపుసెట్లను, సౌర విద్యుత్తులోకి మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. భవనాల కప్పులపై నాలుగు వేల మెగావాట్ల చిన్న కేంద్రాలను స్థాపించారు. రాష్ట్రాల మధ్య హరిత విద్యుత్తు సరఫరా, సౌర విద్యుత్ పలకల ధరలు తగ్గడం, భారతీయ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ద్వారా 75శాతం స్థాపిత పెట్టుబడిని తక్కువ వడ్డీకే అందజేయడం లాంటి విధానాలు సౌర విద్యుత్తు కేంద్రాల స్థాపనకు ఊతమిచ్చాయి. విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలు తప్పనిసరిగా కొంతమేర హరిత విద్యుత్తును వాడుకోవాలనే నిబంధన విధించడంతో, దేశంలోని అనేక సంస్థలు సౌర విద్యుత్‌వైపు మొగ్గు చూపాయి. ఒకప్పుడు సౌర విద్యుత్ యూనిట్ ధర పది రూపాయలకంటే ఎక్కువ. నేడది రూ.2.50కే లభించడం ఈ రంగంలో సాధించిన ఘన విజయానికి తార్కాణం. ఏటా దేశంలో తయారయ్యే మొత్తం కరెంటులో 17 శాతం పంట పొలాల్లోని 2.1 కోట్ల వ్యవసాయ మోటర్లకే వినియోగించబడుతోంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు పెద్దసంఖ్యలో ఏర్పాటు చేయగలిగితే, అది అటు రైతులకు, ఇటు ప్రభుత్వాలకూ పెద్ద ఊరటగా మారుతుంది.
Also Read: పీఎం ప్రణామ్ ప్రయోగం ఫలించేనా..?
అలాగే, పవన విద్యుత్ మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) తాజా నివేదిక ప్రకారం… 2021లో ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ కొత్తగా 93.6 గిగావాట్లు వృద్ధిని నమోదు చేసింది. దీంతో మొత్తం పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకు చేరింది. మన దేశంలో మొత్తం విద్యుత్ డిమాండ్ సగటు వృద్ధి రేటు 6 %గా ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 40 గిగావాట్ల ఆన్‌షోర్ విండ్ కెపాసిటీ ఉన్నప్పటికీ, గాలి విస్తరణ వేగం మందగించడంతో ఉత్పత్తి ఆశించినంతగా ఉండటం లేదు. దేశానికి సుమారు 7,600 కిలోమీటర్ల సముద్రతీరం ఉండటంవల్ల సముద్ర తీరాలు, సముద్రంలోపల కూడా పవన విద్యుత్ ఉత్పత్తికి భారీ అవకాశాలున్నాయి. పవన విద్యుత్ విషయంలో మనదేశంలోని తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందున్నాయి. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోనే 70 వేల మెగావాట్లకు పైబడి విద్యుదుత్పత్తి చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 2030 నాటికి 30 వేల మెగావాట్లు సముద్ర తీర పవన విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోంది. ఇవిగాక, వ్యవసాయ పంటలో మిగిలిన అవశేషాలు, ధాన్యాల పొట్టు, ఎండిపోయిన చెట్ల కలపను మండించటం ద్వారా విద్యుదుత్పత్తి చేసే విధానంలో 18 వేల మెగావాట్ల బయోమాస్ ప్లాంట్లకు అవకాశం ఉంది. చెరుకు పరిశ్రమలలో వెలువడే కుళ్లిన ద్రవాల ద్వారా మరో 8000 మెగావాట్ల బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటుచేయవచ్చు. నగరాలు, పరిశ్రమల నుంచి వెలువడే చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తికి 2,554 మెగావాట్లకు అవకాశం ఉండగా, జంతువుల పేడ, ఇంటి నుంచి వెలువడే ఆహార వ్యర్థాలతోనూ విద్యుత్ తయారీకి ఎంతో అవకాశం ఉంది. 2030 నాటికి విద్యుత్తు ఉత్పత్తిలో 50% పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకోవాలని మనదేశం నిర్ణయించటమే గాక 2070 నాటికి ఉద్గార రహిత దేశంగా చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
పవన, సౌర విద్యుత్తు నిరంతరం కరెంటును అందించలేవు గనుక అణు విద్యుత్తు వినియోగం మీదా ప్రపంచం దృష్టిసారిస్తోంది. అమెరికా తన విద్యుత్తు అవసరాలలో 18 శాతం అణుశక్తి ద్వారానే తీర్చుకుంటోంది. అమెరికా, పలు ఐరోపా దేశాలు ఇప్పటికే అణు విద్యుత్తు వైపు అడుగులు వేయగా, భారత్ సైతం ఈ దిశగా అడుగులు వేస్తోంది. మనదేశంలోని మొత్తం ఏడు న్యూక్లియర్ ప్లాంట్లలో 22 రియాక్టర్లుండగా, ఇవి ఏటా 6,780 మెగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. 2031 నాటికి దీనిని 22,480 మెగావాట్లకు పెంచాలని కేంద్రం నిర్ణయించుకుంది గానీ, నిధుల కొరత సమస్యగా మారుతోంది. అణు ధార్మిక పదార్థాలు లీక్ కాకుండా ఆధునిక భద్రతా ఏర్పాట్లు చేసే టెక్నాలజీ కూడా అందుబాటులో ఉండటం, అణు విద్యుత్తు లేకుండా కర్బన ఉద్గారాలను తగ్గించటం సాధ్యం కానుందున దీనిని వాడుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలతో కాలుష్యం పెరుగుతున్నందున విద్యుత్ లేదా హైడ్రోజన్ వాహనాలు దేశంలో పెరగాల్సి ఉంది. కానీ, విద్యుత్ వాహనాల ధరలు ఎక్కువగా ఉండటం, కొత్త విద్యుత్ వాహనాలకు తగినన్ని విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం, ఒకసారి ఛార్జింగ్‌తో ఎక్కువ దూరం ప్రయాణం చేయలేకపోవడం, ఛార్జింగ్‌కు అధిక సమయం తీసుకోవడం ఇందుకు ప్రధాన సమస్యల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఈ తరహా వాహనాలకు సబ్సిడీలు పెంచితే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు. ఈ పరిష్కార మార్గాలు కనుగొన్నప్పుడే 2030 నాటికి 50 శాతం విద్యుత్ వాహనాలు నడపాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. అప్పుడే ఆ మేరకు ఇంధన భద్రత సాధించడంతో పాటు, వాతావరణ కాలుష్యాన్నీ కొంతవరకైనా నియంత్రించినట్లవుతుంది.
– సదాశివరావు ఇక్కుర్తి (సీనియర్ జర్నలిస్ట్)