CM Revanth Steps Forward To Impress Upon The Regime: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేపటికి నిండా ఏడు నెలలు పూర్తవుతాయి. ప్రభుత్వం ఏర్పడి, మంత్రులంతా బాధ్యతలు స్వీకరించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పాలన మీద దృష్టి సారించి శ్వేత పత్రాలు విడుదల చేసే సమయానికి లోక్‌సభ ఎన్నికల ప్రకటన రానే వచ్చింది. దీంతో సుమారు రెండు నెలల పాటు పాలనా పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయినా, సీఎం రోజువారీ పాలనా వ్యవహారాల్లో తగినంత చొరవ చూపుతూనే వచ్చారు. జూన్ 6న ఎన్నికల కోడ్ ఎత్తివేయటంతో నాటి నుంచే పూర్తిస్థాయి పాలన మీద ఆయన దృష్టి సారించారు. రాష్ట్రం ముందున్న ఆర్థికపరమైన, పాలనాపరమైన సవాళ్లను అధిగమిస్తూనే, పార్టీ పరంగా ఉన్న రాజకీయ పరమైన సవాళ్లనూ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. పాలనను పరుగెత్తించేందుకుగానూ, మంత్రివర్గ విస్తరణ మీదా పార్టీ పెద్దలతో చర్చించి, ఇప్పటికే ఒక అభిప్రాయానికి సీఎం వచ్చినట్లు కనిపిస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణతో బాటు మంత్రులు శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉండొచ్చనే వార్తలూ వినిపిస్తున్నాయి. మొత్తంగా రాబోయే నాలుగున్నరేళ్ల పాలన కోసం తనదైన టీమ్‌తో పాలనను మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ముఖ్యమంత్రి రెడీ అవుతున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రగతిభవన్ కంచెలను తొలగించి, ఆ భవనాన్ని ప్రజాభవన్‌గా మార్చి మంగళ, శుక్రవారాల్లో ప్రజలు నేరుగా తమ సమస్యలు చెప్పుకునే వెసులు బాటు కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా అందుకున్న అర్జీలను నేరుగా సంబంధిత అధికారులకు పంపి ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా చూడటం ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించటంలో ముఖ్యమంత్రి సఫలీకృతులయ్యారు. మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీగా అందించటం, ఆరోగ్యశ్రీ పథకపు పరిధి విస్తరణ, ఉద్యమకాలం నాటి కేసుల ఎత్తివేత, నియామక పత్రాలకోసం ఎదురుచూస్తున్న వేలాది మందికి నేరుగా అప్పాయింట్ మెంట్ లెటర్స్ అందిచటం, సచివాలయానికి వచ్చి శాఖల వారీగా రివ్యూలు నిర్వహించి, అధికారులకు శాఖాపరంగా స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించటం, రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు వంటి నిర్ణయాలన్నీ చూస్తుండగానే జరిగిపోయాయి. తాజాగా గత అసెంబ్లీ ఎన్నికల వేళ రైతాంగానికి ఇచ్చిన రూ. 2 లక్షల రుణహామీని నెరవేర్చేందుకు గానూ ఆగస్టు 15లోపు రూ. 31 వేల కోట్ల నిధులను సమకూర్చుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఖరీఫ్ సీజన్‌లో రైతుల పెట్టుబడి కోసం మరో రూ. 23 వేల కోట్ల రైతు భరోసాను అందించేందుకు నిధుల సేకరణ కోసం సీఎం బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ రైతూ నష్టపోరాదనే సంకల్పంతో రైతు బీమా పథకం కోసం రైతుల వాటాగా చెల్లించాల్సిన మొత్తాన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. తెలంగాణ తరహాలో తమకూ రుణమాఫీ చేయాలని నేడు.. మహారాష్ట్ర, పంజాబ్ రైతులు అక్కడి ప్రభుత్వాల మీద ఇటీవల కాలంలో ఒత్తిడి పెంచటం విశేషం.
Also Read: ప్రత్యామ్నాయ ఇంధన వనరులే శరణ్యం
సచివాలయంలో కింది స్థాయి ఉద్యోగి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ బయోమెట్రిక్ సిస్టమ్ వాడాలనే నిర్ణయం తీసుకుని విధి నిర్వహణలో సమయపాలన, జవాబుదారీతనం పెంచే ప్రయత్నం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల మంజూరు, 18 వేలకు పైగా టీచర్లకు బదిలీలతో బాటు ప్రమోషన్లు ఇచ్చి, సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు చెక్ పెట్టారు. నిరుద్యోగుల కలను నిజం చేస్తూ.. గతంలో పేపర్ లీకేజీ కారణంగా ఆగిపోయిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు సర్వీసులకు అదనపు పోస్టులను కలిపి వివాదాలకు తావు లేకుండా పరీక్షను నిర్వహించటం, ఉపాధ్యాయ నియామకాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, తమ ప్రభుత్వ లక్ష్యాలను సవివరంగా ప్రజలముందు పెట్టగలిగారు. కాళేశ్వరం, విద్యుత్ రంగంలోని సమస్యల మీద న్యాయ విచారణకై కమిషన్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలిసేందుకు పారదర్శకమైన మార్గాన్ని ఏర్పరచారు. సమస్యల వలయంలో ఉన్న యూనివర్సిటీలకు తాత్కాలిక వీసీలుగా సమర్థులైన అధికారులను నియమించి, అక్కడి పాలనను కట్టడి చేయటమే గాక పూర్తికాలపు వీసీల నియామకానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖకు పూర్తి హక్కులిచ్చి ప్రజలను పీడిస్తున్న వారి భరతం పట్టే పనికి పూనుకున్నారు. ఇన్ని నిర్ణయాలను కేవలం నాలుగు నెలల్లో సాధించటమే గాక పాత ముఖ్యమంత్రికి భిన్నంగా ప్రజల మధ్య తిరుగుతూ, వారి గోసను ఆలకిస్తూ పాలన సాగిస్తున్నారు.
ఇక.. క్షేత్రస్థాయిలో పాలన, అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయో తెలుసుకోవటంతో బాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు తగిన సూచనలు చేసేందుకు తాజాగా సీఎం జిల్లాల పర్యటనలనూ చేపడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ తలపెట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంతో పోటీపడి వరంగల్ కూడా అభివృద్ధి సాధించాలంటే విజన్ డాక్యుమెంట్ 2050 పేరుతో ఒక స్పష్టమైన కార్యాచరణ ఉండాలని అధికారులకు సూచించారు. అక్కడి మెగా టెక్స్‌టైల్ పార్క్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కలియదిరిగి అక్కడి వివరాలను ఆరా తీశారు. ఆసుపత్రి నిర్మాణ వ్యయం పెంపు మీద వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించటం ద్వారా ప్రతిదీ తాను గమనిస్తున్నాననే సందేశాన్ని క్షేత్రస్థాయి పాలనా యంత్రాంగానికి పంపారు. హన్మకొండలో డ్వాక్రా మహిళలు ప్రారంభించిన మహిళా శక్తి కేంటీన్లను ప్రారంభించి, వారిని ప్రశంసించారు. అయితే, తక్కువ సమయం కారణంగా అక్కడ నేరుగా ప్రజలతో ముచ్చటించలేకపోయారు. ఇకపై సీఎం చేయనున్న జిల్లాల పర్యటనల్లోనైనా.. పౌరుల నుంచి నేరుగా వినతులు స్వీకరించే ఏర్పాటు చేయగలిగితే మరింత బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేంద్రంతో సత్సంబంధాలు ఏర్పరుచుకోలేకపోవటంతో తెలంగాణ నిధులపరంగా, అభివృద్ధి పథకాల పరంగా చాలా నష్టపోయింది. కానీ, రేవంత్ రెడ్డి కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపుతూ తెలంగాణకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్ హైవే విస్తరణకు అవసరమైన సైనిక భూములను దక్కించుకోవటం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని సివిల్ ఏరియాలు గ్రేటర్ పరిధిలోకి తీసుకురావటానికి, స్మార్ట్ సిటీ మిషన్ వ్యవధిని మరింత పెంచటానికి, విభజన చట్టంలోని అంశాలను సత్వరం పరిష్కరించుకునేందుకు, పెండింగ్ నిధుల విడుదలకు ఢిల్లీ స్థాయిలో ముఖ్యమంత్రి చూపిన లౌక్యం, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి కారణమంటే అతిశయోక్తి కాదు.ఇదే గాక, పాలమూరు – రంగారెడ్డి లాంటి ప్రాజెక్టుకి కేంద్రం నుండి నిధులు రాబట్టటానికి, కెఆర్ఎంబి లాంటి సమస్యల పరిష్కారానికి, కేంద్ర విద్యాసంస్థలను సాధనకు తరచూ కేంద్రమంత్రులను కలుస్తూ వారిని ఒప్పించేందుకు ముఖ్యమంత్రి చూపుతున్న చొరవ సదా అభినందనీయం. సమర్థ పాలన కోసం అటు ప్రభుత్వ పరంగా మంత్రుల టీమ్‌ను, ఇటు శాఖల వారీగా మంచి అధికారులను ఎంచుకోవటం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయటం ముదావహం. సమస్యలకు భయపడక, ఆశావహ దృక్పథంతో, ధైర్యంగా ముందుకు సాగే ముఖ్యమంత్రికి సమర్ధవంతమైన పాలనా యంత్రాంగం తోడైతే, మన తెలంగాణ అతి తక్కువ సమయంలోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించగలుగుతుందనటంలో అనుమానమేమీ లేదు.
-డాక్టర్ తిరునాహరి శేషు (పొలిటికల్ ఎనలిస్ట్) కాకతీయ విశ్వవిద్యాలయం