Fight Against Plastic, todays Need:పర్యావరణాన్ని కోలుకోని రీతిలో దెబ్బతీస్తున్న ప్రమాదకరమైన అంశాల్లో ప్లాస్టిక్ వినియోగం ఒకటి. గతంలో పట్టణాలకే పరిమితమైన ప్లాస్టిక్ వినియోగం నేడు పల్లెలకూ పాకింది. టీ షాపులు, పండ్ల దుకాణాలు, కిరాణా అంగళ్లలో ప్లాస్టిక్ సంచుల వాడకం బాగా పెరిగింది. ఇలా విచ్చలవిడిగా పెరుగుతున్న ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నివారించి, వాటికి తగిన ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలనే సంకల్పంతో ఏటా ఏటా జులై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే పేరిట జరుపుకుంటున్నాము. 2022లో ప్రపంచంలోనే తొలిసారి బంగ్లాదేశ్ ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించింది. ఆ తర్వాత మనదేశంతో బాటు అనేక దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాయి. మన తెలంగాణ ప్రభుత్వమూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను 2022లోనే నిషేధించింది. 75 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ను వినియోగిస్తే కఠినచర్యలు తీసుకునేలా జీవో ఇచ్చి.. రెండేళ్లవుతున్నా.. అది అమలులోకి రాలేదు. నేటికీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని దుకాణాల్లోనూ యధేచ్ఛగా ప్లాస్టిక్ సంచుల వినియోగం సాగుతూనే ఉంది. ప్లాస్టిక్‌లో బీపీఏ (బిస్ఫెనాల్) అనే రసాయనం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది పునరుత్పత్తి వ్యవస్థ పనితీరును కోలుకోలేని రీతిలో దెబ్బతీయటంతో బాటు కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకూ కారణమవుతుంది. ప్లాస్టిక్‌లో థాలేట్స్, ఇతర అనేక రసాయనాలు మనుషుల ప్రాణాలను హరిస్తున్నా.. ప్రజల్లో ఈ విషయంపై చైతన్యం అంతంతమాత్రంగానే ఉంది.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటానికి ఉద్యమాలేమీ అవసరం లేదు. మనవంతుగా దానిని వాడకపోతే సరి. జీరోవేస్ట్ ఒకరోజులోనే సాధ్యంకాదు గనుక ఇంపర్ఫెక్ట్ జీరో వేస్ట్ (కొంతైనా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలి) అనే పద్ధతిని ప్రయత్నించొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం వారు Refuse – Reduce – Repurpose- Recycle – Rot అనే ఫార్ములాను సూచిస్తున్నారు. ఇందులో తొలి అంశం..తిరస్కరించటం (Refuse). బజారులో 4 రకాల కూరగాయలు కొంటే.. 4 ప్లాస్టిక్ సంచులు ఇంటికి చేరుతున్నాయి. ఇవిగాక.. కూల్‌డ్రింక్ సీసాలు, స్ట్రాలు, టిఫిన్ పార్సిల్‌లో ప్లాస్టిక్ స్పూన్, చివరికి గుడిలో ప్రసాదానికీ ప్లాస్టిక్ ప్లేట్లు. అందుకే గుడ్డ సంచీలు వాడటం, ఇంటిలో అటకెక్కించిన స్టీలు, గాజు, రాగి, మట్టి పాత్రలు, గ్లాసులు తీసి వాడుకోవాలని, భోజనానికి ఆకుల విస్తర్లు వాడుకోవాలని నిపుణుులు సూచిస్తున్నారు. దీనినే ‘సస్టెయినబుల్ లివింగ్’ (పర్యావరణ హితమైన జీవన విధానం) అంటున్నాం. షాపుల వాళ్లు.. క్యారీబ్యాగ్స్, డిస్పోజబుల్ గ్లాసులు ఇచ్చినా.. వద్దని తిరస్కరించాలి. బయటికి వెళ్లేటప్పుడు గుడ్డసంచీ పట్టుకుపోతే.. 10 క్యారీ బ్యాగ్స్ వాడకం ఆగిపోయినట్లే. ఇక.. రెండవ అంశ.. తగ్గించటం (Reduce). ఈ విధానంలో వనరుల దుర్వినియోగాన్ని తగ్గించటం ప్రధాన అంశం. అంటే.. ప్రతి పనికీ వాహనం వాడకపోవటం, ఆఫీసులో అత్యంత అవసరం ఉంటేనే ప్రింటవుట్ తీయటం, వీలుంటే ఆ ప్రింటవుట్ రెండోవైపు వాడుకోవటం, ఇంటిలో ఎల్‌ఈడీ దీపాలు వాడుకోవటం, వాష్‌రూమ్‌లో షవర్ల బదులు కుళాయిలు వాడటం, ప్లాస్టిక్ బదులు గాజు సీసాలు వాడుకోవటం, అనవసరంగా విద్యుత్ దీపాలు, ఏసీలు వాడకపోవటం వంటివి. ప్రతి వనరును మితంగా వాడుకోవటం వల్ల పర్యావరణం మీద ఒత్తిడి తగ్గుతుందనేది ఇందులో లాజిక్. మూడవ అంశం పునర్వినియోగం. ఆలోచించాలే గానీ పాత బట్టలు, బొమ్మలు, ఫర్నిచర్ వంటివాటిని రీయూజ్‌కు వాడుకోవచ్చు. ఇక.. బొత్తిగా పనికి రాదనుకున్నప్పుడు మాత్రమే వాటిని వదిలించుకోవాలి. నాల్గవ అంశం.. మరోలా మార్చటం ((Recycle). ఇంట్లో అవసరం లేని వాటిని మరో రూపానికి మార్చి వాడుకోవటం. ఈ విషయంలో మనదేశంలో ఇంకా తగినన్ని సదుపాయాలు లేవనే చెప్పాలి. చివరి అంశం.. నిర్మూలించటం (Rot). పాతరోజుల్లో ఖాళీ స్థలాలలో పెద్ద గొయ్యి తీసి అందులో అట్టముక్కలు, ఎండుటాకులు, టీపొడి, కోడిగుడ్డు పెంకులు, రంపపు పొట్టు, పండ్లు, కూరగాయలు వంటివన్నీ వేసేవారు. ఏడాదికి అదంతా సేంద్రియ ఎరువుగా మారేవి. కనుక ఇలాంటి ప్రయత్నాలూ అవసరమే.
Also Read: పాలనపై ముద్రకు రేవంత్ ముందడుగు
ప్లాస్టిక్‌ను మరో రూపంలో మార్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ నివాసి ఆదిత్య బంగేర్ పదో తరగతిలో ఉండగానే ప్లాస్టిక్ నుంచి బట్టలు చేయాలని అనుకుని, రెండేళ్లలో ఒక చిన్న సంస్థ పెట్టి.. రోజుకు 10 టన్నుల ప్లాస్టిక్‌ను దుస్తులుగా మారుస్తున్నాడు. ‘బాంబూ ప్రాజెక్ట్స్’ అనే సంస్థ పూర్తిగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో ఇళ్లను నిర్మిస్తున్నది. ఈమధ్యే ఓ వృద్ధురాలికి 10 రోజుల్లోనే రూ. 4.5 లక్షలతో ఇల్లు నిర్మించి ఇచ్చింది. ముంబైకి చెందిన మౌనిష నార్కే టెట్రా ప్యాకెట్లతో స్కూల్ బల్లలను రూపొందిస్తున్నది. ఇందుకోసం ఏడాదికి 750 టన్నుల వ్యర్థాలను ఉపయోగిస్తున్నది. మైసూరులోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబొరేటరీ 180 రోజుల్లోనే భూమిలో కలిసిపోయే సంచులు తయారుచేస్తోంది. కేవలం 2 రూపాయల ధర గల ఈ సంచి 5 కిలోల బరువు మోస్తుంది. థాయ్‌లాండ్‌లోని టఫెటా అనే దుస్తుల కర్మాగారం, ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి పీపీయీ కిట్లను తయారుచేస్తోంది. గుజరాత్‌కు చెందిన బినిష్ దేశాయ్.. వాడిన మాస్కులు, పీపీయీ కిట్లతో ఇటుకలు తయారుచేసి సరఫరా చేస్తున్నాడు. చెబుతూపోతే, ఇలాంటి విజయగాథలు ఎన్నో. కాస్త తపన ఉండాలే గానీ, మన చుట్టూ కూడా ఎన్నో అవకాశాలున్నాయి. నేషనల్ జాగ్రఫిక్ అంచనా ప్రకారం, భూమ్మీద ఇంకా 91 శాతం ప్లాస్టిక్ వృథాగా పడుంది. డంపింగ్ యార్డుల్లోను, సముద్రపు లోతుల్లోనూ పేరుకుపోయింది. దిగ్గజ సంస్థలకు వీటి జోలికి వెళ్లేంత సమయం, సహనం ఉండవు. కానీ స్టార్టప్స్ కనుక పూనుకుంటే,ఆ వ్యర్థాలతో సంపదను సృష్టిస్తూనే, సమస్యను పరిష్కరించవచ్చు.
ప్రభుత్వం కేవలం ప్లాస్టిక్ నివారణకు ఆదేశాలు జారీ చేసి ఊరుకోవటమే గాక దాని ప్రత్యామ్యాయాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, జూట్ బ్యాగ్స్ వాడొచ్చిన చెబుతున్నా.. వాటికి ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సహకాలు లభించటం లేదు. అయితే ప్రభుత్వం చొరవతీసుకుని ప్రభుత్వ కార్యాలయాలు, రైతుబజార్లు, దేవాలయాలు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో వీటిని వాడాలనే నియమం తెస్తే వీటి వినియోగం పెరగటమే గాక తయారీ దారులకు డిమాండ్ కూడా పెరుగుతుంది. మరోవైపు.. ప్రజలు కూడా వ్యర్థాల నియంత్రణలో రీథింక్ అనే సూత్రాన్ని పాటించాల్సి ఉంది. ఏదైనా వస్తువు కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. భవిష్యత్ తరాల కోసం సంపద పోగేయటమే కాదు.. వారికి మంచి ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యతా మనమీద ఉందని గుర్తిస్తే.. నేటి నుంచే మనం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోగలము.
– గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్)