– బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన
– ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి
– సింగరేణికి అండగా నిలవండి
– పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి
– పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి
– కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం
– కొత్త ఇళ్ల మంజూరు, రక్షణ భూముల బదిలీపై చర్చ
– రీజినల్ రింగ్ రోడ్డు విస్తరణపై వివరణ
– పెండింగ్ నిధులు ఇప్పించండి
– 12 అంశాలతో వినతి పత్రం
– హోం, కేంద్రమంత్రులతోనూ భేటీ
Delhi Tour: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం తగినంత ప్రోత్సాహం అందించాలని, ఈ విషయంలో కేంద్రం పెద్దమనసు చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి.. ఆయన ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రిని కలిసి తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, సింగరేణి బొగ్గు గనులు, విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతో పాటు మొత్తం 12 అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి వినతి పత్రాన్ని అందించారు. దేశంలో ప్రధాన ఎన్నికలు ముగిసినందున రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల పునరుద్ధరణ కోసం కలిసిరావాలని ఆయన ప్రధానిని కోరారు.
సింగరేణిపై చర్చ
ప్రధానితో చర్చ సందర్భంగా తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణి కాలరీస్ అభివృద్ధిలో భాగంగా సంస్థకు కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు చేయటం అత్యవసరమని ముఖ్యమంత్రి వివరించారు. సింగరేణి సంస్థలో కేంద్రానికి 49 శాతం, రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడున్న బొగ్గు గనుల్లోని నిల్వలు రాబోయే రోజుల్లో ఖాళీ కానున్న నేపథ్యంలో.. రాష్ట్రపు భవిష్యత్ విద్యుత్తు అవసరాల దృష్ట్యా ప్రస్తుతం కేంద్రం వేలం వేస్తున్న బొగ్గు గనుల జాబితాలో నుంచి సింగరేణి బెల్టులోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకుతో బాటు కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3లను వేలం జాబితా నుంచి తొలగించి సింగరేణికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
పెండింగ్ ప్రాజెక్టుల మోక్షానికి..
2010లో కేంద్రం హైదరాబాద్‌కు మంజూరు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్టు.. 2014లో ప్రభుత్వం మారిన కారణంగా ఆచరణకు నోచుకోలేదనీ, దీనిని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కోరారు. కొత్త ఐటీ కంపెనీలు, ఐటీ స్పేస్ డెవలపర్‌లను ప్రోత్సహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో ఇప్పటికే అవసరమైన భూమిని గుర్తించిందనీ, ఈ ప్రాజెక్టుకు ఆ భూమిని కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే, హైదరాబాదులో సెమీ కండక్టర్ ఫ్యాబ్స్‌ను స్థాపించడానికి అనేక కంపెనీలు ఆసక్తి కనబరిచాయనీ, కనుక ఇండియా సెమీ కండక్టర్ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు.
కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంపై దృష్టి
రాష్ట్ర విభన కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం హామీ ఇవ్వగా, అది నెరవేరలేదని, 2023 నాటి బడ్జెట్‌లో కోచ్ ఫ్యాక్టరీకి బదులు 2023 జులైలో పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటుకు రైల్వే శాఖ ప్రకటన చేసిందని గుర్తుచేశారు. దేశంలో అనేక ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరైనా, తెలంగాణకు దక్కలేదని దానిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై కేంద్రం నివేదికలు సిద్ధం చేసిందని, వాటిని పరిశీలించి ఫ్యాక్టరీ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ప్రతిపాదించారు. విభజన సందర్భంగా ఏపీలో కలిపిన 7 ఖమ్మం జిల్లా గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కూడా కోరారు.
కొత్త ఇళ్ల మంజూరు..
గత ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు రూపొందించుకోలేకపోవటం వల్ల ఈ పథకం కింద తెలంగాణకు తక్కువ ఇళ్ల కేటాయింపు జరిగిందనీ, కనుక.. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నిర్మించ తలపెట్టిన 3 కోట్ల గృహాలలో 25 లక్షల ఇండ్లను తెలంగాణకు మంజూరు చేయాలని కోరారు.
పెండింగ్ గ్రాంట్‌ల విడుదల
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది నిధి (BRGF) కింద కేంద్రం 2015 – 2019 మధ్యకాలంలో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున తెలంగాణకు రూ.2,250 కోట్లు కేటాయించింది. కానీ, 2019 నుంచి 2024 మధ్యకాలంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.1,800 కోట్లు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని కోరారు.
రక్షణ భూముల బదిలీ
హైదరాబాద్ నగరం నానాటికీ విస్తరిస్తోందని, కనుక ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ – కరీంనగర్, హైదరాబాద్ – నాగపూర్ హైవే కారిడార్ల నిర్మాణానికి పూనుకున్నామని, కనుక ఈ మార్గాల్లోని 2450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని.. ఇందుకు బదులుగా రావిర్యాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (RIC) కి లీజుకు ఇచ్చిన 2462 ఎకరాల భూములను పూర్తి హక్కులతో కేంద్రానికి బదిలీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.
రహదారుల అంశంపై
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా.. ఇప్పటికే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు ఉత్తరాన గల సంగారెడ్డి – చౌటుప్పల్ హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందనీ, దీని భూసేకరణకు అయ్యే ఖర్చులో సగం వాటాను భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉన్నందున, త్వరిత గతిని హైవే నిర్మాణ పనులు చేపట్టాని సీఎం కోరారు. అలాగే, తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.
విద్యాసంస్థల ఏర్పాటు
ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపనకు కేంద్రం నిర్ణయం తీసుకున్నందున, తెలంగాణకూ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో లేదా మరెక్కడైనా సరే.. దీనికి భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని, ఈ క్రమంలో రాష్ట్రానికి 24 నవోదయ స్కూళ్లు మంజూరుచేయాలని కోరారు.
హోం మంత్రితోనూ చర్చ..
తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధునీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సీఎం వినతి పత్రం అందించారు. గురువారం సుమారు గంటపాటు కొనసాగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి హోం మంత్రికి వివరించారు. డ్రగ్స్ మరియు సైబర్ నేరాల నియంత్రణతో పాటు అరికట్టడానికి కావల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, పరికరాల కొనుగోలు కోసం టీజీ న్యాబ్‌కు రూ.88 కోట్లు, టీజీ సీఎస్‌బీకి రూ.90 కోట్లు కేటాయించాలని కోరారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయడం తప్పనిసరని, 2016 నుంచి అది జరగలేదని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేటాయించిన 61 ఐపీఎస్ పోస్టులు.. పెరిగిన రాష్ట్ర అవసరాలకు సరిపోవటం లేదని, కనుక.. మరో అదనంగా మరో 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వామపక్ష తీవ్రవాదాన్ని తగ్గించేందుకు ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.