Democracy Can Be Preserved Only Through Media: నేటి పత్రికలన్నీ పెట్టుబడిదారుల విష పుత్రికలే నంటూ అపుడెప్పుడో దశాబ్దాల క్రితమే మహాకవి శ్రీశ్రీ అన్నారు. నేటి సమాజంలో మెజారిటీ పత్రికలకు అక్షరాలా ఇది వర్తిస్తుందనే విమర్శలున్నాయి. వాటికి అదనంగా ఎలక్ట్రానిక్ మీడియాను సైతం జతచేసి నేటి కాలంలో మెజారిటీ పత్రికలూ, ప్రసార సాధనాలు పెట్టుబడిదారుల విష పుత్రికలుగా వ్యవహరిస్తున్నాయనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. నిఖార్సయిన సమాచార సేకరణ ద్వారానే ప్రజా సమస్యలు ప్రభుత్వాల దృష్టిలో పడతాయి. అప్పుడే పరిష్కారానికి నోచుకునే వీలుంటుంది. జాతిపిత మహాత్మా గాంధీ అన్నట్లు పత్రికలూ, ప్రసార సాధనాలూ సేవా స్ఫూర్తితో పని చేయాలే తప్ప వ్యాపార ప్రయోజనాల సాధన కోసం కానే కాదు. అయితే, అందుకు అనవసరమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇది జరిగినప్పుడే వాస్తవిక వార్తల సేకరణ జరిగి ప్రభుత్వాలతో పాటు అన్ని ఇతర సంబంధిత ఏజెన్సీలకు చేర్చబడతాయి. నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థ తాలూకు మూడు ముఖ్యమైన అంగాలైన శాసన కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థల పని తీరుని విశ్లేషిస్తూ దాని మనుగడని సుస్థిరం చేయడం కోసం ఫోర్త్ ఎస్టేట్ రూపంలో నిఘానేత్రంతో సదరు రాజ్యాంగ వ్యవస్థలు ఏ మేరకు పనిచేస్తున్నాయో పరిశీలించాల్సిన బాధ్యత నిస్సందేహంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాదే.
రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నవి ఎన్నో!
పూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో, విలువలతో కలిగిన స్ఫూర్తితో జర్నలిజం ముందుకెల్లాలి. ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం ద్వారా సామాజిక అభివృద్ధే కేంద్ర బిందువుగా తమ వ్యాసాలను కొనసాగించాలి. కానీ, నేటి సమాజంలో ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలకు పత్రికల తోడ్పాటు అత్యంత అవసరంగా మారింది. ఫలితంగా ప్రతి రాజకీయ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఓ పత్రికనో, ఛానలో నిర్వహించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సదరు పత్రికలూ, ప్రసార సాధనాలు జర్నలిస్టిక్ స్ఫూర్తికి విరుద్ధంగా పక్కా వ్యాపార దృక్పథంతో తమను సృష్టించిన రాజకీయ పార్టీల ప్రయోజనాల పరిరక్షణ కోసమే పనిచేస్తున్నాయనే విమర్శలున్నాయి. నిజానికి సమకాలీన సమాజంలో క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన సాధారణ వార్తల సేకరణతో పాటు వాటి పరిష్కారం లోనూ, అదే విధంగా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, జీవించే హక్కులకు ఎదురౌతున్న సమస్యలను విశ్లేషించి సరైన పరిష్కారాన్ని సూచించాల్సిన బాధ్యత నిస్సందేహంగా మీడియాదే. అయితే, ఆ స్ఫూర్తికి భిన్నం గా వివిధ రంగాలకు సంబంధించిన విషయ నిపుణులైన విశ్లేషకులు ఆయా పత్రికల్లో ఎడిటోరియల్ పేజీలలో రాసే వ్యాసాలు ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్ర బిందువుగా కాకుండా రాజకీయ పార్టీల రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉపయోగపడడమే ప్రధమ ప్రాధన్యంగా ప్రచురణకు నోచుకుంటాయనే చర్చ ఆందోళన కలిగిస్తోంది. కొన్ని సందర్భాల్లో సదరు రాజకీయ పార్టీల ప్రయోజనాల పరిరక్షణ కోసం, ఆయా పార్టీల ప్రముఖ నేతల పేర్లతో సదరు పత్రికల్లో పనిచేస్తున్న అత్యున్నత స్థాయి పాత్రికేయులే ఘోస్ట్ రైటర్లుగా మారి వారి తరపున విశ్లేషణాత్మక వ్యాసాలు రాసి ప్రచురిస్తున్నారనే భావన పాత్రికేయ విలువల పట్ల శరాఘాతమే.
ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్న ప్రజా పాత్రికేయులు
ప్రభుత్వాల తోడ్పాటు కొరవడి, రాబడుల సేకరణలో భాగంగా యాజమాన్యాలు తమపై విధిస్తున్న ప్రకటనల భారంతో సతమతమవుతూ, అరకొర జీతాలతో దుర్భరమైన జీవితాలను గడుపుతూ, పరిశోధనాత్మక వార్తల ద్వారా నిఖార్సయిన ప్రజా పాత్రికేయులు అనేక మంది వివిధ రూపాల్లో మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సామాజిక రుగ్మతలపై, రాజకీయ, ఆర్థిక నేరస్తులపై, లంచగొండి అధికారులపై, కరడు గట్టిన సంఘ విద్రోహ శక్తులపై తమ కలాలతో రాజీలేని పోరాటాలు చేస్తున్న మాట అక్షర సత్యం. రిపోర్టర్స్ ఫర్ బార్డర్స్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ 2019లో చేసిన అధ్యయనం ప్రకారం ప్రజాసమస్యల పరిష్కారంలో ఓ వాహకంగా పని చేసే ప్రెస్ అండ్ మీడియా రక్షణను ఉద్దేశ పూర్వకంగా బేఖాతరు చేస్తున్న ప్రభుత్వాల ఫాసిస్టు వైఖరి వల్ల మన దేశంలో జోగేంద్ర సింగ్, రాజ్ దేవ్ రంజన్, గౌరీ లంకేశ్ లాంటి ప్రజా పాత్రికేయులతో కలిసి దాదాపు నలభై మందికి పైగా అత్యంత క్రూరంగా హత్య చేయబడ్డారనేది దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ప్రభుత్వాలు సదరు అమానవీయ హత్యలను పత్రికాభిముఖంగా ఖండించినా నేరస్తులెవరో పరిశోధించి శిక్షించలేక పోతున్నాయి. ఈ వైఫల్యాల సాక్షిగా జర్నలిస్టుల భద్రతపై ప్రభుత్వాల చిత్త శుద్ధి ప్రశ్నార్ధకమౌతోంది. వందల సంఖ్యలో పాత్రికేయులు దాడులు, కిడ్నాప్‌కు గురై చిత్ర హింసల పాలవుతున్నారు. ఇలాంటి దురదృష్టకర ఘటనల నేపథ్యంలో 180 దేశాల ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో మన దేశం 161 స్థానంలో కొనసాగుతుండడం మీడియా స్వేచ్ఛ ఎలా ఉందో అర్థం చేసుకోండి. నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్ లాంటి దేశాలు పత్రికా స్వేచ్ఛ తమ ప్రభుత్వాల ప్రధమ ప్రాధాన్యంగా భావించే విధానాల రూపకల్పనతో తొలి ఐదు స్థానాలలో కొనసాగుతుండగా, మిలట్రీ తిరుగుబాట్లతో, అను నిత్యం అంతర్యుద్ధాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్, తాలిబన్లు రాజ్యమేలుతోన్న ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఆఫ్గనిస్తాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా లాంటి ఇస్లామిక్, ఐరోపా, ఆఫ్రికా దేశాలు పత్రికా స్వేచ్ఛలో మనకంటే అత్యంత మెరుగైన స్థితిలో వుండడం నిస్సందేహంగా ఆందోళన కలిగించే అంశం.
ఎలక్ట్రానిక్ మీడియాదీ ఇదే తంతు!
ఇంటర్ నెట్ విస్తృతి సమాచార విప్లవానికి కొత్త ఊపిరులూదుతున్న నేపథ్యంలో సాంప్రదాయ ప్రింట్ మీడియాని తోసిరాజంటూ టెలివిజన్ ఛానెల్స్ 24 గంటల సమాచార పంపిణీతో శర వేగంతో కోట్లాది ప్రజలకు చేరువయ్యే అవకాశమున్న మాట నిజం. ఈ నేపథ్యంలో వివిధ పత్రికలు, ప్రసార సాధనాలలో ప్రచురితమౌతున్న, ప్రసారమౌతున్న వార్తల ద్వారా ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల పని తీరుని, సామాజిక అభివృద్ధి పట్ల సదరు రాజకీయ పార్టీల నైతిక నిబద్ధతను తెలుసుకునే వీలుంది. అందుకే, నేడు దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ తమ పార్టీ భవిష్యత్ కోసం అనివార్యంగా ఓ టెలివిజన్ ఛానెల్‌ను నిర్వహిస్తోంది. సదరు రాజకీయ పార్టీల ప్రయోజనాల పరిరక్షణే ప్రధాన ఎజెండాగా వాటిని సాధించగల సామర్థ్యం గల యాంకర్లూ, వారి సిద్ధాంతాలను బలపరిచే ఆస్థాన విద్వాంసుల లాంటి రాజకీయ విశ్లేషకుల కూర్పుతో వారి రాజకీయ సిద్ధాంతాలను బలపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తుండడం గమనార్హం. అదే సమయంలో రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై బురద జల్లుతూ అబద్ధాలు,అర్థ సత్యాలతో పెయిడ్, ఫేక్ న్యూస్‌తో పాటు, డీప్ ఫేక్ వీడియోలతో, గోబెల్స్ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ పరస్పరం ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న వైనం బహిరంగ రహస్యమే. అయితే, ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ చానెళ్ళలో అవి చేసుకుంటున్న ఆరోపణలూ, ప్రత్యారోపణల వెల్లువలో కొట్టుకపోతున్న పాఠకులూ, వీక్షకులు, గంపగుత్త గా ప్రజలంతా ఏ వార్తలు నిజమో, ఏవి అబద్ధమో తెలుసుకోలేక తీవ్ర గందరగోళానికి గురౌతున్నారు.
అసలేం చేయాల్సి వుంది !
దేశంలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు వంద శాతం స్వతంత్ర ప్రతిపత్తినీ, స్వేచ్ఛ ను సమకూరుస్తూ దానిని కాపాడడం కోసం ప్రభుత్వమే ఓ శాశ్వత చట్ట బద్ధమైన రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిజాలను నిర్భయంగా ముద్రించే పత్రికలకూ, పాత్రికేయులకు అవసరమైన స్వేచ్ఛనూ, చట్ట పరమైన రక్షణను ఏర్పాటుచేయడం కోసం ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ స్థాయి మీడియా సంస్థలతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రెస్ అకాడమీలతో పరిపూర్ణ సమన్వయంతో ప్రభుత్వాలు ముందుకు సాగాలి. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా రంగంలో పని చేసే ఉద్యోగులందరికీ ఓ ప్రత్యేక వేతన కమిటీని ఏర్పాటు చేసి మంచి జీతభత్యాలతో గౌరవ ప్రదమైన జీవితాలను కొనసాగించే ఆర్థిక పరమైన వెసులు బాటుతో పాటు అన్ని సదుపాయాలను కలిగించాలి. దీనితో పాటు దేశంలో పీపుల్స్ జర్నలిజాన్ని ప్రోత్సహించడానికి నెలకొల్పబడిన రాజారాం మోహన్ రాయ్ అవార్డ్, రామ్ నాధ్ గోయెంకా అవార్డ్, భారతేందు హరిశ్చంద్ర అవార్డ్, ఛమేలీ దేవి జైన్ లాంటి అవార్డులతో పాటు మరిన్ని అవార్డులను నెలకొల్పడం ద్వారా సమాజంలో పాత్రికేయ వృత్తి పట్ల గౌరవాన్ని పెంపొందించడం ద్వారా అత్యున్నత స్థాయి బుద్ధిజీవులను ఈ వృత్తి పట్ల ఆకర్షితులయ్యేలా చూడాలి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి గుండె కాయ లాంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడడానికి 1951లో జారీచేసిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం,1995 లో జారీచేసిన కేబుల్ టెలివిజన్ రెగ్యులేషన్ చట్టం,2005 లో జారీచేసిన సమాచార హక్కు చట్టాలను త్రికరణ శుద్ధిగా అమలు పరచడంతో పాటు అదనంగా మరిన్ని ప్రత్యేకమైన చట్టాలను రూపొందించాల్సిన అవసరమెంతైనా వుంది. మన దేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చేర్మన్ జస్టిస్ మార్కండేయ ఖట్జూ అన్నట్లు పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యమనే ప్రెషర్ కుక్కర్‌పై విజిల్ లాంటిది. దానికి ఆటంకం కలిగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ అస్థిత్వమే పెను ప్రమాదంలో పడక తప్పదు. ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా స్వతంత్ర ప్రతిపత్తిని పరిరక్షించడంలో వైఫల్యం చెందినప్పుడు ప్రజాస్వామ్య ప్రియులైన ప్రజలు దాని పరిరక్షణ కోసం విస్తృతమైన దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి తెరదీయక తప్పదని చరిత్ర చాటి చెప్తోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు పూర్తి స్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వడం ద్వారా పత్రికా స్వేచ్ఛ పట్ల తమ చిత్తశుద్దిని రుజువు చేసుకుంటాయో లేదా దానికి భంగం కలిగిస్తూ ప్రజాస్వామ్య ప్రియులైన ప్రజల ఆగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లించుకుంటాయో కాలమే తేల్చి చెప్పాల్సి వుంది.
-డాక్టర్ నీలం సంపత్ (సామాజిక కార్యకర్త)