A Guiding Lamp A Soulmate A Book: చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ, మంచి పుస్తకం మాత్రం కొనుక్కో అన్నాడో మహనీయుడు. ఆస్తులు కరిగిపోతాయి, కానీ, ఎప్పటికీ తరిగిపోనిది, మనతో శాశ్వతంగా ఉండేది విజ్ఞానం మాత్రమే. ఒక్కసారి ఆ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే తుది దాకా విడిచిపోదు. అయితే, పుస్తక పఠనంతోనే విజ్ఞానం మనకు అందుతుంది. ప్రస్తుతం టెక్నాలజీ యుగమైనా, పుస్తకాల వల్ల దొరికే విజ్ఞానం ఎక్కడా దొరకదు. పఠనం అనేది జీవితంలో పెంపొందించుకోవాల్సిన మంచి అలవాటు. మంచి పుస్తకాలు జ్ఞానోదయం కలిగిస్తాయి. మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తాయి. మంచి పుస్తకం కంటే మంచి తోడు లేదు. చదవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ మొత్తం శ్రేయస్సుకు మంచిది. మీరు చదవడం ప్రారంభించిన తర్వాత, సరికొత్త ప్రపంచాన్ని అనుభవిస్తారు. మీరు చదివే అలవాటును ప్రేమించడం ప్రారంభించినప్పుడు చివరికి కొందరు దానికి బానిస అవుతారు. చదవడం వల్ల భాషా నైపుణ్యాలు, పదజాలం అభివృద్ధి చెందుతాయి. పుస్తకాలు చదవడం కూడా విశ్రాంతి, ఒత్తిడిని తగ్గించే మార్గం. ఆరోగ్యకరమైన పనితీరు కోసం మెదడు కండరాలను సాగదీయడానికి ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాల పాటు మంచి పుస్తకాన్ని చదవడం చాలా ముఖ్యం.
చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు
విసుగు, కలత, నిరాశ, ఒంటరిగా లేదా చిరాకుగా ఉన్నప్పుడు పుస్తకాలు నిజంగా మంచి స్నేహితులు. మీకు కావలసినప్పుడు అవి మీతో పాటు ఉంటాయి. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. మంచి పుస్తకాలు ఎల్లప్పుడూ జీవితంలో సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాయి. చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
స్వీయ అభివృద్ధి
పుస్తక పఠనం సానుకూల ఆలోచనను అభివృద్ధి చేయడంలో మీకు సహాయపడుతుంది. చదవడం ముఖ్యం ఎందుకంటే ఇది మీ మనస్సును అభివృద్ధి చేస్తుంది. మీకు అధిక జ్ఞానాన్ని, జీవిత పాఠాలను అందిస్తుంది. ఇది మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది మీ మనస్సును చురుకుగా ఉంచుతుంది. మీ సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచుతుంది.
కమ్యూనికేషన్ స్కిల్స్
పుస్తక పఠనం మీ పదజాలాన్ని మెరుగుపరుస్తుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. మీ భాషను సృజనాత్మకంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. మీ కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడమే కాకుండా మిమ్మల్ని మంచి రచయితగా కూడా చేస్తుంది. జీవితంలోని ప్రతి అంశంలోనూ మంచి కమ్యూనికేషన్ ముఖ్యం.
జ్ఞానాన్ని పెంచుతుంది
పుస్తకాలు సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, ఆరోగ్యం, మనస్తత్వశాస్త్రం, జీవితంలోని అనేక ఇతర అంశాలు మరియు అంశాలలో ఒక సంగ్రహావలోకనం పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. పుస్తకాల నుండి అద్భుతమైన జ్ఞానం, సమాచారాన్ని పొందవచ్చు.
ఒత్తిడిని తగ్గిస్తుంది
మంచి పుస్తక పఠనం కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. రోజువారీ ఒత్తిడి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది మనస్సు, శరీరం, ఆత్మపై అనేక సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది మీ మెదడు కండరాలను ఉత్తేజపరుస్తుంది. మీ మెదడును ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. ఒక పుస్తకాన్ని చదవడం ప్రారంభించిన తర్వాత, చాలా ఆకర్షణీయంగా ఉంటాను, పూర్తి చేసే వరకు దానిని వదిలిపెట్టను అంటారు కొందరు. ఒక మంచి పుస్తకాన్ని చదవడం, దానిని జీవితాంతం ఆదరించడం ఎల్లప్పుడూ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
సృజనాత్మకతను పెంచుతుంది
పుస్తక పఠనం ఊహల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సృజనాత్మకతను పెంచుతుంది. జీవితాన్ని వివిధ కోణాల నుండి అన్వేషించడంలో మీకు సహాయపడుతుంది. మీరు పుస్తకాలు చదువుతున్నప్పుడు మనస్సులో కొత్త సృజనాత్మక ఆలోచనలు, చిత్రాలు , అభిప్రాయాలను రూపొందిస్తారు. ఇది మిమ్మల్ని సృజనాత్మకంగా ఆలోచించేలా చేస్తుంది.
Also Read: ఓటరు చైతన్యం వెల్లివిరియాలి..!
చురుకుగా చదవడం ద్వారా, జీవితంలోని అనేక అంశాలను చదివిన వాటిపై ప్రశ్నించడం అలవాటు అవుతుంది. ఇది ఆలోచనలను అభివృద్ధి చేయడానికి మరియు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడంలో సహాయపడుతుంది. చురుకైన పఠనం ద్వారా మీ మనస్సులో కొత్త ఆలోచనలు కనిపిస్తాయి. ఇది మెదడును ఉత్తేజపరుస్తుంది. అభివృద్ధి చేస్తుంది. మీకు కొత్త దృక్కోణాన్ని అందిస్తుంది. అన్ని సామాజిక సైట్‌లు ఉన్నప్పటికీ ఎక్కువ గంటలు లేదా పని నుండి సుదీర్ఘ సెలవుల కోసం ప్రయాణాలు చాలా బోరింగ్‌గా ఉంటాయి. ఆ సమయంలో పుస్తకాలు ఉపయోగపడతాయి. విసుగు నుండి ఊరట కలిగిస్తాయి. ఒక వ్యక్తి కలిగి ఉండగల ఉత్తమ లక్షణాలలో చదివే అలవాటు ఒకటి. అందుకే పుస్తకాలు బెస్ట్ ఫ్రెండ్ అని పిలుస్తారు. కాబట్టి మంచి పఠన అలవాటును పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. పుస్తక పఠనం యొక్క తీపి ఫలాలను ఆస్వాదించడానికి మనమందరం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు చదవాలి. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని చదవడం చాలా ఆనందంగా ఉంటుంది. మంచి పుస్తకాన్ని చదవడం అనేది ఒక వ్యక్తికి అత్యంత ఆనందదాయకమైన అనుభవం.
ఎంత సాంకేతికత పెరిగినా పత్రికలు, మ్యాగిజైన్స్, పుస్తకాలు ఇలా అన్నింటిలో విలువైన సమాచారం ఉంటుంది. నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన అంశాలు, జీవన గమనంలో వినియోగించుకోవడానికి సందర్భోచితంగా మాట్లాడి రాయడానికి కూడా ఎంతో ఉపయోగపడుతాయి. అయితే, ఒక పుస్తకంలో ఉన్నటువంటి సమాచారం ఆ రచయిత యొక్క స్వీయ అనుభవాలు, జ్ఞాపకాలు అవగాహన ఆలోచన ధోరణి కావచ్చు. లేక పొందిన అనుభవాలను సిద్ధాంతికరించి సర్వజన ఆమోదం కోసం రాసినవి కూడా కావచ్చు . మెజారిటీ ప్రజానీకం కోసం సమాచారం, సమస్యలు, పరిష్కారాలు జీవన ఇతివృత్తాలతో కూడినటువంటి పుస్తకాలకు గుర్తింపు జీవితకాలం ఉంటుంది. పుస్తకాలు అంటే జ్ఞాన భాండాగారాలు అని మాత్రమే పరిమితం చేయడం సమంజసం కాదు. “వ్యక్తి జీవితాలను తీర్చిదిద్ది, సమాజ గతిని మార్చి, భవిష్యత్తు తరాలకు మార్గాన్ని చూపగలిగే సత్తా పుస్తకాలలో ఉంటుంది” అని గుర్తించినప్పుడు మాత్రమే వీటి యొక్క ప్రాధాన్యతను నేటి తరం గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ వైపుగా యువతను కార్యోన్ముఖులను చేయవలసిన బాధ్యత ఆలోచనపరులు అందరి పైనా ఉన్నది. పుస్తకాలకు సంబంధించిన మరింత సమాచారం సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, విజ్ఞానం ఏదో రూపంలో దర్శనమిచ్చే కొత్త కొత్త అవకాశాలు కల్పించబడినప్పటికీ ఆ రూపాలు పుస్తకానికి ప్రత్యామ్నాయాలు మాత్రం కావు. చేతిలో పుస్తకం ఉంటే దాని విలువ ,అర్థము, ఉనికి, ఇతరుల పైన చూపే ప్రభావం గొప్పగా ఉంటుంది. అదే దానికి బదులుగా సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని వ్యాసాలు చదవడం ప్రసంగాలు వినడం చేస్తూ పోతే మనసు ఒకచోట మనిషి ఒకచోట అన్నట్లుగా పరధ్యా నంలో మునిగిపోయే ప్రమాదం ఉన్నది. “ఉపాధ్యాయునికి ప్రొజెక్టర్ల యంత్రాలు ఎన్ని ఉన్నా బోధనకు ప్రత్యామ్నాయాలు మాత్రం కావు. ఫేస్బుక్, వీడియో, యూట్యూబ్ వంటి అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ పుస్తకం యొక్క ఉనికి చూపే ప్రభావం గొప్పగా ఉంటుంది. కనుకనే దాని విలువ తరతరాలకు నిలిచి ఉంటుంది”. పూర్వకాలంలో సంపాదించిన జ్ఞానాన్ని తాళపత్రాల మీద రాసి విలువైన సమాచారాన్ని భద్ర పరిచారు కనుకనే ప్రస్తుతం అవి మనకు తర్జుమా చేసుకోవడానికి ఇతర రూపాల్లోనికి మార్చుకోవడానికి అవకాశం కలిగింది. కాగితమును కనుగొన్న తర్వాత పుస్తక ప్రచురణ కొంత సులభతరమైనప్పటికీ 15వ శతాబ్దంలో వచ్చిన అచ్చు యంత్రం కారణంగా పుస్తకాల ముద్రణ ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా విస్తృతం కావడాన్ని మనం గమనించవచ్చు . ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, భద్ర పరచుకోవడం, చర్చించుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం కారణంగా ప్రపంచం ఇవాళ ఒక కుగ్రామంగా మారుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు.
Also Read:ప్రచారం ముగిసింది, ఇక నిర్ణయమే బాకీ..
క్రీస్తుపూర్వం భారతదేశంలో పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి నలంద తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలను ఇతర దేశస్తులు విద్యార్థులు సందర్శించి విలువైన పుస్తకాలను చదివే వాళ్ళని ఇతర భాషల్లోకి తర్జుమా చేసుకోవడం ద్వారా జ్ఞాన సమపార్జన, పంపిణీ విస్తృతంగా జరిగినట్లు తెలుస్తున్నది. అంటే పుస్తకాలతో మన దేశానికి అనాదిగా ఉన్న అనుబంధాన్ని మనం ఇలాంటి ఉదాహరణల ద్వారా గమనించవచ్చు. ఇటీవల కాలంలో మాస పత్రికలు త్రైమాస పత్రికలు, వార్షిక పత్రికలు, వార పత్రికల పేరుతో అనేక మంది రచయితల రచనలను ప్రచురిస్తూ పుస్తక రూపంలో రావడం ఒక ఎత్తు అయితే, రచయితలు తాము రాసినటువంటి సిద్ధాంత వ్యాసాలు, థాత్విక అంశాలు, జీవిత చరిత్రలు, ఉద్యమ నేపథ్యం గల అంశాలతో పుస్తకాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి రావడానికి గమనించవచ్చు. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ, స్వాతంత్ర్య పోరాటంలోనూ, ఇటీవలి కాలంలో రాష్ట్రాల ఆవిర్భావ ఉద్యమాలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వేలాది పుస్తకాలు అందుబాటులోకి రావడాన్నీ గమనించినట్లయితే పుస్తకం కూడా ఒక సామాజిక పరిణామ శక్తిగా మారినట్లు ఉద్యమ నేపథ్యంలో లక్ష్యాలు నెరవేరినట్లు రాజులను రాజ్యాలను కూడా దించి ప్రజలకు అనుకూలమైన పాలన తీసుకువచ్చే క్రమంలో పుస్తకాలు కూడా ప్రధాన పాత్ర పోషించినట్లుగా మనం అంగీకరించి తీరాలి. ఇంత సమున్నతమైన ప్రాధాన్యత కలిగి ఉన్న పుస్తకానికి ప్రత్యేకతను ఆపాదించే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచన క్రమంలో ఉద్భవించినది ఏటా ఏప్రిల్ 23వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవం. ప్రముఖ ఆంగ్ల రచయితలు విలియం షేక్స్ పియర్, మిగ్గిల్, గార్ శిలా సోడిలా వేగ ముగ్గురు కూడా మరణించిన తేదీ ఏప్రిల్ 23 కావడంతో వీరి మృతికి గుర్తుగా యునెస్కో 1995లో ప్రపంచ పుస్తక దినోత్సవం గా ప్రకటించడం జరిగింది. అప్పటినుండి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో పుస్తక దినోత్సవం జరుపుకోవడం ఆ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పుస్తకాల యొక్క ప్రాధాన్యతను విస్తృత పరచడం జరుగుతున్నది. దీని నుండి స్ఫూర్తిని చైతన్యాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాల్సిన అవసరం ఉంది.
మానవ జీవితం పైన విశేష ప్రభావాన్ని చూపగలిగిన పుస్తకంపై నేటి యువతకు ఆసక్తి లేకపోగా అశ్రద్ధ పెరగడం పట్ల ఆందోళన చెందవలసిన అవసరం ఏర్పడింది. లాప్టాప్ లు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి యంత్రాలను వినియోగిస్తూ ఆడుకుంటున్నట్లు జీవన గమనంలో కనిపించినప్పటికీ పుస్తక పఠనం పట్ల కనీసమైన శ్రద్ధ చూపినట్లు మనకు ఆధారాలు దొరకడం లేదు. ఇది చాలా బాధాకరం. ప్రతి ఇంట్లో ఒకప్పుడు పుస్తకాలు, అనేక రకాల గ్రంథాలు కనపడేవి. ఇప్పుడు ఆ కాలం పోయింది. నేటి తరం వాటికి దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రపంచ గతిని, మానవ పరిణామ క్రమాన్ని, జీవన రహస్యాలను విప్పి చెప్పగలిగిన పుస్తకం అందులోని దాగి ఉన్న జ్ఞానం ఇంతటితో మూగబోకూడదు. భవిష్యత్తు తరాలకు కూడా అందాల్సినటువంటి తరుణంలో దానిని వినియోగించడం నిత్యం పాటించడం వివిధ రకాల సామాజిక రాజకీయ ఆర్థిక చారిత్రక పుస్తకాలను పరామర్శక గ్రంథాలుగా నైనా అప్పుడప్పుడు చూడడం ద్వారా ప్రతి మనిషి సమాజాన్ని ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యాలయాలు విశ్వవిద్యాలయాలలో పుస్తక భాండాగారాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల వాటి నిర్వహణ సరిగా లేకపోవడం, మరికొన్నిచోట్ల ఆసక్తి కనపరచకపోవడం, మరికొన్నిచోట్ల పుస్తకాల కొరత, అనేక గ్రామాలు, పట్టణాలలో గ్రంథాలయాల యొక్క అందుబాటు సరిగా లేకపోవడం వంటి అనేక కారణాలు కూడా యువతకు శ్రద్ధ సన్నగిల్లడానికి కారణాలు అవుతున్నవి. పుస్తకం సమస్యల పరిష్కారాన్ని ఇస్తుందని అంగీకరించినప్పుడు మనం సమయం కేటాయించకపోవడం, చిన్న చూపు చూడడం వాటిని నిర్లక్ష్యం చేయడం క్రమంగా శిథిలావస్థలోకి చేరుకోవడంతో పట్టించుకోకపోవడం వంటి మన అవలక్షణాలను మార్చుకోవాల్సిన సందర్భం ఇది. నాటి నేటి తరాలు యువతలో పుస్తకాలకూ సంబంధించినటువంటి ప్రాముఖ్యతను, చెడు అలవాట్లను దూరం చేసి మంచి స్నేహితులతో సమానమని కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి భరోసానిస్తుందనేటువంటి సందేశాన్ని నేటి యువతకు కల్పించవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది. ముఖ్యంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఈ విషయం పట్ల తాము ఆచరిస్తూ విద్యార్థులచే ఆచరింపచేసే విధంగా పుస్తక పఠనానికి ప్రత్యేక సమయాలను కేటాయించడం ద్వారా పుస్తకం యొక్క ప్రచారాన్ని ప్రాధాన్యతను ఈ కష్టకాలంలో ఇనుమడింపచేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. అది మన అందరి యొక్క సామాజిక బాధ్యతగా భావించుదాం. ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడంతోపాటు ప్రతి ప్రజాప్రతినిధి, శాసనసభ్యులు, మంత్రులు విధిగా పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని డిమాండ్ చేద్దాం. పుస్తకాలను చదవలేని ప్రజాప్రతినిధులకు ఈ దేశాన్ని పాలించే అర్హత లేదు అని హెచ్చరించడానికి మనం వెనుకాడవలసిన అవసరం లేదు. పుస్తక పఠనం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య, వికాసానికి మేలు చేయడంతో పాటు జీవన ప్రమాణాలను పెంపొందించుకోవడానికి ఎంతో తోడ్పడుతుందని గుర్తించడం చాలా అవసరం.
-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి (కాకతీయ విశ్వవిద్యాలయం)