China CR450 Train: ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో రైల్ నెట్‌వర్క్ కలిగిన దేశాల్లో అగ్రస్థానంలో నిలిచిన చైనా మరో ఘనత సాధించింది. వరల్డ్ రైల్వే టెక్నాలజీలోనే సరికొత్త మైలురాయిని చేరుకుంది. గంటకు ఏకంగా 453 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలుని (China CR450 Train) అందుబాటులోకి తీసుకొచ్చింది. తదుపరి తరానికి చెందిన ఈ బుల్లెట్ రైలు పేరు సీఆర్450 (CR450). షాంఘై – చెంగ్డూ మధ్య నిర్వహిస్తున్న ట్రయల్ రన్స్‌లో ఈ హైస్పీడ్ రైలు విజయవంతంగా పరుగులు పెడుతోంది. ట్రయల్ రన్‌లో గరిష్ఠంగా గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. మిగతా ట్రయల్ రన్ కూడా పూర్తయిన తర్వాత ఈ రైలు చైనీయులకు అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే హై-స్పీడ్ నెట్‌వర్క్‌గా ఇది నిలవబోతోంది.
సీఆర్450 ట్రైన్ గరిష్టంగా గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని, అయితే, నిర్వహణ వేగం మాత్రం గంటకు 400 కిలోమీటర్లుగానే ఉంటుందని ‘సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ’ పేర్కొంది. ప్రస్తుతం మరిన్ని విస్తృత స్థాయి క్వాలిఫికేషన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అన్ని విధాలుగా సేఫ్టీ టెస్టులు నిర్ధారించిన తర్వాత అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ట్రైన్ ఆగి ఉన్న ప్రదేశం నుంచి కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో గంటకు 350 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ట్రైన్ ప్రొపల్షన్ (చలనం), బ్రేకింగ్ వ్యవస్థలకు అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Read Also- Samosa Dispute: సమోసా విషయంలో ఘర్షణ.. ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన మహిళ
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇటీవల నిర్వహిచిన ట్రయల్ రన్ సమయంలో రెండు సీఆర్450 రైలు పక్కపక్క ట్రాక్‌లపై వేగంగా క్రాస్ అవుతూ వెళ్లాయి. ఆ సమయంలో వాటి సంయుక్త వేగం (combined speed) గంటకు 896 కిలోమీటర్లుగా నమోదయింది. రైళ్ల క్రాసింగ్‌లో ఇది కొత్త ప్రపంచ రికార్డు అని చైనా ఇంజనీర్లు చెబుతున్నారు. దీనికంటే ముందు సీఆర్400 ఫుక్సింగ్ రికార్డ్ ఉందని గుర్తుచేశారు. సీఆర్400 ట్రైన్ ప్రస్తుతం వాణిజ్య కార్యకలాపాలు అందిస్తోందని, చక్కటి పురోగతి నమోదు చేస్తోందని ప్రస్తావించారు.
సీఆర్450 లక్షణాలివే
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే సీఆర్450 ట్రైన్‌కు పలు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. గాలి నిరోధక (aerodynamic) ప్రభావం పెద్దగా ఉండకుండా మరింత పొడవాటి ముక్కు (nose) డిజైన్‌తో దీనిని తయారు చేశారు. అలాగే, రూఫ్‌లైన్‌ను (పైకప్పు) 20 సెంటీమీటర్ల మేర తగ్గించారు. మొత్తంగా ఈ ట్రైన్‌ను 50 టన్నులకు తగ్గించారు. కీలకమైన ఈ మార్పుల ద్వారా గాలి నిరోధకత 22 శాతం తగ్గిందని, తద్వారా ట్రైన్ శక్తి సామర్థ్యాలు పెరిగాయని ఇంజనీర్లు చెబుతున్నారు. కాగా, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు సీఆర్450 ట్రైన్‌ను ఏకంగా 6 లక్షల కిలోమీటర్ల మేర తిప్పనున్నారు. ఇంత సుధీర్ఘ ప్రయాణం తర్వాత ఎటువంటి లోపాలు లేవని నిర్దారించుకున్నాక, మిగతా అన్నీ పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే దీనిని అందుబాటులోకి తీసుకొస్తారు. చైనా రైల్వే విభాగం ఈ మేరకు అత్యంత పకడ్బంధీ ప్రమాణాలను పాటిస్తోంది.
