Samosa Dispute: ఒక్కోసారి చిన్నచిన్న గొడవలు కూడా చిలికిచిలికి గాలివానలా పెద్దగా మారిపోతాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీసేంత వరకు వెళతాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరగగా, తాజాగా ఇదేకోవకు చెందిన షాకింగ్ ఘటన బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. సమోసా విషయంలో తలెత్తిన ఘర్షణ (Samosa Dispute) ఓ పెద్దాయన ప్రాణాలు తీసింది. భోజ్‌పుర్ జిల్లాలోని కౌలోదిహారి గ్రామానికి చెందిన చంద్రమ యాదవ్ 65 ఏళ్లను రైతును ఓ మహిళ పదునైన ఆయుధంతో పొడిచి చంపింది. ఆదివారం నాడు వృద్ధుడిపై దాడి జరగగా, చికిత్స పొందుతూ సోమవారం హాస్పిటల్లో చనిపోయాడు.
కౌలోదిహారి గ్రామానికి చెందిన ఒక పిల్లాడు, ఆశా దేవీ అనే మహిళ నడుపుతున్న దుకాణానికి సమోసాలు కొనడానికి ఓ షాప్‌కి వెళ్లాడు. అయితే, సమోసా రేటు విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆశాదేవీ పిల్లలు బాలుడిపై దాడి చేయడమే కాకుండా, సమోసాలు కూడా లాక్కోవడం ఈ ఘర్షణకు కారణమైంది. తన మనువడిని కొట్టినప్పటికీ, పిల్లల మధ్య జరిగిన గొడవగా భావించిన చంద్రమ యాదవ్, సమోసా షాపు వద్దకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ, ఆశాదేవీతో మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఘర్షణ జరుగుతున్న క్రమంలో ఆమె కత్తి (ఖడ్గం) తీసుకొని వచ్చి చంద్రమ యాదవ్ తలపై బలంగా కొట్టింది.
ఈ దాడిలో చంద్రమ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు పాల్పడ్డ మహిళ పరారీలో ఉండడంతో ఆమె కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఘటన చౌరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చనిపోయిన వ్యక్త శరీరంపై, తలపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు ఉన్నాయని చంద్రమా యాదవ్ మేనల్లుడు దేవముని సింగ్ యాదవ్ చెప్పాడు. ఒక సమోసా ధర విషయంలో చిన్న వాగ్వాదం జరిగిందని తెలిపాడు.
తొలుత గొడవ జరిగిన సద్దుమణిగిందని, అయితే, ఆదివారం ఉదయం చంద్రమా యాదవ్ మళ్లీ ఆశా దేవి దుకాణానికి వెళ్లినప్పుడు, మళ్లీ రాజుకుందని చెప్పాడు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా జరిగి, దాడికి దారితీసిందన్నారు. వెంటనే ఆయనను ఆరా సదర్ హాస్పిటల్‌లో చేర్చామని, కానీ, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు పాట్నాకు రెఫర్ చేశారని వివరించాడు. చికిత్స పొందుతూ, సోమవారం రాత్రి ఆయన మరణించారని దేవముని సింగ్ యాదవ్ తెలిపాడు. ఈ హత్యకు ఆశా దేవి, ఆమె పిల్లలే కారణమని ఆరోపించాడు.
Read Also- Viral-news (Image source Viral News)Jupally Krishna Rao: రైతులకు న్యాయం జరిగేలా క్షేత్రస్థాయిలో పని చేయాలి.. అధికారులకు మంత్రి జూపల్లి కీలక అదేశాలు
ఈ ఘటనపై చౌరీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జయరామ్ శుక్లా మాట్లాడుతూ, అక్టోబర్ 18న సాయంత్రం జరిగిన దాడిలో తీవ్రమైన గాయాల కారణంగానే యాదవ్ మరణించినట్లు చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ ఘర్షణ మొదటిరోజు సద్దుమణిగినప్పటికీ, రెండవ రోజు నిందితులు మళ్లీ ఉద్దేశపూర్వకంగా మొదలుపెట్టి, ఆ వృద్ధుడిపై దాడి చేసినట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
